అబుదాబిలో దీపావళి వేడుకల్లో పాల్గొన్న షేక్ నహ్యాన్ బిన్ ముబారక్..
- November 09, 2026
అబుదాబి: యూఏఈలో సహనం, మత సామరస్యం, శాంతియుత సహజీవనం ప్రతిరోజూ ఆచరణలో కనిపిస్తున్నాయని సహనం, సహజీవన శాఖ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ అన్నారు. అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ మందిరంలో నవంబర్ 8, ఆదివారం సాయంత్రం నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏడు ఎమిరేట్ల ఐక్యతకు ప్రతీకగా రూపొందించిన ‘యూనిటీ ఆఫ్ లైట్స్’ కార్యక్రమాన్ని షేక్ నహ్యాన్ ప్రారంభించారు. ఇందులో వెలిగించిన ఏడు కాంతి కిరణాలు యూఏఈలోని ఏడు ఎమిరేట్లను సూచిస్తాయని, దేశ ఐక్యత, బలాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు.
ఈ వేడుకలకు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం ఛైర్మన్ షమీస్ అలీ ఖల్ఫాన్ అల్ ధహేరి, భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ ఎమ్మాడి విష్ణువర్ధన్ రెడ్డి, వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మత, సామాజిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
మందిరానికి చేరుకున్న షేక్ నహ్యాన్‌కు స్వామి బ్రహ్మవిహారిదాస్ సంప్రదాయ పూలమాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం షేక్ నహ్యాన్ దీపావళి దీపాన్ని వెలిగించి, సంప్రదాయ అన్నకూట్ వేడుకలను వీక్షించారు. భారతీయ సమాజానికి చెందిన కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
యూఏఈలో మత సామరస్యం, సహజీవనం ఆదర్శప్రాయం
మందిరం యాంఫీథియేటర్‌లో వేలాది మంది సమక్షంలో ప్రసంగించిన షేక్ నహ్యాన్, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దార్శనిక నాయకత్వంలో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రజలు గౌరవంగా జీవిస్తూ, తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరిస్తూ, సంప్రదాయాలను కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
చెడుపై మంచి, చీకటిపై వెలుగు, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన అన్నారు. మతం, సంస్కృతి, నేపథ్యాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వర్తించే విలువలను ఈ పండుగ గుర్తుచేస్తుందని తెలిపారు. దయ, పరస్పర అవగాహన, గౌరవం సమాజంలోని ప్రజలను ఒక్కటిగా కలుపుతాయని పేర్కొన్నారు.
యూఏఈలో నిర్వహిస్తున్న ‘ఇయర్ ఆఫ్ ది ఫ్యామిలీ’ నేపథ్యంలో దీపావళికి మరింత ప్రత్యేకత ఉందని అన్నారు. ఈ పండుగ తరతరాలను ఒక్కచోట చేర్చి కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుందని, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంప్రదాయాలు, విలువలను అందిస్తుందని వివరించారు. బలమైన కుటుంబాలు, బలమైన సమాజ నిర్మాణానికి పునాదులని పేర్కొన్నారు.
భారత్-యూఏఈ స్నేహబంధానికి ప్రతీక దీపావళి
భారత్, యూఏఈ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహసంబంధాలు, పరస్పర విశ్వాసం, సహకారం ఎంతో విలువైనవని షేక్ నహ్యాన్ అన్నారు. ఈ రెండు దేశాల సంబంధాలు కేవలం ప్రభుత్వాల మధ్య ఒప్పందాలకే పరిమితం కాలేదని, ప్రజల మధ్య ఉన్న అనుబంధమే వాటికి అసలైన బలమని పేర్కొన్నారు.
యూఏఈ అభివృద్ధి, విజయాల్లో భారతీయ సమాజం కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారతీయులు తమ కష్టపడి పనిచేసే స్వభావం, ప్రతిభ, వ్యాపార నైపుణ్యం, అంకితభావంతో దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలకు విశేషంగా తోడ్పడుతున్నారని అన్నారు. యూఏఈ జాతీయ సమాజంలో భారతీయుల భాగస్వామ్యాన్ని ఎంతో గౌరవిస్తున్నామని తెలిపారు.
మందిరానికి సహకరిస్తున్న స్వామి బ్రహ్మవిహారిదాస్‌కు కృతజ్ఞతలు
ఈ సందర్భంగా స్వామి బ్రహ్మవిహారిదాస్ మాట్లాడుతూ, బీఏపీఎస్ హిందూ మందిరానికి షేక్ నహ్యాన్ అందిస్తున్న ప్రోత్సాహం, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ గతంలో పేర్కొన్న ప్రతి ఒక్కరూ యూఏఈలో ఎమిరాతీలేనన్న సందేశాన్ని గుర్తుచేశారు. యూఏఈని రెండో ఇల్లుగా భావించిన భారతీయులకు ఇక్కడి భద్రత, సామరస్యం కారణంగా ఇప్పుడు ఇదే మొదటి ఇల్లుగా మారిందని వ్యాఖ్యానించారు.
దీపావళి సందర్భంగా బయట మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ అంతరంగంలోనూ జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలని సూచించారు. శాంతి, ప్రేమ, సామరస్యానికి బీఏపీఎస్ మందిరం ఒక కేంద్రంగా నిలుస్తోందని తెలిపారు.
వెయ్యికి పైగా వంటకాలతో అన్నకూట్ ప్రత్యేక ప్రదర్శన
దీపావళి వేడుకల్లో భాగంగా సంప్రదాయ హిందూ అన్నకూట్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. భగవంతుడి పట్ల కృతజ్ఞతను చాటుతూ బీఏపీఎస్ మహిళా వాలంటీర్లు వెయ్యికి పైగా సాత్విక వంటకాలను సిద్ధం చేశారు.
యుద్ధం ప్రారంభమైన తొలిరోజుల్లో మందిరంలో ఆశ్రయం పొందిన ‘ట్రికీ’ అనే చిన్న కాకటైల్ పక్షిని స్వాములు సంరక్షించి తిరిగి ఆరోగ్యవంతంగా చేయడం ఈ ఏడాది అన్నకూట్ ప్రదర్శనకు స్ఫూర్తిగా నిలిచింది. వివిధ దేవతలకు సంబంధించిన పక్షుల ఆకృతులను రూపొందించి భక్తి, జ్ఞానం, ధైర్యం, సామరస్యాన్ని ప్రతిబింబించారు.
అదేవిధంగా అట్లాంటిస్, ఎతిహాద్ రైల్, ఇయర్ ఆఫ్ ది ఫ్యామిలీ, దుబాయ్ మిరాకిల్ గార్డెన్ వంటి అంశాలను ప్రతిబింబించే ఆహార నమూనాలు, నెమళ్లు, హంసల ఆకృతులు, భక్తులు స్వయంగా తయారుచేసిన కేకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సాత్విక ఆహారాన్ని సమాజంలోని ప్రజలు, కార్మిక శిబిరాల్లోని కార్మికులు, అవసరమైన ఇతర వర్గాలకు పంపిణీ చేయనున్నారు. భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ ఎమ్మాడి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రసాద పంపిణీ కేంద్రంలో స్వచ్ఛందంగా సేవలందించారు.
ఐదు రోజుల్లో 30 వేల మందికి పైగా సందర్శన
నవంబర్ 6 నుంచి 10 వరకు ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న దీపావళి వేడుకలకు తొలి రెండు రోజుల్లోనే 30 వేల మందికి పైగా సందర్శకులు హాజరయ్యారు.
బీఏపీఎస్ హిందూ మందిరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 100కు పైగా దేశాలకు చెందిన దాదాపు 50 లక్షల మంది సందర్శకులు ఈ మందిరాన్ని సందర్శించారు. వివిధ దేశాలు, సంస్కృతులు, మతాలకు చెందిన ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ మత సామరస్యం, సాంస్కృతిక పరస్పర అవగాహనకు ఈ మందిరం వేదికగా నిలుస్తోంది.


తాజా వార్తలు
- అబుదాబిలో దీపావళి వేడుకల్లో పాల్గొన్న షేక్ నహ్యాన్ బిన్ ముబారక్..
- ఖతార్‌లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..
- హజ్ 2027కు భారత్‌కు 1,75,025 మంది యాత్రికుల కోటా..
- దుబాయ్‌లో మరో కీలక పెడెస్ట్రియన్ బ్రిడ్జి..
- ఇరాన్‌కు ఆయుధాల సరఫరాను అడ్డుకోవడమే అమెరికా వ్యూహం!
- ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత
- లడఖ్‌లో ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్
- రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ
- ఒమన్‌లో కొత్త పర్యాటక ప్రాజెక్టు ‘అల్ యజాన్’..!!
- సౌదీ–అమెరికా మధ్య వాణిజ్యం పెంపునకు కొత్త ప్రణాళికలు..!!







