ఖతార్‌లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..

- November 09, 2026 , by Maagulf
ఖతార్‌లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..

దోహా: ఖతార్‌లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవంబర్ 5, 2026న లోయోలా ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ (APWA) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

ఈ కార్యక్రమానికి ఖతార్‌లో భారత రాయబారి డాక్టర్ కె.శ్రీకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్) లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. ఖతార్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు భారత రాయబార కార్యాలయం నిరంతరం అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా బ్లూ కాలర్ ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలు, సంస్కృతి, కళా వైభవాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

ఖతార్‌లోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com