సౌదీలో పొగాకు విక్రయాలపై హెచ్చరిక.. SR5,000 జరిమానా..!

- November 11, 2026 , by Maagulf
సౌదీలో పొగాకు విక్రయాలపై హెచ్చరిక.. SR5,000 జరిమానా..!

రియాద్: సౌదీ అరేబియాలో 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించినా, అందించినా కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపాలిటీలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపార సంస్థలకు గరిష్ఠంగా SR5,000 జరిమానా విధించడంతో పాటు దుకాణాలను తప్పనిసరిగా మూసివేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రెండోసారి కూడా అదే తప్పిదానికి పాల్పడితే జరిమానా రెట్టింపు అవుతుందని తెలిపింది.

మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడమే కాకుండా, పొగాకు విక్రయానికి ప్రత్యేకంగా కేటాయించిన దుకాణాలు లేదా ప్రాంతాల్లోకి 18 ఏళ్లలోపు వారిని అనుమతించడం కూడా నిషేధమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొనుగోలుదారుడి వయస్సుపై సందేహం ఉంటే గుర్తింపు పత్రం ద్వారా వయస్సును నిర్ధారించుకునే హక్కు సెల్లర్లకు ఉందని తెలిపింది.

ఈ రెండు ఉల్లంఘనలను తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తామని, సంబంధిత మున్సిపాలిటీ లేదా స్థానిక అధికార సంస్థలను బట్టి ఒక్కో ఉల్లంఘనకు గరిష్ఠంగా SR5,000 జరిమానా విధిస్తామని వివరించింది. ఇక పొగాకు విక్రయించే దుకాణాల్లో స్మోకింగ్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేసే హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అలాగే చట్టబద్ధమైన వయస్సు లేనివారికి దుకాణంలోకి ప్రవేశం, పొగాకు విక్రయాలు నిషేధమని స్పష్టంగా ప్రదర్శించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

అంతేకాకుండా సిగరెట్లను ఒక్కొక్కటిగా విక్రయించడం, ఉచితంగా పొగాకు ఉత్పత్తులను పంపిణీ చేయడం, బహుమతులు, బహుమతి పథకాలు లేదా నమూనాల రూపంలో అందించడంపై కూడా నిషేధం ఉందని గుర్తుచేశారు. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) నిర్దేశించిన ప్రమాణాలను కూడా వ్యాపార సంస్థలు తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించారు.

దుకాణాల యజమానులు నిబంధనలను పూర్తిగా పాటించడంతో పాటు, తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు కూడా చట్టాలు, జరిమానాలపై అవగాహన కల్పించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. పొగాకు ఉత్పత్తుల విక్రయం, సరఫరాకు సంబంధించిన పూర్తి నిబంధనలను మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com