ఖతార్ పాఠశాలల్లో వేధింపులకు చెక్..!!

- November 16, 2026 , by Maagulf
ఖతార్ పాఠశాలల్లో వేధింపులకు చెక్..!!

దోహా: పాఠశాలల్లో విద్యార్థులపై వేధింపులను (బుల్లీయింగ్) అరికట్టేందుకు ఖతార్ విద్య, ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ (MoEHE) చర్యలను ముమ్మరం చేస్తోంది. విద్యార్థుల్లో పరస్పర గౌరవం, సహనం, ఇతరుల అభిప్రాయాలను అంగీకరించే లక్షణాలను పెంపొందించడంతోపాటు, వారినే గౌరవం, సహనానికి ప్రతినిధులుగా తీర్చిదిద్దుతోంది. పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి సురక్షితమైన, సమాన అవకాశాలతో కూడిన విద్యా వాతావరణాన్ని కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

అంతర్జాతీయ బుల్లీయింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంత్రిత్వ శాఖలోని పాఠశాల, విద్యార్థుల వ్యవహారాల విభాగం ‘మై స్కూల్, మై కమ్యూనిటీ’ ప్రాజెక్టులో భాగంగా ‘రెస్పెక్ట్ అండ్ టాలరెన్స్ అంబాసిడర్స్’ పేరుతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల సైకాలజిస్టులు, సామాజిక కార్యకర్తలు, తల్లిదండ్రులు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ అధికారులు, ఇతర సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో గౌరవం, సహనం, ఇతరులను అంగీకరించే మనస్తత్వాన్ని పెంపొందించడం, వేధింపులను అరికట్టడంలో వారిని భాగస్వాములను చేయడం ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకుందని పాఠశాల, విద్యార్థుల వ్యవహారాల విభాగం డైరెక్టర్ మరియం అల్-నిస్ఫ్ అల్-బుఐనైన్ పేర్కొన్నారు.

విద్యార్థులపై వేధింపుల వల్ల కలిగే విద్యాపరమైన, మానసిక, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడంతోపాటు హింసకు దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సానుకూల ప్రవర్తనను పెంపొందించడం, పరస్పర సహకారంతో కూడిన సంబంధాలను అభివృద్ధి చేయడం, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యమని విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఫాతిమా యూసుఫ్ అల్-ఉబైద్లీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఇతరుల పట్ల గౌరవం, సానుభూతి, సహనం వంటి విలువలను పెంపొందించాలని సూచించారు. బుల్లీయింగ్ అనేది విద్యాపరమైన, సామాజిక సమస్య అని, దీన్ని అరికట్టేందుకు తల్లిదండ్రులు, పాఠశాలలు, సమాజం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు గౌరవం, సహనానికి ప్రతినిధులుగా మారి తోటి విద్యార్థులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ప్రత్యేక మీడియా ప్రచారాన్ని 2026 అక్టోబర్ 1న ప్రారంభించారు. ఇది 2027 ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుంది. వేధింపుల స్వరూపం, రకాలు, వాటి వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు సురక్షితంగా స్పందించడం, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలలు, కుటుంబాలు, సామాజిక సంస్థల మధ్య సహకారాన్ని మరింత పెంచనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com