విశాఖ–తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు

- November 19, 2026 , by Maagulf
విశాఖ–తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేస్తోంది. విశాఖపట్నం–తిరుపతి మార్గంలో కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు ఎంపీలు చేసిన విజ్ఞప్తులపై రైల్వే శాఖ సానుకూలంగా స్పందించడంతో ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు కదులుతోంది. మార్గం, స్టాపులు, సమయాలకు సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తవగా, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.

స్లీపర్‌కు బదులు పగటిపూట వందేభారత్.. ప్రస్తుత సర్వీసులివే
విశాఖపట్నం నుంచి ప్రస్తుతం సికింద్రాబాద్‌కు రెండు, భువనేశ్వర్‌కు ఒకటి, దుర్గ్‌కు ఒకటి చొప్పున నాలుగు వందేభారత్ సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోవైపు విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరు వరకు రాత్రిపూట వందేభారత్ స్లీపర్ రైలు నడపాలనే డిమాండ్ ఉన్నప్పటికీ, ఆ అంశంపై వచ్చే ఏడాది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాఖ – తిరుపతి మధ్య పగటిపూట ఈ వందేభారత్ రైలును ప్రారంభించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు.

ప్రాథమిక షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్ల వివరాలు
ప్రాథమిక ప్రణాళిక ప్రకారం, ఈ వందేభారత్ రైలు ఉదయం 5:35 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి, సామర్లకోట (7:00), రాజమండ్రి (7:40), విజయవాడ (9:30), ఒంగోలు (10:55), నెల్లూరు (12:15) మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 2:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:55 గంటలకు తిరుపతిలో బయల్దేరి నెల్లూరు (4:48), ఒంగోలు (6:08), విజయవాడ (7:25), రాజమండ్రి (9:23), సామర్లకోట (10:03) స్టేషన్లలో ఆగుతూ రాత్రి 11:30 గంటలకు విశాఖ చేరుకునేలా వేళలను రూపొందించారు. సాంకేతిక సమీక్ష అనంతరం తుది టైమ్‌టేబుల్‌ను రైల్వే శాఖ ఖరారు చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com