హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్ యాత్ర’..
- November 19, 2026
హైదరాబాద్: డ్రగ్స్ మహమ్మారి పై పోరాటానికి సినీ, రాజకీయ రంగాలు కలిసి ముందుకు వస్తున్నాయి. యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న మత్తుపదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నెల 25, 26, 27వ తేదీల్లో హైదరాబాద్‌లో ఈ యాత్రను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి గురువారం నాగార్జున నివాసానికి వెళ్లి ఆయనను సాదరంగా ఆహ్వానించి, యాత్ర ఉద్దేశాన్ని వివరించారు.
డ్రగ్స్ రక్కసిని అంతమొందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: నాగార్జున
అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి నాగార్జున యాత్రకు సంబంధించిన ప్రత్యేక టీ-షర్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనకు చేపట్టే కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని నాగార్జున స్పష్టం చేశారు. సమాజాన్ని, ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ రక్కసిని అంతమొందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉండేలా యువతలో విస్తృతంగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం జరిగే ‘నషా ముక్త్ భారత్’ వంటి కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యం: కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్’ పిలుపు మేరకు ఈ యాత్రను చేపడుతున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకల్పంలో భాగంగా ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భావితరాల భద్రత కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంలో యువత, తల్లిదండ్రులు, నగర ప్రజలు సహా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌పై పోరాటం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం అవసరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్ యాత్ర’..
- యూఏఈ సముద్ర తీరాల్లో అద్భుత దృశ్యం..!!
- కువైట్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్..!!
- ఒమన్ లో 344 మంది ఖైదీలకు సుల్తాన్ క్షమాభిక్ష..!!
- బహ్రెయిన్‌లో నవంబర్ 24 నుంచి సిటీ స్కేప్ 2026..!!
- రియాద్‌లో మరో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- ఖతార్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!!
- విశాఖ–తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు
- సౌదీ అరేబియాకు వెళ్ళే ఇండిగో విమానాలు Nov 30 వరకు రద్దు
- నేడు తొలిసారిగా త్రైపాక్షిక సమావేశం నిర్వహించనున్న ట్రంప్, పుతిన్, షీ జిన్‌పింగ్







