ఖతార్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!!

- November 19, 2026 , by Maagulf
ఖతార్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!!

దోహా: ఖతార్‌లో రహదారి భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ చట్టాన్ని తీసుకొచ్చింది. ట్రాఫిక్ లా నంబర్ 19 ఆఫ్ 2026 ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లు, వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులు, ప్రయాణికుల భద్రత, వాహనాల మార్పులపై కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. కొత్త చట్టం ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఇలాంటి ఇతర వాహనాలను రోడ్లపై వినియోగించాలంటే సంబంధిత లైసెన్సింగ్ అధికారుల వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నిర్ణీత రుసుములు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ప్రతి మోటారు వాహనానికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. ఈ కొత్త చట్టంలోని ముఖ్యమైన నిబంధనలను పబ్లిక్ రిలేషన్స్ విభాగం డైరెక్టర్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ ముఫ్తా, న్యాయ వ్యవహారాల విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ అహ్మద్ అబ్దుల్లా అల్ హరామి, ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జబర్ అలీ అల్ కుబైసీ వివరించారు.

డిసెంబర్ 19 నుంచి అమల్లోకి..

ట్రాఫిక్ లా నంబర్ 19 ఆఫ్ 2026 డిసెంబర్ 19, 2026 నుంచి అమల్లోకి రానుంది. 2007 ట్రాఫిక్ చట్టం కింద ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాల యజమానులు కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ రికార్డులను సరిచేసుకునేందుకు ఆరు నెలల గడువు కల్పించారు. కొత్త చట్టం అమల్లోకి రాకముందు జారీ చేసిన లైసెన్సులు, అనుమతులు వాటి గడువు ముగిసే వరకు చెల్లుబాటులో ఉంటాయి.

వాహన లైసెన్సులకు కొత్త నిబంధనలు

కొత్త చట్టం ప్రకారం సాధారణంగా మోటారు వాహనాల లైసెన్సుల కాలపరిమితి జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం ఉంటుంది. అయితే ఖతార్‌లోని అధీకృత వాహన డీలర్ల నుంచి కొనుగోలు చేసిన ప్రైవేట్ కార్లకు లేదా చట్టబద్ధమైన వారంటీ, నిర్వహణ నిబంధనలను పాటించే వాహనాలకు మొదటిసారి వినియోగంలోకి వచ్చిన తేదీ నుంచి మూడేళ్ల లైసెన్స్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది.

వాహనాలపై స్టిక్కర్లకు అనుమతి తప్పనిసరి

వాహనాలపై ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా ఎలాంటి సమాచారం, స్టిక్కర్లు, చిత్రాలు, గుర్తులు లేదా ఇతర వస్తువులను అతికించడం, రాయడం, గీయడం నిషేధం. వాహనం అసలు రూపాన్ని మార్చేలా, గుర్తింపు వివరాలు కనిపించకుండా చేసేలా లేదా డ్రైవర్ దృష్టికి ఆటంకం కలిగించేలా ఎలాంటి మార్పులు చేయకూడదు.

ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం

మోటార్ సైకిళ్లు, సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రయాణికులను తీసుకెళ్లే విషయంలోనూ కొత్త చట్టం పరిమితులు విధించింది. రహదారులపై ప్రమాదాలకు కారణమయ్యే ప్రవర్తనలను నియంత్రించడంతో పాటు ఆధునిక రవాణా సాధనాల వినియోగానికి స్పష్టమైన నిబంధనలు రూపొందించింది.

ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

కొత్త చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు MOI ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అరబిక్‌తో పాటు పలు భాషల్లో సమాచార పత్రాలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలు, తరచుగా అడిగే ప్రశ్నలు, మీడియా కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురానుంది.

ఖతార్ జాతీయ అభివృద్ధి వ్యూహం (2024-2030), నేషనల్ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. రవాణా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రహదారి భద్రతను పెంచడం, ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com