బహ్రెయిన్‌లో నవంబర్ 24 నుంచి సిటీ స్కేప్ 2026..!!
- November 19, 2026
మనామా: బహ్రెయిన్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ప్రముఖ ప్రదర్శన ‘సిటీ స్కేప్ బహ్రెయిన్ 2026’ నవంబర్ 24 నుంచి 28 వరకు జరగనుంది. ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ (Exhibition World Bahrain) వేదికగా ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఆర్థిక సంస్థలు, ఆర్కిటెక్చర్ నిపుణులు పాల్గొననున్నారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) మద్దతుతో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
బహ్రెయిన్ మెరీనా, దియార్ అల్ ముహర్రక్, ఎడమా, ఇన్‌ఫ్రాకార్ప్, నసీజ్, రీఫ్ ఐలాండ్, డిజిటల్ సిటీ బహ్రెయిన్, దార్ అల్ బహ్రెయిన్ వంటి ప్రముఖ సంస్థలు తమ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నాయి. అలాగే BBK, కువైట్ ఫైనాన్స్ హౌస్ (KFH), Afaq Future Real Estate, DBS Interiors వంటి సంస్థల ప్రతినిధులతో సందర్శకులు నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది. నివాస, వాణిజ్య భవనాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను తెలుసుకోవచ్చు.
కొత్తగా ప్రాప్‌టెక్ ప్లాట్‌ఫామ్
ఈసారి ప్రదర్శనలో రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆవిష్కరణలు, డిజిటల్ పరిష్కారాలను ఇందులో ప్రదర్శించనున్నారు. స్టార్టప్ సంస్థలు తమ వినూత్న ఆలోచనలను పెట్టుబడిదారులు, డెవలపర్లు, పరిశ్రమ నిపుణుల ముందు వివరించేందుకు ప్రత్యక్ష పిచ్ పోటీ కూడా నిర్వహించనున్నారు.
యువ ఆర్కిటెక్టులకు ప్రత్యేక అవకాశం
ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ రంగాలకు ప్రత్యేకంగా ఒక పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు. అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ – మిడిల్ ఈస్ట్ చాప్టర్ భాగస్వామ్యంతో నాలుగోసారి ‘ఫ్యూచర్ ఆర్కిటెక్ట్స్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీఫ్ ప్రాపర్టీస్ మద్దతుతో జరిగే ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు తమ సృజనాత్మక డిజైన్లను ప్రముఖ ఆర్కిటెక్టులు, రియల్ ఎస్టేట్ డెవలపర్ల ముందు ప్రదర్శిస్తారు.
25 ప్రత్యేక చర్చా కార్యక్రమాలు
నవంబర్ 25 నుంచి 28 వరకు ‘సిటీ స్కేప్ టాక్స్’ పేరుతో మొత్తం 25 చర్చా సమావేశాలు నిర్వహించనున్నారు. రియల్ ఎస్టేట్ కొనుగోలు, పెట్టుబడులు, ఫైనాన్సింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ అనుకూల నిర్మాణాలు, భవిష్యత్తు నివాస విధానాలపై ప్రభుత్వ ప్రతినిధులు, రంగ నిపుణులు చర్చించనున్నారు. ఈ మేరకు సిటీ స్కేప్ గ్రూప్ డైరెక్టర్ అలెగ్జాండర్ హ్యూఫ్ తెలిపారు.
అలాగే సిటీ స్కేప్ బహ్రెయిన్‌తో పాటు ‘జ్యువెలరీ అరేబియా’, ‘సెంట్ అరేబియా’ ప్రదర్శనలు కూడా అదే సమయంలో నిర్వహించనున్నారు. దీంతో సందర్శకులు ఒకే వేదికపై రియల్ ఎస్టేట్, బంగారు ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను సందర్శించే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్ యాత్ర’..
- యూఏఈ సముద్ర తీరాల్లో అద్భుత దృశ్యం..!!
- కువైట్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్..!!
- ఒమన్ లో 344 మంది ఖైదీలకు సుల్తాన్ క్షమాభిక్ష..!!
- బహ్రెయిన్‌లో నవంబర్ 24 నుంచి సిటీ స్కేప్ 2026..!!
- రియాద్‌లో మరో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- ఖతార్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!!
- విశాఖ–తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు
- సౌదీ అరేబియాకు వెళ్ళే ఇండిగో విమానాలు Nov 30 వరకు రద్దు
- నేడు తొలిసారిగా త్రైపాక్షిక సమావేశం నిర్వహించనున్న ట్రంప్, పుతిన్, షీ జిన్‌పింగ్







