యూఏఈ సముద్ర తీరాల్లో అద్భుత దృశ్యం..!!

- November 19, 2026 , by Maagulf
యూఏఈ సముద్ర తీరాల్లో అద్భుత దృశ్యం..!!

ఫుజైరా: యూఏఈ సముద్ర తీరాల్లో అరుదైన ప్రకృతి అద్భుతం ఆవిష్కృతమవుతోంది. రాత్రివేళ సముద్ర అలలు నీలిరంగు కాంతులతో మెరిసిపోతూ పర్యాటకులను, స్థానిక నివాసితులను ఆకట్టుకుంటున్నాయి. ఫుజైరాలోని అల్ అఖా బీచ్‌తో పాటు ఖోర్ ఫక్కాన్ బీచ్ తీరాల్లోనూ ఈ అద్భుత దృశ్యం కనిపిస్తోంది. సముద్రంలో ఏర్పడే ఈ సహజ కాంతి దృగ్విషయాన్ని ‘బయోలుమినిసెన్స్’ (Bioluminescence) లేదా ‘సీ స్పార్కిల్’ అని పిలుస్తారు.

సముద్రంలో కాంతులు ఎలా ఏర్పడతాయి?

షార్జా మెరైన్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ (SMSRC) పరిశోధకులు ఈ దృగ్విషయానికి కారణమవుతున్న సూక్ష్మజీవుల చిత్రాలను విడుదల చేశారు. ‘నోక్టిలూకా సింటిల్లాన్స్’ (Noctiluca scintillans) అనే సూక్ష్మజీవులు సముద్రంలో అధిక సంఖ్యలో ఉన్నప్పుడు నీటి రంగులో మార్పులు కనిపిస్తాయి. రాత్రివేళ అలలు కదిలినప్పుడు నీలిరంగు కాంతులు మెరుస్తాయని యూనివర్సిటీ ఆఫ్ ఖోర్ ఫక్కాన్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిల్వానా బిర్నీచౌ తెలిపారు. ఈ సూక్ష్మజీవులు యూఏఈ తీరప్రాంతాలతో పాటు అరేబియన్ గల్ఫ్ జలాల్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తాయని వివరించారు. అనుకూల పరిస్థితుల్లో ఇవి సముద్రాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయని తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ 

ఈ అద్భుత దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుబాయ్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ డిబో ఫుజైరా అల్ అఖా బీచ్‌కు వెళ్లి ఈ దృశ్యాలను చిత్రీకరించారు. సముద్రపు నీటిలో నడుస్తున్నప్పుడు ఆయన చేతులు, కాళ్లకు నీలిరంగు కాంతులు అంటుకున్నట్లుగా కనిపించాయి. అడుగులు వేసిన ప్రతిసారీ ఇసుక, నీటి వద్ద కాంతులు మెరుస్తూ ప్రత్యేక అనుభూతిని కలిగించాయి. ఉద్యోగం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా ఫుజైరాకు ప్రయాణించినట్లు రామి తెలిపారు. సోషల్ మీడియాలో వీడియోలు చూసిన తర్వాత ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఆసక్తితో వెళ్లినట్లు చెప్పారు. యూఏఈలో ఇన్నేళ్లుగా నివసిస్తున్నప్పటికీ ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదని పేర్కొన్నారు.

తెల్లవారుజామున ఫుజైరాకు..

భారతీయ ప్రవాసుడు అరుణ్ తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి దాటిన తర్వాత ఫుజైరాకు బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు అక్కడికి చేరుకుని గంటపాటు సముద్ర తీరంలో గడిపినట్లు తెలిపారు. గతంలో తన స్వస్థలమైన కేరళలో ఈ దృశ్యాన్ని ఒకసారి చూసినప్పటికీ, యూఏఈలో మాత్రం ఇదే మొదటిసారని చెప్పారు. ఫుజైరాకు చేసిన ప్రయాణం పూర్తిగా సార్థకమైందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది అత్యద్భుతం 

సోషల్ మీడియాలో యూఏఈవెదర్మ్యాన్’గా గుర్తింపు పొందిన మహమ్మద్ మాట్లాడుతూ.. యూఏఈ తీరాల్లో గతంలో తాను గమనించిన బయోలుమినిసెన్స్ దృశ్యాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రదర్శన అత్యంత అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. సాధారణంగా యూఏఈలో అక్టోబర్–నవంబర్, మార్చి–మే నెలల్లో ఈ దృగ్విషయం కనిపిస్తుందని వివరించారు. సముద్రపు నీరు వెచ్చగా, ప్రశాంతంగా ఉండటంతో పాటు చుట్టుపక్కల పూర్తిగా చీకటి ఉండటం ఈ కాంతులు స్పష్టంగా కనిపించడానికి అనుకూల పరిస్థితులని తెలిపారు.

మరో మూడు వారాలపాటు 

సముద్ర పరిస్థితులను పరిశీలించిన మహమ్మద్ అంచనా ప్రకారం.. స్థానిక వాతావరణ, సముద్ర పరిస్థితులు అనుకూలిస్తే యూఏఈలోని కొన్ని తీరప్రాంతాల్లో ఈ నీలిరంగు కాంతులు మరో మూడు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కనిపించే అవకాశం ఉంది. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు యూఏఈ నివాసితులు రాత్రివేళల్లో ఫుజైరా, ఖోర్ ఫక్కాన్ బీచ్‌లకు తరలివెళ్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com