విదేశాల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్!!

- November 19, 2026 , by Maagulf
విదేశాల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్!!

ప్రతిభావంతులైన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో గ్లోబల్ స్కూల్స్ గ్రూప్ (GSG) ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సిటిజన్ స్కాలర్‌షిప్ (GCS)–2027 కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఎంపికైన భారతీయ విద్యార్థులు సింగపూర్‌లోని జీఐఐఎస్ స్మార్ట్ క్యాంపస్‌లో 11, 12 తరగతులను పూర్తిగా ఉచితంగా చదువుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన విద్యార్థులకు రెండేళ్లపాటు 100 శాతం ట్యూషన్ ఫీజుతో పాటు వసతి, భోజనం, ఇతర జీవన ఖర్చులను సంస్థ భరిస్తుంది. అంతేకాకుండా వ్యక్తిగత అవసరాల కోసం స్టైపెండ్ కూడా అందిస్తుంది. విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా సీబీఎస్ఈ లేదా ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమా ప్రోగ్రామ్ (IBDP)లో చదువుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతిభ కలిగిన విద్యార్థులకు విదేశాల్లో నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు, ఆధునిక బోధనా విధానాలు, విభిన్న సంస్కృతుల పరిచయం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని గ్లోబల్ స్కూల్స్ గ్రూప్ భావిస్తోంది.

డిసెంబర్ 20 వరకు దరఖాస్తులు.. రాత, మౌఖిక పరీక్షలతో ఎంపిక
ఈ స్కాలర్‌షిప్ ఎంపిక ప్రక్రియలో విద్యార్థుల విద్యా ప్రతిభతో పాటు నాయకత్వ లక్షణాలు, వ్యక్తిగత నైపుణ్యాలు, ఇప్పటివరకు సాధించిన విజయాలు, సమగ్ర అభివృద్ధిపై ఆసక్తి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అర్హులైన విద్యార్థులకు రాత పరీక్ష, మౌఖిక పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే పదో తరగతి విద్యార్థులు 2026 డిసెంబర్ 20వ తేదీలోపు GCS–2027 దరఖాస్తు ఫారం ద్వారా తమ వివరాలను సమర్పించాలి. ఈ సందర్భంగా గ్లోబల్ స్కూల్స్ గ్రూప్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు అతుల్ తెముర్నికర్ మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితులు ప్రతిభావంతులైన విద్యార్థుల ఆశయాలకు అడ్డంకిగా మారకూడదని, అంతర్జాతీయ దృక్పథం, స్వతంత్ర ఆలోచనా విధానం కలిగిన యువతను తీర్చిదిద్దడమే ఈ స్కాలర్‌షిప్ లక్ష్యమని తెలిపారు. సంస్థ డైరెక్టర్ (అకడమిక్స్) ప్రమోద్ త్రిపాఠి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు పెంపొందించేందుకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు దోహదపడతాయని పేర్కొన్నారు. మొత్తంగా పదో తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు సింగపూర్‌లో రెండేళ్లపాటు పూర్తి ఆర్థిక సహకారంతో చదువుకునే ఈ అవకాశం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com