బహ్రెయిన్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కఠిన చర్యలు..!!

- November 21, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కఠిన చర్యలు..!!

మనామా: బహ్రెయిన్‌లో కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో కార్మికుల షేర్డ్ హౌసింగ్ పెరుగుతుండటాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఇంటి యజమానులు, కార్మికులకు వసతి కల్పించే సంస్థల నిర్వాహకులకు జైలు శిక్షతో పాటు BD500 నుంచి BD5,000 వరకు జరిమానా విధించేలా కొత్త బిల్లును రూపొందించారు. మొత్తం 11 అధికరణాలతో రూపొందించిన ఈ బిల్లుకు పార్లమెంట్ పబ్లిక్ యుటిలిటీస్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కమిటీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. తదుపరి పార్లమెంట్ సమావేశంలో ఎంపీలు దీనిపై చర్చించి ఓటింగ్ నిర్వహించనున్నారు.

ఐదుగురికి మించి ఉంటే నిబంధనలు వర్తింపు

కుటుంబ సంబంధాలు నాలుగో తరానికి మించి లేని వ్యక్తులు కాకుండా, ఐదుగురికి పైగా ఒకే ఇంట్లో నివసించే షేర్డ్ హౌసింగ్‌లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. సబ్‌లెట్‌కు ఇచ్చిన ఇళ్లను కూడా ఈ పరిధిలోకి తీసుకురానున్నారు. కుటుంబ నివాస ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కార్మికులు ఒకే ఇంట్లో ఉండటం వల్ల రద్దీ, శబ్ద కాలుష్యం, స్థానిక సేవలపై ఒత్తిడి పెరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ సమస్యలను నియంత్రించేందుకు మున్సిపల్ కౌన్సిళ్లకు ప్రత్యేక అధికారాలు కల్పించనున్నారు.

నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేత

నిబంధనలు ఉల్లంఘించిన భవనాలకు నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీని స్థానిక కౌన్సిళ్లు కోరవచ్చు. సాధారణంగా ముందుగా ఇంటి యజమానికి నోటీసు ఇచ్చి, తప్పులను సరిదిద్దుకునేందుకు గడువు కల్పిస్తారు. అయితే ఉల్లంఘన వల్ల ప్రాణాలకు లేదా ఆస్తులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంటే ముందస్తు నోటీసు లేకుండానే నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష లేదా BD500 నుంచి BD5,000 వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

ఇంటి యజమానులు, కంపెనీలకు బాధ్యతలు

ఇళ్లను షేర్డ్ హౌసింగ్ కోసం అద్దెకు ఇచ్చే యజమానులు స్థానిక మున్సిపల్ కౌన్సిల్‌కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. ఆరోగ్య, భద్రత, పర్యావరణ ప్రమాణాలను పాటించాలి. తమ ఉద్యోగులకు వసతి కల్పించే కంపెనీలు కూడా ఈ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. బహ్రెయిన్‌లోని నాలుగు గవర్నరేట్లలో కార్మికులకు ఎక్కడ వసతి కల్పించాలనే అంశంపై పట్టణ ప్రణాళిక శాఖ, స్థానిక కౌన్సిళ్లు కలిసి నిర్ణయాలు తీసుకోనున్నాయి. నిబంధనల అమలును పర్యవేక్షించే అధికారులకు తనిఖీలు నిర్వహించడం, రికార్డులు, పత్రాలు పరిశీలించడం, ఉల్లంఘనలకు సంబంధించిన నివేదికలు రూపొందించే అధికారాలు కల్పించనున్నారు.

గత ప్రతిపాదనపై అభ్యంతరాలు.. మార్పులు

ఈ బిల్లును ఎంపీ మహమ్మద్ అల్ రిఫాయ్ ప్రతిపాదించారు. తొలుత కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో కార్మికుల బృందాలు ఉండటాన్ని పూర్తిగా నిషేధించాలని, నివాస ప్రాంతాల్లో అనధికార వ్యాపార కార్యకలాపాలను అరికట్టాలని ఆయన సూచించారు. అయితే ఈ ప్రతిపాదన అమలైతే తప్పు చేయని కార్మికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని న్యాయ సలహాదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వచ్చిన వారం రోజుల్లోనే ఇళ్లను ఖాళీ చేయాలన్న నిబంధనను కూడా తొలగించారు. దీంతో బిల్లులో మార్పులు చేసి మళ్లీ రూపొందించారు. ప్రస్తుత నిబంధనలు కార్మికుల ఉమ్మడి నివాసాలను నియంత్రించడంలో విఫలమయ్యాయని అల్ రిఫాయ్ అభిప్రాయపడ్డారు. అధిక రద్దీ, శబ్దం, స్థానిక సదుపాయాలపై ఒత్తిడిని తగ్గించేందుకు కఠిన శిక్షలు అవసరమని పేర్కొన్నారు.

ప్రస్తుత చట్టాలే సరిపోతాయన్న మంత్రిత్వ శాఖ

మున్సిపాలిటీస్ అఫైర్స్ అండ్ అగ్రికల్చర్ మంత్రిత్వ శాఖ మాత్రం కొత్త చట్టం అవసరం లేదని అభిప్రాయపడింది. ఇప్పటికే ఉన్న చట్టాల్లో కార్మికుల నివాసాలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయని, మరో చట్టం తీసుకురావడం వల్ల ఏ ప్రభుత్వ విభాగానికి ఏ బాధ్యత ఉంటుందనే విషయంలో గందరగోళం ఏర్పడవచ్చని పేర్కొంది. 2023లో జారీ చేసిన నిబంధనల ప్రకారం షేర్డ్ హౌసింగ్‌లకు ఇంజినీరింగ్ సంస్థల నుంచి భవన భద్రతా ధ్రువీకరణ పత్రాలు, అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లు తప్పనిసరి. అలాగే నివాసితులకు తగిన స్థలం ఉండాలి. క్యాపిటల్ గవర్నరేట్‌లో ఒక్కొక్కరికి బెడ్‌రూమ్‌లో కనీసం నాలుగు చదరపు మీటర్ల స్థలం ఉండాలి. ఒక గదిలో ఎనిమిది మందికి మించి ఉండకూడదు.

బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కూడా కొత్త చట్టం కంటే ప్రస్తుత చట్టాల్లోనే మార్పులు చేయాలని సూచించింది. కొత్త నిబంధనలు అమలు చేసేందుకు ఇంటి యజమానులు, కంపెనీలకు తగిన గడువు ఇవ్వాలని కోరింది. మరోవైపు, బహ్రెయిన్ జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపింది. కొన్ని నివాస ప్రాంతాల్లో విదేశీ కార్మికులకు సంబంధించిన మద్యం సేవించడం, అనుచిత వస్త్రధారణ, అశాంతి వంటి ఘటనలపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com