రాముడి మంచితనం

- August 04, 2015 , by Maagulf
రాముడి మంచితనం

రాముడు, భీముడు మంచి స్నేహితులు. రాముడు మంచితనానికి మారు పేరు. కానీ భీముడు అవకాశవాది. కపట బుద్ధి కలవాడు. ఒకరోజు వాళ్లిద్దరూ కలిసి ఆడవిగుండా పొరుగూరికి పనిమీద బయలుదేరారు. ఇంతలో ఒక సింహం గాండ్రింపు వినబడింది. అది చూసి వాళ్లిద్దరూ దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఎక్కి భయంతో బిక్కుబిక్కుమని చూడసాగారు. ఆ సింహం వీరిని చూడనే చూసింది. అసలే అది ఆకలితో ఉండడం వల్ల వీళ్లని తినేయాలని ఆత్రుతతో ఆ చెట్టు వద్దకి వచ్చింది. చెట్టు పైకి చూస్తూ నీ వెంట ఉన్న ఇంకొక వ్యక్తిని కిందికి తోసెయ్యి. నేను అతనితో నా ఆకలి తీర్చుకుని నిన్ను వదిలేస్తాను అని రాముడితో అంది. అందుకు రామయ్య అతను నా స్నేహితుడు నేను అతన్ని కిందికి పడనివ్వను అన్నాడు. అప్పుడు సింహం నీ ప్రాణం దక్కించుకోవాలంటే నువ్వు నీ స్నేహితుణ్ణి కిందకి తోసేయ్‌ లేకపోతే నేను మిమ్మల్నిద్దర్నీ చంపి తినేస్తాను అని భీముడితో అంది. అందుకు భీముడు తన స్నేహాన్ని మరిచిపోయి రాముడ్ని కిందికి తోసేశాడు. మంచితనం వల్ల దేవుడి దయ వల్ల రాముడు కింద పడకుండా చెట్టు కొమ్మకు వేలాడుతూ ఎలాగోలా మళ్లీ చెట్టుపైకి చేరుకున్నాడు. చూశావా నీ స్నేహితుడి కపట బుద్ధి. ఇప్పటికైనా అతన్ని కిందకి తోసెయ్‌ అంది మళ్లీ రాముడితో సింహం. లేదు లేదు వాడు చెడ్డవాడైనా వాడు నాకు స్నేహితుడే నా స్నేహితుణ్ణి చావనివ్వను అన్నాడు రాముడు. అతని మంచితనానికి విస్తుపోయిన సింహం అక్కడి నుండి వెళ్లిపోయింది. భీముడు తను చేసిన మిత్ర ద్రోహానికి సిగ్గుపడి రామున్ని క్షమాపణలు వేడుకున్నాడు.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com