కాకినాడ వేదికగా పవన్ కల్యాణ్ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ...

- September 08, 2016 , by Maagulf
కాకినాడ వేదికగా పవన్ కల్యాణ్ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ...

పవన్.. పవన్... పవన్.... ఈ పేరును ఒకప్పుడు ఆయన అభిమానులు మాత్రమే జపించేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా స్మరిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ పేరు ప్రభంజనమై వినిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా కాకినాడలో పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న సీమాంధ్రుల ఆత్మగౌరవ సభపై అన్ని వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఏ నలుగురు కలిసినా పవన్ కల్యాణ్ సభ గురించే చర్చిస్తున్నారు. పవన్ ఏం చేయబోతున్నాడు? ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ సారి టార్గెట్ తెలుగు దేశమా? లేక భారతీయ జనతా పార్టీనా ? అంటూ... అటు ప్రజలు, ఇటు రాజకీయ నేతలు విశ్లేషణలు చేసుకుంటున్నారు.కాకినాడ వేదికగా పవన్ కల్యాణ్ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీనే తప్ప.. హోదా లేదని కేంద్రం కుండ బద్ధలు కొట్టిన నేపథ్యంలో అందరి దృష్టి పవన్ కల్యాణ్ సభపైనే ఉంది. ఎన్నికల హామీని అమలు చేయకుండా.. సాకులు చెబుతున్న కేంద్రంపై పవన్ ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేదిక నుండి పవన్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. పవన్ ప్రసంగాన్ని విని, ఆయన వెంట నడిచేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి అభిమానులు కాకినాడకు తరలి వెళుతున్నారు.

పవన్ కల్యాణ్ గురువారం రాత్రే కాకినాడకు చేరుకున్నారు. స్థానిక జీఆర్‌టీ హోటల్‌లో బస చేసిన ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. పవన్‌ కల్యాణ్‌ కారు నుంచి దిగేందుకు కూడా వీలులేక పోవడంతో అభిమానులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. అతికష్టంపై పోలీసులు ఆయనను హోటల్‌ లోపలకు పంపారు.మరోవైపు పవన్‌ చేపట్టిన ప్రత్యేక హోదా సాధన తొలి సమావేశం విజయవంతం కావాలని కోరుతూ ఆయన అభిమానులు తూర్పుగోదావరి జిల్లాలో పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. పవన్‌కు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు ప్రదర్శనగా సభకు తరలి వచ్చేలా అభిమాన సంఘాలు, జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీమాంధ్రుల ఆత్మగౌరవ సభకు కాకినాడలో భారీ ఏర్పాట్లే జరిగాయి. నగరంలోని జేఎన్టీయూ క్యాంపస్ లో జరగనున్న ఈ బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మందికి పైగా వస్తారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. పోలీసులు కూడా పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచే పోలీసులు సభా ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. తొక్కిసలాటకు అవకాశం లేకుండా బారికేడ్లతో పాటు సభా ప్రాంగణంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాల వచ్చే వాహనాల కోసం సభా ప్రాంగణం సమీపంలోనే పార్కింగ్‌ వసతి కల్పించారు. అమలాపురం, రామచంద్రపురం మీదుగా భానుగుడి వైపు నుంచి వచ్చే వాహనాలకు జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల, ఎగ్జిబిషన్‌ మైదానంలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం వైపు నుంచి వచ్చే వాహనాలకు భాస్కర కల్యాణ మండపం సమీపంలో ఉన్న ఖాళీ స్థలం వద్ద, వలసపాక వైపు నుంచి వచ్చే వాహనాలకు ఎన్‌ఎఫ్‌సిఎల్‌ వద్ద పార్కింగ్‌ స్థలాలు కేటాయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com