రివ్యూ: జ్యో అచ్యుతానంద
- September 09, 2016
సినిమా పేరు: జ్యో అచ్యుతానంద
తారాగణం: నారా రోహిత్.. నాగశౌర్య.. రెజీనా.. పావని గంగిరెడ్డి.. సీత.. రాజేశ్వరి.. హేమంత్.. చైతన్య కృష్ణ.. తనికెళ్ల భరణి.. నాని (అతిథి పాత్రలో) తదితరులు
ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్
కూర్పు: కిరణ్ గంటి
సంగీతం: కల్యాణ్ రమణ
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల
నిర్మాత: రజనీ కొర్రపాటి
సమర్పణ: సాయి కొర్రపాటి
సంస్థ: వారాహి చలన చిత్ర
విడుదల: 09-09-2016
తనలో ఎంత మంచి నటుడున్నాడో..
అంత మంచి దర్శకుడు కూడా ఉన్నాడని 'వూహలు గుసగుసలాడే'తోనే నిరూపించారు శ్రీనివాస్ అవసరాల. తన రెండో ప్రయత్నంగా నారా రోహిత్.. నాగశౌర్యలతో సినిమా అనేసరికి ప్రేక్షకుల నుంచి ఆసక్తి మొదలైంది. ప్రచార చిత్రాలు ఆ ఆసక్తిని రెట్టింపు చేశాయి. మరి అందుకు తగ్గట్టుగానే శ్రీనివాస్ అవసరాల 'జ్యో అచ్యుతానంద'ని తీర్చిదిద్దారా? తెలుసుకొందాం పదండి.
కథేంటంటే?: అచ్యుత్ (నారా రోహిత్).. ఆనంద్ (నాగశౌర్య) అన్నదమ్ములు. చిన్నప్పట్నుంచీ ఇద్దరూ చాలా స్నేహంగా ఉంటారు. ఒకరికోసం మరొకరు ఏం చేయడానికైనా సిద్ధం అన్నట్లు ఉంటారు. వాళ్ల ఇంటి మేడపైకి జ్యో (రెజీనా) తన తండ్రితో కలిసి అద్దెకు దిగుతుంది. ఆమెని చూడగానే అన్నదమ్ములిద్దరూ మనసు పారేసుకొంటారు. ఆమె మనసుని సొంతం చేసుకొనేందుకు పోటీ పడతారు. కానీ జ్యో మాత్రం తాను వేరొక అబ్బాయిని ప్రేమించానని చెప్పి అమెరికా వెళ్లిపోతుంది.
అచ్యుత్.. ఆనంద్‌లు పెళ్లి చేసుకొన్నాక మళ్లీ జ్యో అమెరికా నుంచి వస్తుంది. వచ్చాక అన్నదమ్ములిద్దరికీ ఐ లవ్ యూ.. అని చెబుతుంది. అప్పుడు వాళ్లెలా స్పందించారు? తాను ప్రేమించినవాడిని కాదని.. అప్పటికే పెళ్లి చేసుకొన్న అచ్యుత్.. ఆనంద్‌లకి జ్యో 'ఐ లవ్ యూ' చెప్పడానికి కారణమేంటి? చివరికి జ్యో ఎవరి సొంతమైంది? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే?: ఒక సినిమాలో ఒక కథని చెప్పడమే కష్టం. శ్రీనివాస్ అవసరాల మూడు కథల్ని చెప్పారు. నిడివి పరంగా 2 గంటల 6 నిమిషాల సినిమానే. కానీ ఇందులో రొమాంటిక్ కామెడీ కథ ఉంది. తర్వాతేం జరుగుతుందోననే ఆసక్తిని పెంచే ఒక థ్రిల్లర్ కథ ఉంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో హృద్యంగా సాగే కుటుంబ కథ ఉంది. అంటే.. ఒక టిక్కెట్టుపై మూడు సినిమాలన్న మాట.
నిజానికి సినిమా మొత్తాన్ని చూసినప్పుడు ఇందులో ఉన్నది చిన్న కథే అనిపిస్తుంది. కానీ అవసరాల స్క్రీన్‌ప్లే మాయాజాలంతో తెరపై అదనంగా రెండు కథలు పుట్టుకొచ్చినట్టు అనిపిస్తాయి. తొలి సన్నివేశం నుంచి పతాక సన్నివేశాల వరకు ప్రతీ సన్నివేశం నవ్విస్తూనే ఉంటుంది. అదే సమయంలో తర్వాతేం జరుగుతోందో అనే ఆసక్తి మనసుని తొలుస్తూ ఉంటుంది.
అన్నదమ్ములిద్దరూ ఒక అమ్మాయిపై మనసు పడటమనే లైన్‌లోనే ఆసక్తి ఉంది. దాన్ని కాస్త రెట్టింపు చేస్తూ తెరపైన సన్నివేశాల్ని తీర్చిదిద్దారు దర్శకుడు. మొదట్నుంచీ పాత్రలు ఎంతగా నవ్విస్తాయో.. చివరకు వచ్చేసరికి అవే పాత్రలు ఒక్కసారిగా గుండెల్ని బరువెక్కిస్తాయి. అప్పటిదాకా సరదా కథ కాస్త కుటుంబ కథగా మారిపోతుంది. కథలోని ఈ మలుపులను.. వాటిని తెరపైకి తీసుకొచ్చిన విధానాన్ని చూస్తే 'అవసరాల'లో ఎంత మంచి రచయిత ఉన్నాడో అర్థమవుతుంది.
జ్యో కథని అన్నదమ్ములిద్దరూ వాళ్ల భార్యల ముందు ఎవరికి తోచినట్టుగా వాళ్లు చెబుతారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసినప్పుడు అదే కథ మరో కోణంలో తెరపై కనిపిస్తుంది. ఆ లెక్కన ఒకే సన్నివేశాన్ని తెరపై మూడుసార్లు చూడాల్సొస్తుంది. అయినా సరే, మాటల్లోని మెరుపులతో ఎక్కడా బోర్ కొట్టించకుండా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు అవసరాల. కామెడీ కోసమనో.. భావోద్వేగాల కోసమనో.. లేదంటే ప్రేక్షకుల్ని థ్రిల్ చేయాలనో.. దర్శకుడు ఎక్కడా కథని విడిచి సాము చేయలేదు. కథ నుంచే వాటిని పుట్టించారు.
ఎవరెలా చేశారంటే?: నారా రోహిత్.. నాగశౌర్య నిజమైన అన్నదమ్ముల్లా కనిపించారు. వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండింది. అయితే నారా రోహిత్ తెరపై ఎప్పట్లాగే బొద్దుగానే కనిపించారు. రెజీనా తన పాత్రకి తగ్గట్టుగా అండర్‌ప్లే చేస్తూ ఆకట్టుకుంది. నారా రోహిత్.. నాగశౌర్య భార్యలుగా నటించిన వారికీ ప్రాధాన్యమున్న పాత్రలే దక్కాయి. వాళ్లిద్దరూ పాత్రల్లో ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది.
సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులు పడతాయి. కల్యాణ్ రమణ బాణీలు.. నేపథ్య సంగీతం ఆకట్టుకొంటాయి. దిలీప్ కెమెరా పనితనం బాగుంది. నిర్మాతల అభిరుచిని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. తెరపైన నిర్మాణ విలువలు కనిపిస్తాయి. సినిమా చూస్తున్నంతసేపు శ్రీనివాస్ అవసరాలలో రాటుదేలిన రచయిత.. దర్శకుడు గుర్తుకొస్తూనే ఉంటాడు.
బలాలు
+ కథ.. కథనం
+ వినోదం
+ నటీనటులు
+ మాటలు.. దర్శకత్వం
- ద్వితీయార్ధంలో వేగం తగ్గడం
చివరిగా.. అచ్చ తెలుగు సినిమా.. 'జ్యో అచ్యుతానంద'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడికి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
తాజా వార్తలు
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్







