రామోజీ ఫిలిం సిటీ లో సందడి చేయనున్న 'ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్'
- September 10, 2016
ఈ నెల 24 నుంచి 27 వరకు ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’
రూ.70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం
కార్నివాల్ శాశ్వత వేదికగా రామోజీ ఫిల్మ్‌సిటీ
ఇండీవుడ్ వ్యవస్థాపక సంచాలకులు సోహన్‌రాయ్
ఆసియాలోనే అతిపెద్ద సినిమా పండగ ‘ఇండీవుడ్ ఫిల్మ్కార్నివాల్’ ఈనెల 24 నుంచి 27 వరకూ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరగనుంది. దీనికి దాదాపు 80 దేశాల నుంచి 2 వేల మంది జాతీయ, అంతర్జాతీయ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు హాజరుకానున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో దేశీయంగా సినిమాలను నిర్మించి... అంతర్జాతీయ పరిశ్రమకు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. సినీ పరిశ్రమ, వినోదకేంద్రాల మౌలిక సదుపాయాలను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరించనున్నారు. భారతీయ సినిమా అభివృద్ధి కోసం ఐదేళ్లలో దాదాపు రూ.70 వేల కోట్లు ఖర్చుచేసేందుకు అవసరమైన పెట్టుబడులను సమీకరించనున్నారు. డిజిటల్ విప్లవం, 4కే టెక్నాలజీ అంశాలను ప్రధానంగా చర్చిస్తారు. ఈ సందర్భంగా ఎనిమిది రెడ్‌కార్పెట్ ఈవెంట్లు జరుగుతాయని ఇండీవుడ్ కార్నివాల్ వ్యవస్థాపకులు, దర్శకుడు సోహన్‌రాయ్ ‘మాగల్ఫ్ ’కు వెల్లడించారు. దేశ జనాభాలో 5% మందే థియేటర్లకు వెళ్తున్నారనీ, సగటున ఏడాదికి రెండు సినిమాలు మాత్రమే చూస్తున్నారని చెప్పారు. ఏటా సగటు ప్రేక్షకుడు చూసే సినిమాల సంఖ్యను ఆరుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. మరిన్ని విషయాలను ఆయన ‘మాగల్ఫ్ ’తో పంచుకున్నారు.
భారతీయ సినీ పరిశ్రమ అభివృద్ధికి కార్నివాల్ ఎలా దోహదపడుతుంది?
భారతీయ సినిమా పరిశ్రమను పూర్తిగా పునరుద్ధరించాల్సి ఉంది. ప్రపంచ సినిమా మార్కెట్లో 40 శాతం వాటాతో భారతీయ సినిమా మొదటిస్థానంలో ఉంది. ఇప్పుడు చైనా నుంచి పోటీ ఎదురవుతోంది. సాంకేతిక పరిజ్ఞానంలో 25 ఏళ్లు వెనకబడ్డాం. మన సినిమా స్టూడియోలు 2కే, సినిమా స్క్రీన్లు 1కే స్థాయికే పరిమితమయ్యాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం 4కే అందుబాటులోకి తీసుకు వస్తే మరింతమంది ప్రజలు థియేటర్లకు వెళ్తారు. కార్నివాల్లో ప్రాజెక్టు ఇండీవుడ్ పేరిట కార్యక్రమం చేపడుతున్నాం. ఈ సందర్భంగా 10 బిలియన్ డాలర్లతో పరిశ్రమను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. 10 వేల 4కే స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. గత ఏడాది నవంబరులో తిరువనంతపురంలో ఏర్పాటుచేసిన తొలి 4కే స్క్రీన్‌లో బాహుబలి రూ.3.5 కోట్లు వసూలు చేసింది. మళయాల సినిమాలో మహదేవ్ స్టూడియోతో పునరుద్ధణ ప్రాజెక్టు మొదలుపెట్టాం. 4కే టెక్నాలజీ స్టూడియోలు, థియేటర్లతో ప్రస్తుత ఆదాయం పదింతలు పెరిగే అవకాశముంది.
పెట్టుబడులకు నిధులెలా సమీకరిస్తారు? సెలెబ్రిటీలకు మీరిచ్చే సూచన?
పెట్టుబడులను సమీకరించేందుకు దేశంలోని 2 వేల మంది కార్పొరేట్, కోటీశ్వరులను ఒకేగొడుగు కిందకు తీసుకొచ్చి కన్సార్టియంగా తీర్చిదిద్దనున్నాం. సెలెబ్రిటీలు ఈ పరిశ్రమ నుంచి ఎంతో పొందారు. వారంతా కార్యక్రమానికి హాజరై, పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందించాలి. ఐదేళ్లలో దాదాపు 70 వేల కోట్లతో పరిశ్రమను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఏడాది కనీసం 300 నుంచి 500 మంది కార్పొరేట్ ప్రముఖులను ఒకేగొడుగు కిందకు తీసుకొస్తాం. పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన లక్ష్యంగా కార్నివాల్ నిర్వహిస్తాం. సొంత వనరులు సమకూర్చుకోవాలి. దేశంలో నైపుణ్యానికి కొదవ లేదు. భారతీయ సినీపరిశ్రమను లాభాల్లోకి తీసుకురావచ్చు. న్యాయపరమైన విధానంతో సినీ పెట్టుబడుల్లోకి బ్యాంకులు, బీమా సంస్థలు, అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్లను తీసుకురావాల్సి ఉంది.
తొలి సమావేశం కోచిలో నిర్వహించారు. రెండో సమావేశం రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తున్నారు కదా.. ఇక్కడ ప్రభుత్వ ప్రోత్సాహం ఎలా ఉంది?
పదినెలల క్రితం ఇండీవుడ్ కాన్సెప్ట్‌ను ప్రారంభించినపుడు 47 దేశాల నుంచి ప్రముఖులు వచ్చారు. కోచిలో ఆరు వేర్వేరు ప్రాంతాల్లో సమావేశాలు జరగడంతో అతిథులకు తలనొప్పి తప్పలేదు. ఈ ఏడాది రామోజీ ఫిల్మ్‌సిటీలో ఏర్పాటు చేశాం. దీంతో అన్ని కార్యక్రమాలను ఒక్కచోట నిర్వహించేందుకు వీలైంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గిన్నిస్‌బుక్‌లోనూ ఆర్ఎఫ్సీ స్థానం సంపాదించింది. నా తొలిసినిమా ‘డ్యామ్ 999’ చిత్రీకరణ చాలామటుకు ఇక్కడే నిర్వహించాను. గత ఏడాదితో పోలిస్తే ఐదురెట్లు అధికంగా ప్రతినిధులు వస్తారు. ఈ కార్యక్రమాన్ని కొచ్చి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి.. ఇలా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహించాలని అనుకున్నాం. కానీ తెలంగాణ ప్రభుత్వంతో సమావేశమైన తర్వాత... ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల సహకారంతో, రామోజీ ఫిల్మ్‌సిటీని శాశ్వత వేదికగా చేయాలన్న ఆలోచనకు వచ్చాం. ఫిల్మ్‌సిటీ వేదికగా తదుపరి ప్రాజెక్టు ‘బర్నింగ్వెల్’ను ప్రకటిస్తాను. 2018 డిసెంబరు నాటికి దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.
భారతీయ సినిమాలు ‘ఆస్కార్’ వరకూ ఎందుకు వెళ్లడంలేదు?
ఆస్కార్ నిబంధనలు వేరుగా ఉన్నాయి. భారతీయ దర్శక, నిర్మాతలకు నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన లేదు. హాలీవుడ్ స్థాయిలో భారత్‌లో నిర్మించిన ‘డ్యామ్ 999’ ప్రధాన కేటగిరీ కింద ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లింది. నామినేషన్ తరువాత...అవార్డుకు నిలిచే తుది నాలుగు సినిమాల జాబితాలో గెలుపొందేందుకు జ్యూరీలకు సినిమా గురించి వివరించి, వారిని ఒప్పించాలి. మనం భారతీయ విలువలు పాటిస్తూ, అంతర్జాతీయ స్థాయి హాలీవుడ్ సినిమాలు ఇక్కడే నిర్మించవచ్చు. హాలీవుడ్ ఖర్చుతో పోల్చితే కేవలం 10% వ్యయంతోనే వీటిని నిర్మించే వీలుంది. కొన్నేళ్లుగా ఆస్కార్‌లో మ్యూజిక్ సినిమా అవార్డుల కేటగిరీని తొలగించారు. కనీసం ఐదుపాటలు సినిమాలో ఉండాలి. ఈ విభాగాన్ని ప్రారంభిస్తే, నామినేషన్‌కు వెళ్లే తొమ్మిది సినిమాలు భారతీయ సినిమాలే ఉంటాయి.
ఇండీవుడ్ కార్నివాల్ ప్రత్యేకతలేంటి?
నాలుగు రోజుల పాటు నిర్వహించే కార్నివాల్లో మొత్తం 15 ఈవెంట్లు ఉంటాయి. సినీ రంగంలోని అన్నిశాఖల ప్రముఖులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం. పరిశ్రమకు అవసరమైన ప్రతిభాన్వేషణ, పెట్టుబడుల ఆకర్షణ, సదస్సులు, థీమ్ పార్కులు, రెడ్‌కార్పెట్, మిస్ ఇండీవుడ్ ఎంపిక, ఎడిటర్స్ సమావేశం, సినిమాటోగ్రఫీ తదతర కార్యక్రమాలుంటాయి. టాలెంట్ హంట్ నిర్వహించి, యువతకు తప్పనిసరిగా అవకాశాలు కల్పిస్తాం. సినీ పరిశ్రమ ఎంతగా వృద్ధి చెందితే, అంతగా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







