కావేరీ జలవివాదం మరింత ముదురుతోంది..

- September 11, 2016 , by Maagulf
కావేరీ జలవివాదం మరింత ముదురుతోంది..

 తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలవివాదం మరింత ముదురుతోంది. ఒకరి ఆస్తులపై మరొకరు దాడులకు పాల్పడే స్థాయికి చేరింది. కావేరీ నీటి విడుదలపై కర్నాటకలో గత కొన్ని రోజులుగా ఆందోళనతో హోరెత్తిస్తున్నారు. రాస్తారోకోలు, ధర్నాలతో ఉద్యమం తారా స్థాయికి చేరింది. ఈ సమయంలోనే కొందరు ఆందోళనకారులు తమిళనాడు వాహనాలు, వారి ఆస్తులే టార్గెట్‌గా విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో కర్నాటక ఆందోళన కారులపై తమిళనాడు భగ్గుమంటోంది.కర్నాటకలో తమ ఆస్తులపై కన్నడ వాసుల దాడికి ప్రతీగా చెన్నైలో కర్నాటక హోటల్స్‌ లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. పలు హోటల్స్‌పై పెట్రోల్ బాంబు కూడా విసిరినట్లు తెలుస్తోంది. మైలాపూర్ లోని న్యూ ఉడ్ ల్యాండ్ హోటల్ పై దుండుగులు ఈ రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు.దుండగులు ఆరు పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్లు హోటల్ యాజమాని కృష్ణారావు తెలిపారు. దాడి ఘటనపై పోలీసులు మాట్లాడుతూ పదిమంది వ్యక్తులు గుంపుగా వచ్చి కర్ణాటకకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోటల్ పై దాడి చేసినట్లు తెలిపారు. టేబుల్స్, కుర్చీలు, హోటల్ అద్దాలు పగులగొట్టారని, సంఘటనా స్థలంలో ఓ లేఖ లభించినట్లు తెలిపారు. కర్ణాటకలో తమిళులను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తే... పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతాయని ఆ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు . అయితే దాడి సమయంలో హోటల్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ, ఆందోళనకారులను అడ్డుకునేందుకు ధైర్యం చేయలేదని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.మరోవైపు రామాంతపురం జిల్లాలో పెద్ద సంఖ్యలో కర్నాటకకు చెందిన వాహనాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఓ న్యూస్ ఛానల్ కు చెందిన వాహనాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com