ఉగ్రదాడులకు ధీటైన సమాధానం చెప్పాలని, కేంద్రం నిర్ణయించింది..
- September 20, 2016
ఉగ్రదాడులకు ధీటైన సమాధానం చెప్పాలని, కేంద్రం నిర్ణయించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఉపేక్షించకూడదని వారిని సమూలంగా నాశనం చేసే దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నట్లు తెలిసింది. ఉగ్రవాద సంస్థలకు బుద్ధి చెప్పేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసే బాధ్యతను జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్‌కు ప్రధాని మోడీ అప్పగించినట్లు చెబుతున్నారు. యురీ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శలు, సలహాలు, సూచనలపైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో విస్తృతంగా చర్చించారు. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన సమావేశంలో యురీ ఉగ్రదాడికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల ఏరివేతపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఒక్కరోజులో పని పూర్తి చేస్తామని సమావేశంలో పాల్గొన్న ఆర్మీ సీనియర్ అధికారులు ప్రధాని మోడీకి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవాధీన రేఖ, పాక్ సరిహద్దులో ఉన్న ఉగ్రవాద క్యాంపుల సమాచారం తమ వద్ద ఉందని, కేంద్రం రాజకీయ నిర్ణయం తీసుకుంటే పక్కాగా పని పూర్తి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. యుద్ధం తరహా వాతావరణాన్ని కల్పించకుండా కేవలం ఉగ్ర స్థావరాలపైనే ఎలా దాడులు చేయాలన్నదానిపై దృష్టి సారించాల్సిందిగా ప్రధాని సూచించినట్లు తెలిసింది. దాడులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. దళాలను సన్నద్ధంగా ఉండాల్సిందిగా మాత్రమే సూచించామని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు.
ప్రత్యామ్నాయాలనూ క్షుణ్నంగా పరిశీలించాకే, అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్న తరువాతనే.. పక్కా ప్రణాళిక, సమన్వయంతో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. యురీ దాడి ఎలా జరిగిందో, లోపాలు ఎక్కడున్నాయో విశ్లేషించుకోవాలని, ఏదైనా చర్య తీసుకోబోయే ముందు కాశ్మీర్ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాడికి ప్రతి దాడి తప్పక ఉంటుందని, ఆ దాడి ఎప్పుడు? ఎలా? అన్నది అత్యంత రహస్యంగా ఉంచనున్నారు.
యురీ ఘటన తర్వాత పాకిస్తాన్ కవ్వింపులు మరింత పెరుగుతున్నాయి. రెండు దేశాల సరిహద్దుల దగ్గర తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ యుద్ధానికి కాలు దువ్వాడు. భారతపై అణ్వాయుధాన్ని ప్రయోగించడానికి సైతం వెనుకాడేది లేదంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. పాకిస్తాన్‌కు ముప్పువాటిల్లినప్పుడు అంతిమంగా అణ్వాయుధ ప్రయోగం తప్పదన్నారు. అణ్వాయుధ ప్రయోగ సామర్థ్యంలోనూ పాక్‌దే పైచేయి అని చెప్పుకొచ్చారు. అయితే భారత్‌తో యుద్ధం జరుగుతుందని అనుకోవడం లేదని ఆసిఫ్ అన్నారు
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









