500వ టెస్టులో భారత్ చిరస్మరణీయ విజయం

- September 26, 2016 , by Maagulf
500వ టెస్టులో భారత్ చిరస్మరణీయ విజయం

చారిత్రక 500వ టెస్టులో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. నాలుగోరోజే దాదాపుగా విజయాన్ని ఖరారు చేసుకున్న భారత్‌ చివరిరోజు తొలి సెషన్‌ నుంచే ఆధిపత్యం కనబరిచింది. కివీస్ బ్యాట్స్‌మెన్ ల్యూక్ రోంచి, శాంట్నర్‌ 102 పరుగుల పార్టనర్‌షిప్‌తో పోరాడినప్పటకీ ఫలితం లేకపోయింది. లంచ్‌కి ముందే రోంచీతో పాటు వాట్లింగ్ , క్రెయిగ్‌ ఔటయ్యారు. తర్వాత మిగిలిన టెయిలెండర్లకు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పెవిలియన్‌కు పంపడంతో భారత్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సొంతగడ్డపై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. బ్యాటింగ్‌లో మురళీ విజయ్ , పుజారా , రోహిత్‌శర్మ, జడేజా అద్భుతంగా రాణించారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ వీరు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పడంతో భారత్ మంచి స్కోర్లు నమోదు చేసింది. తర్వాత బౌలర్లు కూడా చెలరేగడంతో 500వ టెస్టులో కోహ్లీసేన మెమరబుల్ విక్టరీని అందుకుంది. టెస్ట్ క్రికెట్‌లో భారత స్పిన్నర్లు ఎంత కీలకమో మరోసారి రుజువైంది. కాన్పూర్ పిచ్‌పై మన స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించారు. రెండోరోజు 152 పరుగులతో పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్‌ను 262 పరుగులకే ఆలౌట్ చేయడంలో వీరిద్దరికే కీరోల్‌. జడేజా 5 , అశ్విన్ 4 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించారు. అలాగే నాలుగోరోజు చివరి సెషన్‌లో కివీస్ టాపార్డర్‌ను తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు పంపిన అశ్విన్ భారత విజయానికి బాటలు వేశాడు. అటు బ్యాటింగ్‌లోనూ రాణించిన వీరిద్దరూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించారు. - 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com