అంగరంగ వైభవంగా జరిగిన ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్
- September 28, 2016
ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రోత్సవంగా రామోజీ ఫిలింసిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండీవుడ్ కార్నివాల్ అంగరంగ వైభవంగా జరిగింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో దేశవిదేశాల నుంచి సినీ పరిశ్రమ ప్రముఖులు, వర్ధమాన తారలు, ఫిలిం ఇన్స్టిట్యూట్ల విద్యార్థులు, సినిమా ప్రేమికులు తరలివచ్చారు. ప్రపంచంలోని మేటి చిత్రాల ప్రదర్శన ఓ వైపు... భారతీయ సినీ పరిశ్రమ దశ, దిశలపై జరిగిన చర్చా గోష్ఠులు మరో వైపు... ఇలా ఇండీవుడ్ వేదిక వినోద విజ్ఞాన మేళవింపుగా మరచిపోలేని అనుభూతులు మిగిల్చింది.
భారతీయ సినిమాకు ఆ సత్తా ఉంది
ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ ముగింపు ఉత్సవాల్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
''భారతీయ సినిమా ప్రపంచ సినీ పరిశ్రమకు మార్గదర్శకత్వం వహిస్తుంది.
ప్రపంచస్థాయికి ఎదిగే సత్తా దానికి ఉంది'' అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ ఉత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ, భారతీయ సినీ పరిశ్రమ విలువ 2014లో రూ.126 బిలియన్లు ఉండేదని, అది 2019 నాటికి రూ.204 బిలియన్లు అవుతుందని ఫిక్కీ అంచనా వేసిందని తెలిపారు. అందులోనూ తమిళం, తెలుగు సినిమా మార్కెట్ అధికమన్నారు. సినిమా పరిశ్రమకు అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రపంచ సినిమాల నిర్మాణం భారత్‌లో అధికంగా జరిగేలా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విదేశీయులకు షూటింగ్‌ల కోసం త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు ఫిల్మ్ ఫెసిలిటేషన్ కార్యాలయం (ఎఫ్ఎఫ్ఓ)ను ఇటీవల నెలకొల్పామన్నారు. అది జాతీయ సినీ అభివృద్ధి సంస్థ కార్యాలయాలున్న దిల్లీ, ముంబయి, చెన్నె, కోల్‌కతల నుంచి నడుస్తుందని తెలిపారు. అంతేకాకుండా సినిమాల రక్షణకు, నిక్షిప్తానికి రూ.597 కోట్లతో నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్‌ను అమలు చేస్తున్నామన్నారు. నిబంధనలను సరళతరం చేస్తున్నామన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి, చైనా వృద్ధి రేటు తగ్గిపోతోందని, ఒక్క భారత్‌లో మాత్రమే వృద్ధి రేటు పెరుగుతోందని చెప్పారు. ఇది ప్రపంచబ్యాంకు, ఆసియా బ్యాంకు, ఎకనామిక్ ఫోరమ్ చెబుతున్న మాటన్నారు. 'అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. వినోదం ఇవ్వండి. మీరూ సంపాదించుకోండి' అంటూ విదేశీ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులను వెంకయ్యనాయుడు కోరారు. భారత్‌కు గొప్ప సంస్కృతి, వారసత్వం ఉందని పేర్కొన్నారు. ఎన్నో అంశాలలో భారత్ ప్రథమ స్థానంలో ఉందని, సినిమాల నిర్మాణంలోనూ అగ్రస్థానమేనన్నారు. ప్రపంచ సినీ పరిశ్రమను నడిపించేలా ఎదిగే సత్తా భారతీయ సినిమాకు ఉందన్నారు. సినిమా ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇవ్వడంతోపాటు మంచి సందేశం ఇవ్వాలని సూచించారు. తమ చిన్నప్పుడు చక్కని సినిమాలు వచ్చేవని గుర్తు చేసుకుంటూ, ''ఇప్పుడు లోకం మారుతోంది. ఆనాడు సంవత్సరం పాటు సినిమాలు నడిచేవి. ఇప్పుడు అయిదు రోజులు నడిస్తే గొప్ప సినిమా అవుతోంది'' అంటూ పోలిక చూపించారు. ''ఒకప్పుడు సినిమాలో నాయకానాయికలు ఒకరినొకరు తాకకుండానే ముఖకవళికలతో ప్రేమభావాన్ని పలికించేవారు. మరి ఇప్పుడేమో ఒకరినొకరు తాకినా, పీకినా, గోకినా శృంగార రసాన్ని పలికించలేకపోతున్నారు'' అంటూ చమత్కరించారు. ఈరోజుల్లో ప్రచారం, ఆర్భాటం తప్ప సినిమాలో సరుకు ఉండటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సంగీతం, సాహిత్యం స్థానంలో వాయిద్యం ఎక్కువైందన్నారు.
ఆధునిక బ్రహ్మ రామోజీరావు
''ఇంత అందమైన ఫిల్మ్‌సిటీని రూపొందించిన రామోజీరావును నేను ఆధునిక బ్రహ్మ అంటాను. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రామోజీ ఫిల్మ్‌సిటీకి సృష్టికర్త, ఇంజినీర్, ఆర్కిటెక్ట్ ఆయనే'' అన్నారు. కేవలం సినిమాకు సంబంధించే కాదు టీవీ ఛానెళ్లు, ఈనాడు, అన్నదాత, చతుర, విపుల... ఇలా ఎన్నింటికో ఆయన సృష్టికర్తన్నారు వెంకయ్యనాయుడు.
ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ వ్యవస్థాపకుడు, సీఈఓ సోహన్ రాయ్ మాట్లాడుతూ భారతీయ పరిశ్రమ త్వరలోనే ప్రపంచ సినిమా పరిశ్రమను ఏలుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వచ్చే అయిదేళ్లలో భారత్‌లోని అన్ని సినిమా పరిశ్రమలు ఒక్క తాటిపైకి వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐ అండ్ పీఆర్ కమిషనర్ నవీన్ మిత్తల్ మాట్లాడుతూ సినీ పరిశ్రమను ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ ప్రసంగిస్తూ ఫిల్మ్ కార్మివాల్ను నిర్వహించేందుకు తగిన వేదికను ఎంచుకున్నారని నిర్వాహకులను ప్రశంసించారు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా పరిశ్రమకు పైరసీ అనే కేన్సర్ సోకిందని, దాన్ని నిర్మూలించేందుకు కేంద్ర మంత్రి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఫాతిమా హెల్త్‌కేర్ గ్రూపు ఛైర్మన్ డాక్టర్ కేపీ హుస్సేన్ మాట్లాడుతూ ఈ ఏడాది తాను కూడా ఒక సినిమా నిర్మిస్తానన్నారు. దక్షిణ భారతీయ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు గంగరాజు మాట్లాడుతూ పైరసీ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటే పరిశ్రమ బాగా ఎదుగుతుందని అభిప్రాయబడ్డారు. భారత సినిమా సమాఖ్య ప్రతినిధి కాట్రగడ్డ ప్రసాద్ ప్రసంగిస్తూ కార్నివాల్‌ను ప్రతి ఏటా ఒక నగరంలో నిర్వహిస్తే అందరినీ ఆకర్షించవచ్చన్నారు. 'మా' అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సినిమాకు ప్రపంచ మార్కెట్ ఉందని బాహుబలి నిరూపించిందని చెప్పారు. హాలీవుడ్ సినిమాలు సైతం 60 శాతం హైదరాబాద్‌లోనే నిర్మాణమవుతున్నాయని తెలిపారు. కార్నివాల్ నిర్వహణకు రామోజీ ఫిల్మ్ సిటీని ఎంచుకున్నందుకు సోహన్రాయ్ను ఆయన అభినందించారు. ఇది తగిన వేదికని అభిప్రాయపడ్డారు.
అఖిల భారత సినిమా కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు శంకర్, నైజీరియాలోని ఒలోమో రాజు ఆర్ఎల్ ఆబ్గాన్ ఓగోని తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో విదేశీ సినీ ప్రముఖులతో పాటు, తెలుగు సినీ నటులు, దర్శకులు పాల్గొన్నారు.
ప్రతిభకు సత్కారం ఇండీవుడ్ కార్నివాల్లో దేశవిదేశాల నుంచి పలు చిత్రాలు, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు పోటీలో నిలిచాయి. వీటిలో ఉత్తమ చిత్రాలను ఎంపికచేసి నగదు పురస్కారాలు అందజేశారు.
ఉత్తమ చిత్రం: నైస్: ది హార్ట్ ఆఫ్ మ్యాడ్నెస్
ఉత్తమ ఇండియన్ పనోరమ చిత్రం: పతేమరి
ఫిలిం క్రిటిక్స్ ఉత్తమ భారతీయ చిత్రం: వయెలిన్ ప్లేయర్
పీపుల్స్ ఛాయిస్ ఉత్తమ చిత్రం: షంఖచిల్
ఉత్తమ నూతన దర్శకుడి చిత్రం: ఫస్ట్ సెమ్
ఉత్తమ లఘుచిత్రం: ది స్కూల్
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: ది గ్రేట్ ట్రాన్స్మిషన్
ఉత్తమ విద్యార్థి లఘుచిత్రం: చవెర్
ఈవెంట్ ఉత్తమ బాలల చిత్రం: ఆదిత్య క్రియేటివ్ జీనియస్
ఉత్తమ నటన: లొట్టొట్ డి లియెన్ (ఫస్ట్ సెమ్)
బి.నర్సింగరావు, మధు అంబట్, బి.లెనిన్, తోట తరణి, నారాయణదాస్‌నారంగ్, గౌతం ఘోష్, శ్రీ కుమరన్తంపిలకు భారతీయ సినిమాకు విశిష్టసేవలందించినందుకు స్టాండింగ్ ఒవేషన్ ఫర్సిగ్నిఫికెన్స్ పురస్కారాలను అందజేశారు.


_1475050329.jpg)


తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







