రివ్యూ: నరుడా డోనరుడా
- November 03, 2016
సినిమా పేరు: నరుడా డోనరుడా
నటీనటులు: సుమంత్.. పల్లవి సుభాష్.. తనికెళ్ల భరణి.. శ్రీలక్ష్మి.. సుమంత్ శెట్టి తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
మాటలు: కిట్టూ విస్సాప్రగడ.. విద్యాసాగర్ రాచకొండ
చాయాగ్రహణం: షనీల్ డియో
నిర్మాతలు: సుప్రియ..
జాన్‌సుధీర్ పూదోట
దర్శకత్వం: మల్లిక్ రామ్
సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్
విడుదల: 04-11-2016
సు మంత్ నుంచి రెండేళ్లుగా సినిమా రాలేదు. ఆయన మంచి కథ కోసం ఎదురు చూసీ.. చూసీ చేసిన సినిమా 'నరుడా డోనరుడా'. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'విక్కీ డోనర్'కి ఇది రీమేక్. కథా నేపథ్య పరంగా చూస్తే.. ఇది సాహసోపేతమైన ప్రయత్నమే. ఓ స్పెర్మ్ డోనార్ కథ ఇది. దాన్ని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా.. అర్థమయ్యేలా ఎలా తీశారు? విరామం తర్వాత వస్తున్న సుమంత్ నటనలో మార్పులేమైనా కనిపించాయా? సుమంత్ కెరీర్‌ని మార్చేసే చిత్రం అవుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే?: విక్కీ (సుమంత్) ఓ మధ్య తరగతి యువకుడు. క్రికెటర్. అమ్మ(శ్రీలక్ష్మి).. నాయనమ్మలతో సంతోషంగా గడిపేస్తుంటాడు. ఓ బ్యాంకులో పనిచేసే ఆషిమా రాయ్ (పల్లవి సుభాష్) అనే బెంగాలీ అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తానూ మెల్లమెల్లగా విక్కీ ప్రేమలో పడిపోతుంది. అయితే తాను ఇది వరకే ఒకర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అతనితో విడాకులు తీసుకున్న విషయాన్ని విక్కీకి ముందే చెబుతుంది.
విక్కీ మాత్రం ఆషిమా దగ్గర ఓ నిజం దాస్తాడు. అదేంటంటే.. తనో స్పెర్మ్ డోనర్. సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకుడు ఆంజనేయులు (తనికెళ్ల భరణి) బలవంతం చేయడంతో తన వీర్యాన్ని దానం చేయడానికి ఒప్పుకొంటాడు. తన ఖర్చులకు.. అవసరాలకు సరిపడినంత డబ్బు వస్తుండడంతో దానికి అలవాటు పడతాడు. ఈ నిజం దాచి అషిమాని పెళ్లి చేసుకొంటాడు. అయితే ఓ సందర్భంలో ఈ నిజం అషిమాకు తెలిసిపోతుంది. అప్పుడు ఏం జరిగింది? వీళ్లిద్దరి కథ ఏ మలుపు తిరిగింది? వీళ్ల వైవాహిక జీవితం ఏమైంది? ఈ విషయాలన్నీ వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..?: బాలీవుడ్ చిత్రాన్నీ.. అందులో పాత్రల్నీ మక్కీకి మక్కీ దించే ప్రయత్నం జరిగిందీ చిత్రంలో. 'విక్కీ డోనర్' చూసిన వాళ్లకు ఈ సినిమా కాపీ పేస్ట్‌లానే ఉంటుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ కథా నేపథ్యం కొత్తగా అనిపిస్తుంది. వీర్యదానం అనే కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుంటే తొలి భాగాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. అదేదో చూడకూడనిది.. చేయకూడనిది అనుకొంటే ఆయా సన్నివేశాలు వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది పడొచ్చు.
వీర్యదానం, విత్తనం.. లాంటి సంభాషణలే తొలి భాగం అంతా వినిపిస్తుంటాయి. అదే పాయింట్‌ని వేర్వేరు అర్థాలొచ్చేటట్టు సాగే డైలాగులు అర్థం చేసుకుంటే అందులోని వినోదాన్ని ఆస్వాదించొచ్చు. లేదంటే ఏ డైలాగూ చెవికి ఎక్కకపోయే ప్రమాదం ఉంది. సున్నితమైన విషయాన్ని డీల్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. ఎక్కువ శాతం వినోదాన్ని మేళవించి చెప్పారు. ద్వితీయార్థంలో భావోద్వేగ సన్నివేశాలు నడుస్తాయి.
అషిమా.. విక్కీ వైవాహిక బంధంలో ఎదురైన సమస్యలు.. ఆ సందర్భంగా విక్కీ వేదన.. ఇలా ద్వితీయార్థం కాస్తంత భారంగానే సాగుతుంది. పతాక సన్నివేశాలు హత్తుకొనేలా తీశాడు దర్శకుడు. చివర్లో నాగచైతన్య ఎంట్రీ.. అక్కినేని అభిమానుల్ని ఉత్సాహపరుస్తుంది.
ఎవరెలా చేశారంటే..: సుమంత్.. భరణి.. సినిమా అంతా వీళ్లే కనిపిస్తుంటారు. కథానాయకుడికి నాయికతో కెమెస్ట్రీ కంటే ఆంజనేయులు అనే పాత్రతో కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు అనిపించింది. ఈ తరహా ఉత్సాహభరిత పాత్ర చేయడం సుమంత్‌కి ఇదే తొలిసారి. తన బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీ మారాయి. చురుగ్గా నటించాడు. ద్వితీయార్థం అంతా తన మార్కు సన్నివేశాలే కాబట్టి.. వాటిలోనూ రాణించాడు. ఆంజనేయులుగా భరణి తన అనుభవాన్నంతా రంగరించారు. వినోదం పండించడంలో ఆయనదే ప్రముఖ పాత్ర. శ్రీలక్ష్మి చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి పాత్రలో కనిపించారు. ఆంజనేయులు అసిస్టెంట్‌గా సుమంత్ శెట్టి మెప్పించాడు.
సాంకేతికంగా మాటల రచయితల పతిభ కనిపిస్తుంటుంది. తమాషా పద ప్రయోగాలు చేశారు. 'విత్తనం' అనే మాటను చాలా రకాలుగా.. చాలాసార్లు వాడారు. దర్శకుడు మల్లిక్ రామ్ ఉన్నది ఉన్నట్టు తీయడానికి ప్రయత్నిచాడంతే. తక్కువ బడ్జెట్‌లో తీసిన సినిమానే అయినా నాణ్యత కనిపిస్తుంది.
బలాలు
+ కథా నేపథ్యం
+ వినోదం
+ సుమంత్.. తనికెళ్ల భరణి
బలహీనతలు
- బోల్డ్ కంటెంట్
* చివరగా.. నవ్వించి.. గుండె బరువెక్కించే.. 'నరుడా డోనరుడా'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









