కొత్త డిజైన్, కొత్త రంగుతో వెయ్యి రూపాయల నోటు...

- November 10, 2016 , by Maagulf
కొత్త డిజైన్, కొత్త రంగుతో వెయ్యి రూపాయల నోటు...

మరిన్ని భద్రతా ప్రమాణాలతో కొత్త వెయ్యి రూపాయల నోటును త్వరలోనే తీసుకొస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంత దాస్ మీడియాతో మాట్లాడారు. మరికొద్ది నెలల్లో కొత్త డిజైన్, కొత్త రంగుతో వెయ్యి రూపాయల నోటును అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా బ్యాంకుల శాఖ, ఆర్బీఐ అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు. ప్రజల అవసరాలకు సరిపడా కరెన్సీని వెంటనే అందుబాటులోకి తీసుకొస్తామని... ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ పౌరులు కొనుగోళ్లు చేసేందుకు కొద్దిరోజుల పాటు ఇబ్బంది ఎదురైనప్పటికీ...దీర్ఘకాలికంగా దేశానికి లబ్ది చేకూరుతుందన్నారు. ప్రభుత్వానికి తెలపకుండా భారీ మొత్తంలో డబ్బు పోగేసిన వారిపైనే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ప్రజల కొనుగోలు అలవాట్లు ప్రభావితం కాగలవని జైట్లీ పేర్కొన్నారు. పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించిన తరువాత వెయ్యి రూపాయల నోటును కొనసాగిస్తారా లేదా అన్ని దానిపై సందేహం నెలకొన్న సంగతి తెలిసిందే.రూ.1000 నోట్లు నిలిపివేసి రూ.2000 నోట్లు తీసుకురావడం ద్వారా అవినీతిని ఎలా నిర్మూలిస్తారని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించిన నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా ప్రకటన విడుదల చేయడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com