పెద్ద నోట్ల రద్దుతో అప్రమత్తమైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు

- November 16, 2016 , by Maagulf
పెద్ద నోట్ల రద్దుతో అప్రమత్తమైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సామాన్యులకు ఇబ్బందులు ఎదురవకుండా అధికారులకు సూచనలు చేస్తున్నారు. రోజు మారుతున్నా, బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూలు మాత్రం తరగడం లేదు.
ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దువల్ల ఏర్పడిన సమస్యల్ని అధిగమించేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. నోటు పోటు నుంచి రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ చంద్రబాబు, కేసీఆర్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
సరిపడినంత కరెన్సీ పంపించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు.. ఇటు అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయం అందించాలని మంత్రులు నిర్ణయించారు. మరోవైపు నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సత్వరం పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ  రాశారు. 100, 50 రూపాయల నోట్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రైతులు రుణాలు  చెల్లించేందుకు నిబంధనలు  సవరించాలని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com