నన్ను ఖననం చేయొద్దు ...
- November 18, 2016
నన్ను ఖననం చేయొద్దు
చనిపోయాక అత్యంత శీతలీకరణ పద్ధతిలో భద్రపర్చండి
బ్రిటన్ బాలిక చివరి కోరిక
న్యాయపోరాటంలో గెలుపు
లండన్: జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలించాలనుకున్న ఆ బాలికకు ఓ చేదు నిజం తెలిసింది. 14 ఏళ్లకే తనకు నూరేళ్లు నిండిపోతాయన్న వాస్తవం ఆమెను హతాశురాలిని చేసింది. కానీ శాస్త్ర పరిజ్ఞానంపై ఆమె అచంచల విశ్వాసం కనబర్చింది. ఇప్పుడు మరణించినా మరో వందేళ్లలోనయినా తనకు తగిన చికిత్స లభించి బతికే అవకాశాలుంటాయని విశ్వసించింది.
అందుకే తన భౌతికకాయాన్ని తగిన చికిత్స లభించేంత వరకు అత్యంత శీతలీకరణ పద్ధతిలో భద్రపర్చడానికి అవకాశం కల్పించాలని బ్రిటన్ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. గత నెలలో మరణించడానికి కొద్ది రోజుల ముందు అరుదైన న్యాయపోరాటంలో ఆమె విజయం సాధించింది. ఈ వివరాలను కోర్టు ఆదేశాలతో శుక్రవారమే వెల్లడించారు.
ఆ బాలిక, తల్లిదండ్రుల పేర్లను బహిర్గతం చేయరాదని కోర్టు ఆదేశించింది. ఆ బాలిక పేరును జేఎస్‌గా కోర్టు ప్రస్తావించింది. మరణించిన తర్వాత భౌతికకాయాలను అత్యంత శీతలీకరణ పద్ధతిలో భద్రపర్చడానికి బ్రిటన్ చట్టాలు అనుమతిస్తాయి. అయితే పిల్లలకు ఇటువంటి పరిస్థితి వస్తే తల్లిదండ్రులిద్దరి అనుమతీ అవసరం. జేఎస్ తల్లిదండ్రులు విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. జేఎస్ తల్లితో కలిసి లండన్‌లో ఉంటోంది. బాలిక చివరి కోరికకు తండ్రి సుముఖంగా లేరు. నైతిక కారణాలతో ఆయన అంగీకరించలేదు. దీంతో జేఎస్ హైకోర్టును ఆశ్రయించింది. తన చివరి కోరికపై నిర్ణయం తీసుకునే అధికారం తన తల్లికి మాత్రమే కల్పించాలని విజ్ఞప్తి చేసింది. న్యాయమూర్తి జస్టిస్ పీటర్ జాక్సన్ జేఎస్ విన్నపాన్ని మన్నించారు. జేఎస్ కోరికకు ఆమె తల్లి అంగీకరించింది.
జేఎస్ అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఇక చికిత్సకు స్పందించే అవకాశం లేదని కొద్ది నెలల కిందట వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ఆ పాప చాలా బాధ పడింది. తాను బతికే వీలైమయినా ఉంటుందా అని ఇంటర్నెట్‌లో అన్వేషించింది. అత్యంత శీతలీకరణ పద్ధతిలో మృతదేహాలను భద్రపరిచే సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంది. ''నా వయస్సు 14 ఏళ్లు మాత్రమే. నాకు చనిపోవాలని లేదు. కానీ చనిపోతానని తెలుసు. అత్యంత శీతలీకరణ పద్ధతిలో నా శరీరాన్ని భద్రపరిస్తే వందేళ్ల తర్వాత అయినా చికిత్స లభించి మళ్లీ బతికే అవకాశం ఉంటుందేమో. నా శరీరాన్ని ఖననం చేయడం నాకు ఇష్టం లేదు. నాకు చాలా కాలం బతకాలని ఉంది. నా క్యాన్సర్ వ్యాధికి భవిష్యత్తులో చికిత్సను కనుక్కోవచ్చు. నన్ను బతికించవచ్చు. ఈ అవకాశం నాకు కావాలి. ఇది నా కోరిక.'' అని న్యాయమూర్తికి చేసిన విజ్ఞాపనలో బాలిక కోరింది.
జస్టిస్ పీటర్ జాక్సన్.. ఆస్పత్రికి వెళ్లి బాలికను చూశారు. మరణపుటంచుల్లోనూ ఆమె ధైర్యంగా ఉండడాన్ని చూసి చలించిపోయారు.
ఈ కేసు తొలుత సెప్టెంబరు 26న కోర్టు దృష్టికి వచ్చింది. గత నెల 6న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెలువరించారు. గత నెల 17న జేఎస్ తుది శ్వాస విడిచింది.
అత్యంత శీతలీకరణ పద్ధతిలో మృతదేహాలను భద్రపర్చడం చాలా వ్యయంతో కూడుకున్న పని. అమెరికాలో ఉన్న క్రయోనిక్స్ ఇన్‌స్టిట్యూట్ అనే కంపెనీని ఈ పని కోసం జేఎస్ ఎంచుకుంది. ఈ ప్రక్రియకు 37వేల పౌండ్ల ఖర్చు అవుతుంది. జేఎస్ తల్లిదండ్రులకు అంత తాహతు లేదు. అయితే జేఎస్ అమ్మమ్మ, తాతయ్యలు ఆ మొత్తాన్ని సేకరించగలిగారు. జేఎస్ మరణించిన వారం రోజుల తర్వాత ఆమె భౌతికకాయాన్ని అమెరికాకు తరలించి అక్కడ భద్రపర్చారు. 1960ల్లో ఈ ప్రక్రియను కనుక్కొన్న తర్వాత ఇప్పటి వరకు దాదాపు 350 మంది భౌతికకాయాలను భద్రపర్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సేవలను అందించే సంస్థలు మూడే ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







