వాస్తు ప్రకారం స‌ర్వహంగుల‌తో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్ సిద్ధo

- November 22, 2016 , by Maagulf
వాస్తు ప్రకారం స‌ర్వహంగుల‌తో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్ సిద్ధo

వాస్తు ప్రకారం స‌ర్వహంగుల‌తో  తెలంగాణ సీఎం నూత‌న క్యాంప్ ఆఫీస్ సిద్ధమైంది. బేగంపేట‌లో ప్రస్తుతమున్న దానికి స‌మీపంలోనే 8 ఎక‌రాల సువిశాల ప్రాంగ‌ణంలో దీన్ని నిర్మించారు. ఈ నెల 24న ఉద‌యం KCR గృహ‌ప్రవేశం చేయ‌బోతున్నారు. ప‌రిపాల‌న‌కు కావల్సిన అన్ని స‌దుపాయ‌ల‌ను రోడ్లు భ‌వ‌నాల శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది.
ప్రస్తుతం ఉన్న క్యాంప్‌ ఆఫీసు పరిపాల‌న పరంగానే కాక, వాస్తుప‌రంగాను, సంద‌ర్శకుల‌కు అనుకూలంగా లేద‌న్న కారణంతో కొత్త కార్యాలయ నిర్మాణానికి ఆదేశించారు KCR. కొద్ది నెలలుగా దీనికి సంబంధించిన పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. 8 ఎకరాల సువిశాల స్థలంలో 36 కోట్ల రూపాయ‌లతో కొత్త ఆఫీసు కట్టడం పూర్తయింది. మూడు అంత‌స్థుల్లో ఉండే ఈ భ‌వనంలోకి శుక్రవారం ఉద‌యం 5 గంట‌ల‌కు గృహ‌ప్రవేశం చేయ‌నున్నారు. ఇందులో 150కిపైగా గ‌దుల‌ున్నాయి. ఒకేసారి 5 వంద‌ల మంది సమావేశం అయ్యేలా పెద్ద హాల్‌ కూడా ఉంది. మిని థియేట‌ర్‌ కూడా ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాలు, మండలాల‌తో పాటు.. అన్ని శాఖ‌ల అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక హాల్ నిర్మించారు. CMO అధికారుల కోసం ప్రత్యేక ఛాంబ‌ర్లు కూడా ఏర్పాటుచేశారు. విజిట‌ర్స్ కోసం ప్రత్యేక లాంజ్, వాళ్లు CMను క‌లిసేందుకు పెద్ద ద‌ర్బారు హాల్ నిర్మించారు. ఇత‌ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, VIPలు వ‌చ్చిన‌ప్పుడు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక గెస్ట్‌ రూమ్స్ ఉన్నాయి.
స‌చివాల‌యం పూర్తిగా వాస్తుప‌రంగా లేద‌ని మొదట్నుంచి భావిస్తున్న KCR.. ప్రస్తుతం ఉన్న క్యాంపు ఆఫీసులోనే స‌మీక్షలు, స‌మావేశాలు నిర్వహిస్తున్నారు. ఐతే.. పాలనాపరమైన అన్ని పనులకు సౌకర్యవంతంగా లేకపోవడంతో ఈ కొత్త కార్యాలయం నిర్మించారు. 24న గృహ‌ప్రవేశం తర్వాత ప‌రిపాల‌నంతా  ఇక్కడి నుంచే జరుగుతుంది. కొత్త క్యాంపు కార్యాల‌య ప్రాంగ‌ణంలో అమ్మవారి ఆల‌యాన్ని నిర్మించి ఇప్పటికే ప్రత్యేక పూజ‌లు కూడా చేశారు  KCR. R&B అధికారులు CM నివాసంలో పెడింగ్ పనులేమీ లేకుండా ఇప్పటికే పక్కాగా దాన్ని సిద్ధం చేశారు. శుక్రవారం గృహప్రవేశం జరగబోతోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com