ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి నేడు

- December 03, 2016 , by Maagulf
ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి నేడు

ఘంటసాల.. ఆయనొక సంగీత పాఠశాల. సంగీత ప్రపంచంలో బహుదూరపు బాటసారి. పాటకు సంగీతం నేర్పిన గురువు. శ్రోతలకు సరికొత్త సరిగమలు వినిపించిన సుమధుర గాయకుడు. తన అద్భుత కంఠంతో మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటను పరవశంలో ముంచెత్తిన బహుముఖ ప్రజ్ఞాశాలి. మధుర గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి నేడు (ఆదివారం). ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఘంటసాల సినీ ప్రస్థానం గురించి 'నవచిత్రం' పాఠకులకు ప్రత్యేకం.. 
అపజయమే నాంది పలికింది.. 
'భగవద్గీత'ను పారాయణం చేసి కోట్లాది మంది శ్రోతల మదిలో సుస్థిర స్థానంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఘంటసాల పూర్తి పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు.

డిసెంబర్‌ 4న గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో ఘంటసాల సూర్య నారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు. సూర్య నారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. ఘంటసాలని భుజంపైన కూర్చోబెట్టుకుని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. దీంతో చిన్నప్పట్నుంచే ఘంటసాలకు సంగీతంపై మంచి అవగాహన ఏర్పడింది. 
సంగీత సభల్లో ఘంటసాల నాట్యం చేస్తున్నప్పుడు ఆయన నాట్యానికి ముగ్దులై అందరు ఆయన్ని 'బాల భరతుడు' అని పిలిచేవారు. భవిష్యత్‌లో గొప్ప సంగీత విద్వాంసుడు కావాలన్న తన తండ్రి సూర్యనారాయణ కోరిక మేరకు సంగీత రంగంలోకి వచ్చారు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసుల పోటీలో ఓడిపోయి నవ్వుల పాలయ్యారు. అప్పట్నుంచి ఆయనలో సంగీతంపై మరింత పట్టుదల పెరిగింది. ఆ పట్టుదలే ఆయన్నొక సంగీత పాఠశాలగా తీర్చిదిద్దింది.
రోజుకొక ఇంట్లో భోజనం.. 
సంగీతం నేర్చుకోవడానికి కావాల్సిన డబ్బుల కోసం తొలుత బట్టలు ఉతకడం, వంట చేయడం వంటి పనులు చేశారు. దీని వల్ల లాభం లేదని తన వద్ద ఉన్న ఉంగరం అమ్మి విజయనగరంలో ఉన్న సంగీత కళాశాలకు వెళ్ళారు. 
వేసవి కావడంతో ఆ కళాశాల మూసేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ని ప్రాధేయపడగా అక్కడ బస చేసే అవకాశం కల్పించారు. అక్కడే రోజుకో ఇంట్లో భోజనం చేస్తూ కడుపు నింపుకున్నారు. ఘంటసాల పరిస్థితి తెలుసుకున్న సంగీత కారుడు పట్రాయని సీతారామశాస్త్రి ఉచితంగా సంగీత శిక్షణ ఇచ్చారు. ఆయన శిష్యరికంలో ఆరితేరి చౌటపల్లెలో జరిగే ఉత్సవాలు, వివాహ మహోత్సవాల్లో పాటలు పాడుతూ, సంగీత పాఠాలు చెప్పారు.1942 ప్రాంతంలో స్వాతంత్య్ర సమరయోధునిగా క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండేండ్ల పాటు అలీపూర్‌ జైల్లో నిర్భంధంలో ఉన్నారు. 
అవకాశాలు రాక వాచ్‌మెన్‌గా.. 
ఘంటసాలలో ఉన్న సంగీత ప్రావీణ్యం గురించి తెలుసుకున్న సముద్రాల రాఘవచార్య మద్రాసుకి పిలిపించి దర్శక, నిర్మాతలు చిత్తూరు నాగయ్య, బి.ఎన్‌.రెడ్డిలకు పరిచయం చేశారు. అయినప్పటికీ ఎటువంటి అవకాశాలు రాక పానగల్‌ పార్క్‌లో వాచ్‌మెన్‌గా పని చేశారు. కొన్నాళ్ళ తర్వాత అతికష్టమ్మీద మద్రాసు రేడియో కేంద్రంలో లలిత సంగీత గాయకుడిగా అవకాశం వచ్చింది. పాటలు పాడుతూనే సినిమాల్లో చిన్న చిన్న వేషాలు కూడా నటించారు. దీంతో సినీరంగ పెద్దల దృష్టిలో పడ్డారు. తొలిసారి చిత్తూరు నాగయ్య, బి.ఎన్‌.రెడ్డిలు రూపొందించిన 'స్వర్గసీమ' చిత్రంలో నేపథ్యగాయకుడిగా పాట పాడే అవకాశం వచ్చింది. ఆయన పాడిన తొలిపాట 'సీతారామ జననం'. అందుకు తీసుకున్న తొలి పారితోషికం 116 రూపాయలు. 'మనదేశం' చిత్రంతో సంగీత దర్శకుడిగా మారారు. సినిమాల్లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ హావభావాలకు ఘంటసాల సుమమధుర గానం తోడవ్వడంతో ప్రేక్షకులు ఆనంద పరవశులయ్యారు.
మలుపు తిప్పిన 'పాతాళభైరవి'.. 
'పాతాళభైరవి' విజయంతో ఘంటసాల పేరు రాష్ట్రమంతా మారు మోగింది. 'మల్లీశ్వరి', 'దేవదాసు', 'అనార్కలి', 'మాయా బజార్‌', 'కీలు గుర్రం', 'శ్రీ వెంకటేశ్వర మహత్యం' వంటి చిత్రాలు ఘంటసాల సంగీత ప్రతిభకు గీటురాళ్ళుగా నిలిచాయి. బహుదూరపు బాటసారీ, ఇటు రావో ఒక్కసారీ!' అని ఆహ్వానించినా, 'తలనిండ పూదండ దాల్చిన రాణి, మొలకా నవ్వుల తోడ మురిపించబోకే' అంటూ అమ్మాయి అందాన్ని వర్ణించినా, 'నీ కొండకు నీవే రప్పించుకో' అంటూ ఆ వేంకటేశ్వరుడ్ని వేడుకున్నా, 'ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా 'అని భక్తితో గొంతెత్తి ఆలపించినా అది ఘంటసాలకే చెందింది. ఎస్‌.రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, ఎం.ఎస్‌.విశ్వనాథన్‌, కె.వి.మహదేవన్‌, ఆదినారాయణరావు, మాస్టర్‌ వేణు, టి.వి.రాజు, టి.చలపతిరావు, శంకర్‌ జై కిషన్‌, సుశర్ల దక్షిణామూర్తి వంటి తదితర సంగీత దర్శకుల ఆధ్వర్యంలో ఎన్నో వినసొంపైన పాటలను ఘంటసాల ఆలపించారు. మూడు దశాబ్దాల కెరీర్‌లో ఘంటసాల 125 చిత్రాలకు సంగీతమందించగా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, తులు, హిందీ తదితర భాషల్లో దాదాపు 13 వేలకు పైగా పాటలు పాడి అలరించారు. భగవద్గీత, పుష్పవిలాపం, దేశభక్తి గీతాలు, భక్తిగీతాలు, జానపద గీతాలతో రూపొందించిన ఆల్బమ్స్‌తో 
ఆకట్టుకుని శ్రోతల మదిలో చెరగని ముద్ర వేశారు.
సేవాగుణాన్ని చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి.. 
'భారతీయ సినీ సంగీతానికి చేసిన కృషికి గాను 1970లో కేంద్రప్రభుత్వం ఘంటసాలను 'పద్మశ్రీ' పురస్కారంతో సముచితంగా సత్కరించింది. అలాగే ఆయన ఫొటోతో పోస్టల్‌ స్టాంపుని కూడా విడుదల చేసింది. భగవద్గీత పూర్తయిన తర్వాత పాటలు పాడకూడదని నిర్ణయించుకున్నారు. కాని అకస్మాత్తుగా 1974 ఫిబ్రవరి 11న అనారోగ్యంతో కన్నుమూశారు. ఘంటసాల చివరి రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. మానవతా దృక్పథంతో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. భౌతికంగా మన మధ్యలేక పోయినా మధురమైన పాటల్లో ఘంటసాల ఎప్పటికీ జీవించే ఉంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com