ఇక రహదారుల వెంట నో మందు

- December 16, 2016 , by Maagulf
ఇక రహదారుల వెంట నో మందు

మద్యం వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు ఆరోగ్యం పాడైపోతుంటే.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో మద్యం తాగి వాహనాలు నడపవద్దంటూ ప్రచారం ముమ్మరం చేశారు. అయినా వాటిని పట్టించుకునేవారే కరువయ్యారు. ఇప్పటికీ యధేచ్ఛగా మద్యం తాగి వాహనాలు నడిపేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో.. జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. వెంటనే జాతీయ రహదారుల వెంబడి ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని ఆదేశించింది.

వాటి లైసెన్సులను కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత కాలపరిమితి ముగిసే వరకూ కొనసాగించాలని మినహాయింపు ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత కొత్త లైసెన్సులు ఇవ్వొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. జాతీయ రహదారికి 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండేందుకు వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక.. రహదారుల వెంబడి ఉన్న లిక్కర్ బ్యానర్లు, ప్రకటనలను కూడా తొలగించాలని స్పష్టంచేసింది. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీసు అధికారులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. వాహనదారుల భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com