నాన్న నేను నా బోయ్‌ఫ్రెండ్స్ సినిమా రివ్యూ
- December 16, 2016
రివ్యూ:
సినిమా పేరు: నాన్న నేను నా బోయ్‌ఫ్రెండ్స్
నటీనటులు: హెబ్బా పటేల్.. అశ్విన్.. నోయెల్.. పార్వతీశం.. రావు రమేష్.. తేజస్వి.. తాగుబోతు రమేష్.. ధన్‌రాజ్ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు
కథ: బి.
సాయికృష్ణ
నిర్మాత: బెక్కం వేణుగోపాల్
దర్శకత్వం: భాస్కర్ బండి
సంస్థ: లక్కీ మీడియా
విడుదల: 16-12-2016
ఓ కథానాయకుడు.. ఇద్దరు కథానాయికల ఫార్ములా చూసిందే. ఓ కథానాయిక ఇద్దరు కథానాయకుల కథలూ విన్నాం. ఇది మాత్రం ఓ పారూ.. ముగ్గురు దేవదాసుల కథ. ముగ్గురేంటి..? ఆ మాటకొస్తే నలుగురు. ప్రేమలో ఉండే కన్ఫ్యూజన్లు.. తెచ్చుకోవాల్సిన క్లారిటీలూ. తేలాల్సిన లెక్కలూ.. ఇవన్నీ మేళవించి ఓ సినిమా తీశారు. అదే.. 'నాన్న నేను నా బోయ్‌ఫ్రెండ్స్'. టైటిల్లో యూత్‌నీ.. ఫ్యామిలీని కలిపినట్టు సినిమానీ అలాంటి ప్యాకేజీతోనే అందివ్వాలని చిత్రబృందం భావించింది. మరీ సినిమా కథేంటి? ఒకమ్మాయి.. ముగ్గురు అబ్బాయిల కథ ఎంత వరకూ పండింది? ఈ విషయాలు తేలాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే..?: అనగనగా ఓ తండ్రి (రావు రమేష్). లేక లేక పుట్టిన తన కూతుర్ని (హెబ్బా పటేల్) అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. కూతురు ఎడ్డెం అంటే తండ్రి కూడా ఎడ్డెం అంటాడు. ఇక వాళ్లిద్దరి మధ్య గొడవలు ఎందుకొస్తాయి? ఆ కూతురికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకొంటాడు. కానీ.. 'నేనో అబ్బాయిని ప్రేమించా. తననే చేసుకొంటా' అంటుంది. కానీ అది అబద్ధం.
కూతురు ఇష్టమే తండ్రి ఇష్టం కాబట్టి.. 'ఆ అబ్బాయినే చేసుకో' అంటాడు. కానీ ఆర్నెల్లు గడువు ఇస్తాడు. గడువు లోపు ప్రేమించినోడ్ని పెళ్లి చేసుకోవాలి.. లేదంటే తాను చూపించినోడిని కాదనకూడదన్నది షరతు. ప్రేమించానన్న అబద్ధాన్ని నిజం చేయడానికి తనకు కావాల్సిన అబ్బాయిల్ని అన్వేషిస్తుంది. చివరికి ముగ్గుర్ని (నోయెల్.. పార్వతీశం.. అశ్విన్) చూసుకొని.. వాళ్లలో ఒకరిని పెళ్లి చేసుకొందామనుకొంటుంది. కానీ ఆ ముగ్గురూ నిజంగానే ప్రేమలో పడిపోతారు. వాళ్ల ప్రేమలో ఉన్న నిజాయతీని కాదనలేక ముగ్గురికీ ఐ లవ్ యూ చెబుతుంది. మరీ ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకొంది? అనేది వెండితెర మీద చూడాల్సిందే.
ఎలా ఉందంటే..?: అటు ఫ్యామిలీ.. ఇటు యువతరాన్నీ ఆకట్టుకోవడానికి టైటిల్ ఎలా పెట్టారో.. కథనీ.. దాన్ని తీర్చిదిద్దిన విధానాన్ని ఉభయకుశలోపరిలా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఓ కూతురిపై తండ్రి పెంచుకొన్న అనుబంధం నుంచి కథ మొదలవుతుంది. ఆ తరవాత కథానాయిక క్యారెక్టర్‌పై బేస్ అయి సినిమా నడుస్తుంటుంది. ముగ్గురు అబ్బాయిల్ని ఎంపిక చేసుకోవడం.. వాళ్లతో ప్రేమలో పడడం.. ఇవన్నీ యువతరాన్ని ఆకట్టుకొనేలా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ప్రేమకథ మూడు ముక్కలుగా సాగుతుంటుంది.
ఆ ముగ్గురు ప్రేమికులకు మూడు విభిన్న నేపథ్యాలు తీసుకోవడం వల్ల ఆయా కథల్లో కాస్త కొత్తదనం కనిపిస్తుంది. అయితే ఈ ముగ్గురి వల్ల కలిగే కన్ఫ్యూజన్ డ్రామా మాత్రం అంతగా పండలేదు. పద్మావతి పెట్టే పరీక్షలు మరీ రొటీన్‌గా అన్నాయి. అంత్యాక్షరి ఎపిసోడ్ అతకలేదు. పబ్‌లో 'శంకరాభరణం' డైలాగులు చెప్పడం ఓవర్‌గా ఉంది. మొత్తంగా ద్వితీయార్థం గాడి తప్పింది. సినిమాని నడిపించడానికి అన్నట్టు సన్నివేశాల్ని పోగేశారంతే. మళ్లీ కైమ్లాక్స్కు వచ్చేసరికి.. ఫీల్ గుడ్ మూవీ అనిపించేలా తెరకెక్కించారు. చివర్లో రాజ్‌తరుణ్ ఎంట్రీ బోనస్. ఓ అమ్మాయి.. ప్రేమ పేరుతో ముగ్గురి జీవితాలతో ఆడుకోవడం.. దాన్ని తండ్రి సమర్థించడం ఎందుకో కరెక్ట్‌గా అనిపించదు.
ఎవరెలా చేశారంటే..?: కుమారి 21 ఎఫ్ తరవాత అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్రలో హెబ్బా కనిపించింది. తన గ్లామర్.. నటన ఈ సినిమాకి ప్రధాన బలం. అశ్విని నటన కూడా ఆకట్టుకొంటుంది. ముగ్గురు బోయ్ ఫ్రెండ్స్ చక్కగా చేశారు. నాన్న పాత్రలో రావురమేష్ మరోసారి ఒదిగిపోయారు. మాటలు అక్కడక్కడ ఆకట్టుకొంటాయి. 'అమ్మాయి ఒంటి మీద బట్టలెన్ని తగ్గితే సమస్యలన్ని పెరుగుతాయి' లాంటి మాటలు చమక్కుమన్నాయి. కథలో కొత్తదనం లేదు. తరువాత ఏం జరుగుతుంది.. అనేది తేలిగ్గా వూహించొచ్చు. ద్వితీయార్థం అంతా టైమ్‌పాస్ చేశారు.
బలాలు
+ హెబ్బాపటేల్.. రావు రమేష్
+ వినోదం
+ పాటలు
బలహీనతలు
- ద్వితీయార్థం
- లాజిక్ లేకపోవటం
* చివరిగా.. 'నాన్న నేను నా బోయ్‌ఫ్రెండ్స్'తో కాస్త టైమ్‌పాస్
ఈ చిత్రానికి మాగల్ఫ్ వారి రేటింగ్: 2.5/5
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









