యెమెన్‌లో నిషేధిత క్లస్టర్‌ రాకెట్ల ప్రయోగించిన సౌదీ సంకీర్ణదళాలు

- December 25, 2016 , by Maagulf
యెమెన్‌లో నిషేధిత క్లస్టర్‌ రాకెట్ల ప్రయోగించిన సౌదీ సంకీర్ణదళాలు

యెమెన్‌లో సౌదీ సంకీర్ణదళాలు నిషేధిత క్లస్టర్‌ మునీషన్‌ ( సమావృత యుద్ధసామాగ్రి ) రాకెట్లు ప్రయోగించినట్టు అంతర్జాతీయ మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ నిర్ధారించింది. ఈనెల 6న ఉత్తర యెమెన్‌లోని నగరంలోని రెండు పాఠశాలలపై జరిగిన వైమానిక దాడుల్లో ఈ ప్రయోగం జరిగినట్టు గుర్తించినట్టు పేర్కొంది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడినట్టు తెలిపింది. సౌదీ సంకీర్ణదళాలు ప్రయోగించిన ఆస్టోరస్‌ క్లస్టర్‌ మునీషన్‌ రాకెట్లు బ్రెజిల్‌లో తయారైనట్టు గుర్తించినట్టు ఆ సంస్థ పేర్కొంది.

దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించడమే కాకుండా, అక్కడి స్థానికుల వాంగ్మూలాన్ని తీసుకున్నామని తెలిపింది. కాగా, క్లస్టర్‌ మునీషన్స్‌ ప్రయోగాన్ని నిషేధించాలనే ఎజెండాతో 2008లో సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న 119 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా సంతకాలు చేశాయి. అయితే, బ్రెజిల్‌, అమెరికా, చైనా, రష్యా, యెమెన్‌, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్‌, ఇరాన్‌ దేశాలు మాత్రం క్లస్టర్‌ మునీషన్స్‌ సదస్సుకు గైర్హాజరయ్యాయి. అంతేగాకుండా, క్లస్టర్‌ మునీషన్స్‌ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని సభ్యదేశాలకు ఐరాస పిలుపునిచ్చింది. బ్రెజిల్‌, అమెరికా, యెమెన్‌, సౌదీ అరేబియా దేశాలు ఐరాస ఏర్పాటు చేసిన ఓటింగ్‌లో పాల్గొనకపోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా, సౌదీ సంకీర్ణదళాలు గతేడాది మార్చి 26న యెమెన్‌లోకి ప్రవేశించాయి. ఆ దేశాధ్యక్షుడు అబ్దేరబ్బూ మన్సూర్‌ హాదీకి మద్దతు ప్రకటించాయి. షీత్‌ హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా అమెరికా, బ్రిటన్‌ల సాయంతో 58 వైమానిక దాడులు నిర్వహించాయి. అయితే, సౌదీ సంకీర్ణదళాలు జరిపిన వైమానిక దాడుల కారణంగా వందలాది మంది సామాన్య పౌరులు మృతి చెందారు. పాఠశాలలు, ఆస్పత్రులు, మార్కెట్లు, పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని సౌదీ వైమానిక దాడులను నిర్వహించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా, సౌదీ సంకీర్ణదళాలు యెమెన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఐరాస సహా పలు హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. 

గతేడాదియే క్లస్టర్‌ రాకెట్ల ప్రయోగం జరిగింది : ఆమ్నెస్టీ 
యెమెన్‌లో గతేడాది అక్టోబర్‌27న క్లస్టర్‌ మ్యూనీషన్‌ రాకెట్ల ప్రయోగం జరిగిందని ఆమ్నెస్టీ అంతర్జాతీయ సంస్థ పరిశోధకులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు పౌరులు మృతి చెందారని చెప్పారు. సాద నగరంలోని అహ్మా ప్రాంతంలో ఈ ప్రయోగం జరిగినట్టు రాకెట్‌ శకలాల ద్వారా నిర్ధారించామని అన్నారు. క్లస్టర్‌ మునీషన్‌ రాకెట్లను నిషేధించాలని ఐరాస గతంలో బ్రెజిల్‌ను కోరింది. అయినప్పటికీ, ఆ దేశం నుంచి సరైన స్పందన రాలేదు. యెమెన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు బ్రెజిల్‌ బాధ్యత వహించాలని మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ ఆయుధాల డైరెక్టర్‌ స్టీవ్‌ గూస్‌ కోరారు. ఇలాంటి ఆయుధాలను ప్రయోగిస్తే మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. 
'' యెమెన్‌లో చోటుచేసుకున్న వరుస పేలుళ్లతో భీతిల్లిపోయాం. క్షిపణుల ప్రయోగం జరిగినప్పుడు ఏర్పడే శబ్ధం కంటే రెట్టింపు శబ్ధం ఈనెల 6న సా నగరంలో మారుమ్రోగింది. '' 
- బాసమ్‌, స్థానికుడు 
'' ఈనెల 6న అల్‌-ధుబత్‌ సరిహద్దు ప్రాంతంలోని బాలికలు, బాలుర పాఠశాలల సమీపంలో అతి పెద్ద పేలుడు శబ్ధాన్ని విన్నాం. దీంతో, మేమంతా బయపడిపోయాం. ఏం జరిగిందో చాలా సేపటి వరకు అర్ధం కాలేదు. ఇంటి నుంచి బయటకు రాగానే భారీ పేలుడు కారణంగా ఓ ట్యాక్సీ దగ్ధమైనట్టు గమనించాం.'' 
- ఖాలెద్‌ రషీద్‌, ప్రత్యక్ష సాక్షి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com