46 కిలోల బంగారం దోపిడీ ..
- December 28, 2016
ఐదుగురు వ్యక్తులు టిప్ టాప్ గా ముత్తూట్ ఫైనాన్స్ కు వచ్చారు. సీబీఐ అధికారులం అని పరిచయం చేసుకున్నారు. అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదు వచ్చిందని హడావుడి చేశారు. లాకర్ తాళం తెరవాల్సిందిగా హుకూం జారీ చేశారు. పైఅధికారుల అనుమతి లేనిదే కుదరదని బ్యాంకు మేనేజర్ చెప్పాడు. గన్నులు ఎక్కుపెట్టి సిబ్బందిని బాత్ రూంలోకి తోశారు. కిలోల కొద్దీ బంగారాన్ని దర్జాగా దోచుకుని ఉడాయించారు. సినీ ఫక్కీలో చోరీకి పాల్పడిన వాళ్లు ఎవరు? ఇంతకీ వాళ్లు దోచుకెళ్లిన బంగారం ఎంత?
ఈ సీసీటీవీ ఫుటేజీ చూడండి. ఒక లేడీ వెళ్తోంది. ఆమె వెనకాలే మరో వ్యక్తి. ఆ వెంటనే మరో యువతి. ఆమె వెనకాలే ఇంకో వ్యక్తి. మొత్తం నలుగురు. దర్జాగా వెళ్తున్నారు. వీళ్ల వద్ద ఉన్న బ్యాగుల్లో ఏముందో తెలుసా! బంగారం. ఒకటి రెండు కిలోలు కాదు దాదాపు 46 కిలోల గోల్డ్ ను దోచుకుని వెళ్తున్నారు ఈ కిలాడీలు. ఈ గోల్డ్ విలువ 12 కోట్లు.
బుధవారం ఉదయం 8.30 గంటలకు చోరీ. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ చోరీ పక్కా ప్లాన్ తో సినీ ఫక్కీలో చోరీ 46 కిలోల బంగారం దోచుకున్నారు ఐదుగురు చోరులు. అయితే ఇదేమీ రాత్రపూట జరగలేదు. బుధవారం ఉదయం ఎనిమిదిన్నరకు. బ్యాంకు తెరిచిన కొద్ది సేపటికే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో జరిగిందీ భారీ చోరీ. బీరంగూడ కమాన్ దగ్గరున్న ముత్తూట్ ఫైనాన్స్‌ను టార్గెట్ చేసిన దొంగలు పక్కా ప్లాన్ తో చోరీకి దిగారు. సినీ ఫక్కీలో దోపిడీ చేసి ఉన్న బంగారాన్ని ఊడ్చుకుని పరారయ్యారు.
ఈ చోరీ జరిగిన తీరు షాక్ కు గురిచేస్తుంది. ఏపీ 28 ఎన్ 3107 నెంబరు ఉన్న స్కార్పియో వెహికిల్ లో ఐదుగురు వ్యక్తులు వచ్చారు. పోలీసు యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి బ్యాంకు వాచ్ మెన్ వద్దకు వచ్చాడు. సీబీఐ అధికారులు వస్తున్నారంటూ హడావుడి చేశాడు. కానీ లోపలికి వెళ్లడానికి వాచ్ మెన్ అనుమతించలేదు. ఈలోపు ముఖానికి ముసుగేసివున్న ఓ పొట్టి వ్యక్తిని తీసుకుని ముగ్గురు సీన్ లోకి ఎంటరయ్యారు. మీ బ్యాంకులో పాతనోట్ల మార్పిడి సందర్భంగా అక్రమాలు జరిగాయి తనిఖీ చేయాలంటూ హడావుడి చేశారు.
బ్యాంకులోకి ఎంటరైన ఐదుగురు వ్యక్తులు హిందీలో మాట్లాడుతూ బలవంతంగా బ్యాంకు లాకర్ తెరిపించారు. అందులో వున్న బంగారాన్ని బ్యాగుల్లో వేస్తుండగా బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చి నిలదీశారు. వెంటనే గన్నులు ఎక్కుపెట్టిన దొంగలు... బ్యాంకు సిబ్బందిని బాత్ రూంలోకి తోసి గడియపెట్టారు. దాదాపు 46 కిలోల బంగారం తీసుకుని ఉడాయించారు. ఈ తతంగమంతా 20 నిమిషాల్లోనే ముగిసింది. ఇక బ్యాంకులో తమ ఆనవాళ్లు దొరకకుండా సీసీటీవీ ఫుటేజీని కూడా ఎత్తుకెళ్లారు. షాక్ నుంచి తేరుకున్న బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ముత్తూట్ ఫైనాన్స్ బ్యాంకులో చోరీ జరిగిన విషయం క్షణాల్లో పాకడంతో ఆందోళన చెందిన కస్టమర్లంతా బ్యాంకు వద్దకు క్యూకట్టారు. బంగారాన్ని కుదవపెట్టి రుణం తీసుకున్న కస్టమర్లు తమ గోల్డ్ ఏమైందంటూ అధికారులను నిలదీశారు. తమ బంగారం తమకు తెచ్చివ్వాలని డిమాండ్ చేశారు.
బంగారం చోరీ అయిందని.... కానీ కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని బ్యాంకు యాజమాన్యం చెప్పింది. గోల్డ్ కు ఇన్సూరెన్స్ ఉందని, బంగారంగానీ, డబ్బుగానీ ఇస్తామని యాజమాన్యం భరోసా ఇచ్చింది.
ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ అంతర్రాష్ట్ర ముఠాల పనేనని పోలీసులు భావిస్తున్నారు. వీళ్లను పట్టుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు. జహీరాబాద్‌తో పాటు తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో, హైదరాబాద్-ముంబయి, బీదర్-జహీరాబాద్ రూట్ లో సోదాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







