నకిలీ వీసాలు, ఎయిర్ టికెట్లతో మోసాలు...
- February 16, 2017
హైదరాబాద్: నకిలీ వీసాలు, ఎయిర్టికెట్లతో మోసాలకు పాల్పడుతున్న చెన్నైవాసి కుమార్ అర్ముగమ్‌ను సీసీఎస్ సైబర్‌క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మోసాలే వృత్తిగా ఎంచుకున్న కుమార్ అర్ముగమ్ చెన్నైలోని ఈ- రోడ్డులో 'కోస్మోస్ టూర్స్ అండ్ ట్రావెల్స్' పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. హబ్సిగూడకు చెందిన విద్యార్థి జె.తులసీరామ్ కొన్ని నెలలక్రితం వదిన విదేశాలకు వెళ్లాలని వీసా కావాలంటూ ఇంటర్నెట్ ద్వారా సెర్చ్ చేసి కోస్మోస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అలియాస్ ఆల్ఫా టూర్స్‌ను సంప్రదించాడు. ఫోన్లో తులసీరామ్‌కు వివరాలు చెప్పిన ట్రావెల్స్ యజమాని కుమార్అర్ముగమ్ అరవై వేల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేయాలని, కావాల్సిన పత్రాలను కొరియర్ చేయాలని సూచించాడు.
తులసీరామ్ డబ్బు డిపాజిట్ చేసి కొరియర్ ద్వారా పత్రాలు పంపించాడు. మరుసటిరోజు సింగిల్‌గా వీసా రావడం కష్టమని గ్రూప్ వీసా సులువవుతుందని... ఇంకా కొంతమంది దరఖాస్తులు పంపిస్తే అందరికీ కలిపి గ్రూప్వీసా ఇప్పి స్తానని.. ఒక్కొక్కదానికి లక్షా ఇరవై ఐదువేలు ఖర్చవుతుందని అర్ముగమ్ నమ్మించాడు.
అతడి మాటలు నమ్మిన తులసీరామ్ నగరానికి చెందిన తన స్నేహితులకు చెందిన వీసా దరఖాస్తు పత్రాలను కొరియర్లో పంపి మొత్తం 10 లక్షల 65వేల నగదును అర్ముగమ్ సూచించిన యాక్సిస్ బ్యాంకు ఖాతాలో జమచేశాడు. వారం పదిరోజుల్లో వీసాలు, ఫారిన్ వెళ్లేందుకు విమాన టికెట్లు కూడా పంపిస్తానని చెప్పిన అర్ముగమ్ వీసాలను, విమాన టికెట్లను ఈ-మెయిల్, వాట్సప్ ద్వారా తులసీరామ్‌కు పంపించాడు. వాటిని ప్రింట్ తీసుకొని గతేడాది జూలైలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన తులసీరామ్ అతడి స్నేహితులు ఎయిర్‌పోర్టు అధికారులకు వాటిని చూపించారు. అవి నకిలీవని అధికారులు చెప్పడంతో మోసపోయామని గ్రహించిన వారు అర్ముగమ్‌ను సంప్రదించడానికి ప్రయత్నించారు.
అతడి ఫోన్ నెంబర్ అందుబాటులో లేకపోవడం, వెబ్సైట్లో కూడా స్పందించకపోవడంతో సీసీఎస్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ రఘువీర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్, ఎస్ఐ మధుసూదన్ బృందం దర్యాప్తు చేసి చెన్నైలోని ఈ -రోడ్డులో ఉన్న కార్యాలయంలో నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకువచ్చారు. గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కుమార్ అర్ముగమ్ చేతుల్లో మోసపోయినవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని, బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంలేదని ఏసీపీ రఘువీర్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







