కళాతపస్వి కె. విశ్వనాథ్ పుట్టిన రోజు నేడు
- February 17, 2017
అనుకోకుండా సినిమా రంగంలో ప్రవేశించిన ఆయన తామరాకు మీద నీటిబొట్టులానే గడిపేస్తూ.. తెలుగు సినిమాను సంగీత సాహిత్యాలతో సుసంపన్నం చేసిన అభిరుచి ఉన్న దర్శకుడాయన. తన అభిరుచి మేరకు పని చేసే అవకాశం ఉంటేనే చేశారు తప్ప రాజీపడలేదు. ఆయన పేరు కాశీనాథుని విశ్వనాథ్. తెలుగువారు కళాతపస్వి అని పిలుచుకున్న ఆ దిగ్దర్శకుడి పుట్టిన రోజు నేడు.
భారతీయ తెర మీద శాంతారామ్ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. భారతీయత ను చెప్పేందుకు మాత్రమే సినిమాలు తీశారు. విశ్వనాథ్ కూడా ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేశారు. నా సినిమాలు పదిమందిలో ముగ్గురికే నచ్చుతాయి. ఎప్పుడైనా ఆ సంఖ్య ఐదు అవుతుంది. అప్పుడు ఆ సినిమా హిట్ అని జనం అంటారు అని చాలా నిర్మొహమాటంగా చెప్పేసే విశ్వనాథ్ ను దర్శకుడుగా తెలుగువారికి పరిచయం చేసిన ఘనత మాత్రం దుక్కిపాటి వారికే దక్కుతుంది.
విశ్వనాథ్ పుట్టింది గుంటూరు జిల్లా పెదపులివర్రులో. సినీ సాహితీ సముద్రుడు సముద్రాల దీ ఆ ఊరే. విశ్వనాథ్ తండ్రి సుబ్రహ్మణ్యం విజయా వాహినీ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయంలో మేనేజర్ గా పనిచేసేవారు. డిగ్రీ చదివిని కొడును తీసుకెళ్లి వాహినీ స్టూడియోలో సౌండ్ విభాగంలో చేర్పించారు. పై చదువులకెళ్లాలనేది విశ్వనాథ్ ఆలోచన. అక్కడ నుంచి ఆదుర్తి దగ్గర శిష్యరికం చేశారు. ఆ తర్వాత ఆదుర్తి సొంత సినిమాకు దర్శకత్వమూ చేశారు.
విశ్వనాథ్ మొదటి నుంచి కాస్త అంతర్ముఖుడే. పెద్దగా కలిపించుకుని పనిచేసే మనిషి కాదు. తన మనసుకు అనిపించింది పద్దతిగా చేసుకెళ్లడమే తెలుసు. తను ఒక కథ అనుకుని...దాంతో నిర్మాత కన్విన్స్ అయితేనే సినిమా తీసేవారు లేకపోతే లేదు. అదే పద్దతి చివర వరకు కొనసాగించారు. జనం మెప్పుకోసం చవకబారు సినిమాలు తీయనక్కర్లేదని ఆయన నమ్మకం. దాన్ని నమ్మిన నిర్మాతలకే సినిమాలు తీశారు. అలాంటి వారిలో క్రాంతికుమార్ కూడా ఒకరు.
కథలు ఎంచుకోవడంలో కూడా ఆయనకో పద్దతి ఉంది. కె.రామలక్ష్మి రాసిన ఆడది అనే నవలను డీవిఎస్ రాజు కోసం జీవనజ్యోతిగా తీశారు విశ్వనాథ్. ఆ కథ ఎన్టీఆర్ తోనే చేద్దామనుకున్నారు. ఎన్టీఆర్ తాను చేయనని చెప్పడమే కాదు...శోభన్ బాబు అయితే బాగుంటుందని సలహా చెప్పారు. అలా శోభన్ తో ప్రారంభమైన అనుబంధం చాలా కాలం కొనసాగింది.
శోభన్ రికమండేషన్ తో మురారికి సినిమా చేయడానికి అంగీకరించారు విశ్వనాథ్. మల్లీశ్వరి కథనే ఇంకోలా తీయాలనుకున్నారు. అక్కడ హీరోయిన్ రాణివాసానికి వెళ్లితే...ఇక్కడ సీతామాలక్ష్మి సినిమాల్లోకి వెళ్లి తిరిగొస్తుంది. కథను విషాదంతం చేయాలని విశ్వనాథ్ ఆలోచన. నిర్మాత కుదరదని హ్యాపీ ఎండింగే ఇచ్చారు. అందులో మల్లీశ్వరి తరహాలోనే దేవులపల్లివారితోనే పాటలు రాయించుకున్నారు.
విశ్వనాథ్ లో స్వతహాగా కవి ఉన్నాడు. సంగీతకారుడూ ఉన్నాడు. అంతకన్నా ముందు మంచి చదువరి ఉన్నాడు. వేటూరి ప్రభాకరశాస్త్రి రాసిన ఓ కథ ప్రేరణతో విశ్వనాథ్ తీసిన చిత్రం శంకరాభరణం. ఎన్టీఆర్, ఎఎన్నార్ లు స్టెప్పులతో భారీ డైలాగులతో మాస్ ఆడియన్స్ హృదయాలను ఉర్రూతలూగిస్తున్న వేళ కొడవటిగంటి అన్నట్టు తెలుగుతెర మీద పడ్డ బాంబు శంకరాభరణం.
తను తీసే కథ సహజంగా ఉండాలనుకుంటారు విశ్వనాథ్. తనకు ఎదరైన అనుభవాలే ఉంటాయి. తాను తప్పని భావించిన అంశాలనే సర్వజనామోదంగా తీర్చిదిద్దాలనుకున్నారు.. తాను నమ్మిన ఆదర్శాలను చెప్పాలనుకున్నారు.. పైగా విశ్వనాథ్ ది దుక్కిపాటి వారి స్కూలు. తీసేది కమర్షియల్ సినిమానే అయినా...అందులోనూ మంచే చెప్పాలనుకునే మనిషాయన. 1981 సంవత్సరం తెలుగు తెర మీద ప్రేమ పెళ్లి అనే అంశం మీద ఓ చర్చ నడిచింది. భాగ్యరాజా కథతో బాపు తీసిన రాథాకళ్యాణంలో పెళ్లైన అమ్మాయి ఆ భర్తతోనే జీవితాన్ని కొనసాగించాలని తీర్మానిస్తారు. అదే సంవత్సరం విడుదలైన సప్తపదిలో విశ్వనాథ్ మనసులు కలవని చోట మాంగల్యానికి విలువ లేదని తేల్చేస్తారు. వేరే వ్యక్తిని మనసులో ఉంచుకుని శోభనం గదిలోకి వచ్చిన నవవధువు లో అమ్మవారిని చూస్తాడో పెళ్లికొడుకు. ఫైనల్ గా ప్రేమించిన వ్యక్తికే ఆ అమ్మాయిని అప్పగించేస్తారు. విశ్వనాథ్ సినిమాల్లో పాత్రలన్నీ చాలా ఆదర్శవంతంగానే ఉంటాయి. చిరంజీవిని స్క్రీన్ మీద ప్రజంట్ చేసే విషయంలోనూ విశ్వనాథ్, బాపుల మధ్య ఓ డిఫరెన్స్ కనిపిస్తుంది. బాపు మంత్రిగారి వియ్యంకుడులో ఫైట్స్ డాన్సులతో హడావిడి చేయిస్తే...విశ్వనాథ్ మాత్రం తనదైన పద్దతిలోనే శుభలేఖ రాయించారు. చార్లీ చాప్లిన్ సిటీలైట్స్, గురుదత్ కాగజ్ కా ఫూల్ చిత్రాల కలబోత విశ్వనాథుడి సాగరసంగమం. ఓ కళాకారుడి జీవన చిత్రం. ప్రతి సన్నివేశాన్నీ ఆఖరి నిమిషం వరకు ఇంప్రవైజ్ చేసుకుంటూ తీసిన చిత్రం అది. కమల్ హసన్, జంధ్యాల, వేటూరి సహకారంతో కళాతపస్వి తీర్చిన అజరామర దృశ్యకావ్యం సాగరసంగమం. కమల్ తో విశ్వనాథ్ తీసిన రెండో చిత్రం స్వాతిముత్యం. విశ్వనాథ్ సృష్టించిన పాత్రలు సున్నిత మనస్కులై ఉంటాయి. ప్రజ్ఞావంతులు అయి ఉంటాయి. తప్పనిసరిగా మన సంస్కృతిని గౌరవించేవై ఉంటాయి. అనుభవంతో నేర్చుకున్న జ్ఞాన సంపన్నులు గా కనిపిస్తారు. ఈ లక్షణాలన్నీ స్వాతిముత్యంలో కమల్ పాత్రలో పుష్కలంగా కనిపిస్తాయి.
శంకరాభరణం తర్వాత వచ్చిన విశ్వనాథ్ చిత్రాలన్నీ దాదాపు సంగీతానికి పెద్ద పీట వేస్తూ సాగేవే. సిరివెన్నెల చిత్రంలో సీతారామశాస్త్రి కలం చాలా తక్కువగానే స్వతంత్రిస్తుంది. పాత్రల స్వరూప స్వభావాలను వదలకుండా...దర్శకుడి ఆలోచనలను కూడా పట్టించుకుని రాసిన పాటలవి. ఆది భిక్షువు వాడినేది కోరేదీ...బూడిదిచ్చేవాడినేది అడిగేది.
శుభసంకల్పం చిత్రంతో నటుడుగానూ తన ప్రతిభను చాటారు విశ్వనాథ్. పాతికకు మించని సినిమాలతో తెలుగు వారి హృదయాల్లో అంతులేని గౌరవాభిమానాలకు పాత్రులయ్యారు విశ్వనాథ్. మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని...ఆకాంక్షిస్తూ.. కళా తపస్వి కె. విశ్వనాథ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో....
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









