తమిళ నిర్మాతల ఆగ్రహం విశాల్‌ విమర్శలపై

- March 06, 2017 , by Maagulf
తమిళ నిర్మాతల ఆగ్రహం విశాల్‌ విమర్శలపై

సినిమా తీయని వాళ్లంతా నిర్మాతల సంఘం నాయకులు కావాలని పేరాశపడుతున్నా రంటూ నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, యువ నటుడు విశాల్‌ చేసిన విమర్శలపై ఆ సంఘం నాయకులు మండిపడ్డారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా టినగర్‌లోని నడిగర్‌సంఘం కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన కారణంగా నడిగర్‌సంఘం ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న విశాల్‌ ఆదివారం ప్రచారసభలో ప్రసంగిస్తూ నిర్మాతల సంఘం పట్టించుకోకపోవడం వల్లే సినిమా నిర్మాతగా ఉండిన తన తండ్రి నిరుపేదగా భిక్షమెత్తుకునే స్థాయికి చేరారని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే తాను పోటీకి దిగానని చెప్పారు.
అదే సమయంలో సినిమాలు తీయని వారంతా నిర్మాతల సంఘం పదవికోసం పాకులాడటం భావ్యమేనా అని ప్రశ్నించారు. 
ఈ వ్యాఖ్యలపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినీ నిర్మాతలు రాధాకృష్ణన్, జేఎస్కే రితీష్‌కుమార్‌, టి. శివా, పీఎల్‌ తేనప్పన్, శివశక్తిపాండియన్, అళగన్ తమిళ్‌మణి, సురేశ కామాక్షి, కే రాజన్, మంగై హరిరాజన్ తదితరులు నడిగర్‌ సంఘం ఎదుట ధర్నా జరిపారు. ఆ తర్వాత కళైపులి ఎస్‌థాను నాయకత్వంలో పలువురు నిర్మాతలు నడిగర్‌సంఘం కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కళైపులి ఎస్‌థాను మీడియాతో మాట్లాడుతూ నటుడు విశాల్‌కు ఉన్నట్టుండి రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆశ కలిగినట్లుందని, కనుకనే ఆయన నడిగర్‌సంఘాన్ని, నిర్మాతల సంఘాన్ని తన ఆశను నెరవేర్చుకునేందుకు వాడుకోవాలని పథకం వేసుకున్నారని చెప్పారు. నాలుగువేల మంది సభ్యులున్న నడిగర్‌ సంఘం బాగోగులు విడిచిపెట్టి 1500 మంది సభ్యులున్న నిర్మాతల సంఘంపై కన్నేశాడని విమర్శించారు. అన్నింటికంటే ముందు విశాల్‌ను హీరోగా పెట్టి కదకళి, పట్టత్తుయానై, ఆంబళే, సమర్‌, కత్తసండై సినిమాలు తీసి ఆస్తిపాస్తులతోపాటు సర్వస్వం కోల్పోయిన నిర్మాతలను కాపాడాలని ఆయన సలహా ఇచ్చారు. విశాల్‌ వల్ల ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్లుసైతం నష్టపోయారని అన్నారు. నిర్మాతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన విశాలపై నడిగర్‌ సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com