ఇద్దరు మృతి నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు

- April 01, 2017 , by Maagulf
ఇద్దరు మృతి నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు

ఏప్రిల్‌ ఎంటరైంది. సూర్యుడు రెచ్చిపోతున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. దేశంలోని పది రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఈ ఏడాది వడగాల్పులు అత్యంత తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికలు నిజమవుతున్నాయి. మహారాష్ట్రలో వడదెబ్బకు ఇద్దరు చనిపోయారు. ఎక్కడ చూసినా నలబై డిగ్రీలపైనే టెంపరేచర్స్‌ రికార్డవుతున్నాయి. హర్యానా, యూపీ,ఎంపీ,రాజస్థాన్ చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిషా, గుజరాత్‌,మహారాష్ట్ర, తెలంగాణలో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. రాజస్థాన్‌ ఇప్పటికే నిప్పుల కొలిమిలా మారిపోయింది. 43 - 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయక్కడ. ముందు ముందు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. 
సూర్యప్రతాపం త్వరలో ఢిల్లీని తాకనుంది. ఇప్పటికే గరిష్టంగా  నలబై డిగ్రీలు టచ్‌ అయింది. సీజన్‌ సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఇది  ఆరు డిగ్రీలు ఎక్కువ. ఈ ఏప్రిల్‌లో పరిస్థితి మరింత  దారుణంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అప్పుడప్పుడు చినుకులు పడి కాస్త ఉపశమనం ఇచ్చినా అది తాత్కాలికమే అంటున్నారు. గుజారాత్‌లో అత్యధికంగా 43 డిగ్రీ సెల్పియస్‌. మధ్యప్రదేశ్లో 43, ఉత్తర్‌ప్రదేశ్‌లో 43 డిగ్రీలు తాకింది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. ఈ సమయంలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్రలోనూ ఎండలు మండిపోతున్నాయి. దీనికి వడగాల్పులు తోడవటంతో జనం విలవిల్లాడుతున్నారు. విదర్భ ప్రాంతంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నాగ్‌పూర్‌లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరింది. ఎండలు, వడగాల్పుల పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు.  
మరోవైపు, ఈ ఏడాది అప్పుడే  వేసవి మరణాలు మొదలయ్యాయి.  మహారాష్ట్రలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఔరంగాబాద్‌, షోలాపూర్‌లో ఈ ఘటనలు జరిగాయి.  ఉన్నట్టుండి ఎండలు ముదరటంతో జనం అల్లాడిపోతున్నారు. దాదాపు మహారాష్ట్ర అంతటా వడగాల్పులు అల్లాడిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. మళ్లీ గత ఏడాది పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద వడ దెబ్బ కేంద్రాలు తెరవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించింది. గత ఏడాది దేశవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల మంది వడగాల్పులకు బలయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచే ఎనిమిది వందల మంది చనిపోయారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రోజు కూలీలు..ఇతర కార్మికులు అప్రమత్తంగా ఉండాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తే మంచిది! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com