రైతు రుణమాఫీ పూర్తి: తెలంగాణ ప్రభుత్వం
- April 11, 2017
ఆఖరి విడత రూ. 4 వేల కోట్లు విడుదల చేసిన సర్కారు
ఖరీఫ్‌కు రెండు నెలల ముందే చెల్లింపు
మొత్తం రుణమాఫీ నిధులు రూ.16,374 కోట్లు
లబ్ధి పొందిన రైతులు 35.3 లక్షల మంది
తాజా నిధుల్లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల వాటా కూడా..
ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా నిధుల సమీకరణ
కొంత గందరగోళం మినహా పథకం సక్సెస్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతుల రుణమాఫీ దాదాపు పూర్తయింది. ఈ పథకానికి సంబంధించిన ఆఖరి విడత నిధులు రూ.4,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. మొత్తంగా 35.3 లక్షల మంది రైతులు రుణమాఫీ ద్వారా లబ్ధిపొందగా.. ప్రభుత్వం మొత్తంగా రూ.16,374 కోట్లను బ్యాంకులకు చెల్లించింది.
కొంత గందరగోళం మధ్య..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తంగా దాదాపు రూ.17 వేల కోట్లను నాలుగేళ్ల వ్యవధిలో నాలుగు విడతలుగా మిబ్యాంకులకు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. తొలి ఏడాది రూ.4,250 కోట్లు ఒకేసారి విడుదల చేసింది. పెద్ద మొత్తం కావటం, నిధుల సమీకరణ ఇబ్బందుల దృష్ట్యా రెండో ఏడాది, మూడో ఏడాదిలో నిధులను రెండు భాగాలుగా చెల్లించింది. దీంతో ఈ పథకం అమల్లో కొంత గందరగోళం తలెత్తింది. బ్యాంకులకు నిధులు చేరడం ఆలస్యమైంది. కొన్ని జిల్లాల్లో బ్యాంకర్లు రైతుల నుంచి బలవంతంగా వడ్డీ వసూలు చేశారు కూడా. వీటన్నింటి నేపథ్యంలో విపక్షాలు సైతం రుణమాఫీ అంశంపై విరుచుకుపడ్డాయి.
ఇటీవల కాగ్ తమ నివేదికలో రుణమాఫీ పథకం అమలు తీరును ప్రధానంగా ప్రస్తావించింది కూడా. అయితే తొలి ఏడాది తరహాలోనే చివరి ఏడాది నిధులను ఒకేసారి చెల్లిస్తామని ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు ఆఖరి విడత నిధులను ఖరీఫ్ ప్రారంభానికి రెండు నెలల ముందే విడుదల చేశారు.
రూ.16,374 కోట్లు మాఫీ
మొత్తంగా సుమారు 36 లక్షల మంది రైతులకు చెందిన రూ.17 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఈ పథకం అమల్లో భాగంగా రెండో ఏడాది చెల్లింపుల సమయంలో పలువురు బోగస్ రైతులు, రెండేసి ఖాతాలున్న రైతులను లబ్ధిదారుల నుంచి తొలగించారు. దాంతో రుణమాఫీ మొత్తం రూ.16,374 కోట్లుగా ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. అందులో గతేడాది వరకు చెల్లించిన రూ.12,374 కోట్లుపోగా.. మిగతా రూ.4,000 కోట్లను తాజాగా విడుదల చేశారు. మొత్తంగా 35.3 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ అయ్యాయని వ్యవసాయశాఖ పేర్కొంది. బ్యాంకుల బ్రాంచీల వారీగా లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







