తలాక్ చెప్పిన టెకీ వాట్సప్‌లో

- April 18, 2017 , by Maagulf
తలాక్ చెప్పిన టెకీ వాట్సప్‌లో

హైదరాబాద్‌లో మరో తలాక్‌ విడాకుల ఘటన వెలుగుచూసింది. నగరానికి చెందిన బాదర్‌ ఇబ్రహీమ్‌ ఎంబీఏ చదువుతోంది. టోలిచౌకికి చెందిన ముదస్సిర్‌ అహ్మద్‌ ఖాన్‌తో 2016 ఫిబ్రవరి 7న వివాహం జరిగింది. మహమ్మద్‌ సౌదీలో సౌది ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులో సాఫ్ట్‌వేర్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇరవైరోజులు కాపురం చేసిన అనంతరం ఉద్యోగరీత్యా సౌదీకి వెల్లిపోయాడు. తరువాత ఆరు నెలల వరకూ తరచూ భార్య, అత్తామామలతో ఫోన్లో మాట్లాడేవాడు.
కానీ ఆశ్చకరంగా గత సెప్టెంబర్‌ నెలలో ట్రిపుల్‌ తలాక్‌ అంటూ వాట్సప్‌లో భార్యకు మెస్సేజ్‌ చేశాడు. దీంతో విస్తుపోయిన ఇబ్రహీమ్‌ అత్తామామల ఇంటికి వెళ్లగా, వారు ఇంట్లోకి రాకుండా ఆమెను అడ్డుకున్నారు. పెళ్లి ఏదో ఆకస్మికంగా జరిగిపోయిందని, తనకు మంచి భర్త దొరకాలని కోరుకుంటున్నట్లు చెప్పారని ఇబ్రహీమ్‌ ఆరోపించింది. ఎందుకు తలాక్‌ చెప్పారో కారణం అడిగినా సమాధానంలేదని వాపోయింది. ఇదే విషయం తన తల్లిదండ్రులకు చెప్పమని వేడుకున్నా కనికరించలేదని ఆవేదన చెందింది.
కొద్ది రోజులకు కజాత్‌ ఆఫీస్‌ నుంచి తలాక్‌నామాతో పాటు లాయరు నోటీస్‌ వచ్చిందని తెలిపింది. తన భర్త, అత్తింటివారిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ ఏ ఒక్కరిని అరెస్టు చేయలేదు. ట్రిపుల్ తలాక్‌ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా భారత ప్రభుత్వం కఠన చట్టాలు తీసుకురావాలని ఇబ్రహీమ్‌ డిమాండ్‌ చేసింది. ఇలాంటి వారిని జైల్లో పెట్టాలని, బెయిల్‌పై బయటకు రాకుండా చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.

   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com