అమెరికా లో హెచ్‌-1బీ వీసాలపై కఠిన వైఖరి తగదు

- April 23, 2017 , by Maagulf
అమెరికా లో  హెచ్‌-1బీ వీసాలపై కఠిన వైఖరి తగదు

అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాల మంజూరును కఠినతరం చేయడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆ దేశం దృష్టికి తీసుకెళ్లారు. ఆ దేశ ఆర్థిక మంత్రి స్టీవెన్‌ మ్నూచిన్‌తో తొలిసారిగా సమావేశమైన సందర్భంగా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అంతకుముందు వాణిజ్యశాఖ మంత్రి విల్‌బర్‌ రాస్‌తోనూ చర్చించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌), ప్రపంచబ్యాంకుల వసంతకాల సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్లిన జైట్లీ వివిధ ద్వైపాక్షిక అంశాలతోపాటు దీనిపైనా దృష్టిసారించారు. శనివారం మ్నూచిన్‌తో జరిగిన సమావేశంలో ఇండో-యూఎస్‌ పెట్టుబడుల చొరవ, జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల నిధి (ఎన్‌ఐఎఫ్‌ఎఫ్‌), ఆకర్షణీయ నగరాల అభివృద్ధి తదితర విషయాలపై చర్చించారు. అమెరికా ఆర్థిక రంగ ప్రగతికి భారత నిపుణులు ఎంతగానే కృషి చేస్తున్నారని, వీసాల మంజూరులో ఉదారంగా ఉండాలని కోరారు. ఆయన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌, స్వీడన్‌, ఫ్రాన్స్‌, బంగ్లాదేశ్‌ ఆర్థిక మంత్రులతోనూ చర్చలు జరిపారు.
రుణాల కోటా సంస్కరణల్లో జాప్యం ఎందుకు? 
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సమావేశాల్లో జైట్లీ మాట్లాడుతూ రుణాల కోటా విషయమై సంస్కరణలు చేపట్టడంలో జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్కరణలు చేపడితే వెనుకబడిన దేశాలకు మేలు కలుగుతుందని అన్నారు. పలు దేశాలు రక్షణాత్మక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతు పలకాలని కోరారు. ప్రపంచ బ్యాంకు మూల ధానాన్ని 50 శాతం మేర పెంచాల్సి ఉందని చెప్పారు.
జీఎస్టీతో మరింత వేగంగా ప్రగతి 
వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని జైట్లీ తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీఎస్టీ కారణంగా పన్నుల మదింపు సులభతరమవుతుందని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆంక్షలు సడలించడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com