దసరాకు ప్రత్యేక బస్సులు వచ్చేస్తున్నాయి

- October 04, 2015 , by Maagulf
దసరాకు ప్రత్యేక బస్సులు వచ్చేస్తున్నాయి

దసరా ప్రత్యేక బస్సులు వచ్చేస్తున్నాయి. కొత్తగా వచ్చేదేమీ లేదు. ఈఏడాది దసరా సీజన్‌లోనూ పాత బస్సులే నడుస్తాయి. సిటీల్లో కొన్నింటినీ, పల్లెవెలుగులు, సాధారణ ఎక్స్‌ప్రెస్‌ల్లో మరికొన్నింటిని తొలగించి వీటినే దసరా ప్రత్యేక సర్వీసులుగా నిర్వహించాలని ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా విశాఖ-విజయవాడ మధ్య భవానీ భక్తుల కోసం దాదాపు వంద ప్రత్యేక బస్సులు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది దసరా సెలవుల్లో నడిచే బస్సుల కంటే భవానీ భక్తులే అధిక సంఖ్యలో జిల్లా నుంచి తరలివెళ్ళారు. దీంతో ఈసారి భవానీ భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించారు. సోమవారం ఉదయం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధీశ్‌కుమార్ అధ్యక్షతన జిల్లాలో పది డిపోల అధికారులు, డివిఎంలతో సమీక్ష జరగనుంది. దసరా సెలవుల్లోనూ, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళే భక్తుల కోసం కనీసం వంద బస్సులను అందుబాటులోకి తేవడంపై చర్చిస్తారు. ముందుగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం, బృందాలుగా వచ్చే భవానీ భక్తుల కోసం కొన్నిబస్సులు కేటాయించనున్నారు. దసరా సెలవులు మొదలయ్యే సరికి ముఖ్యంగా విశాఖ నుంచి విజయనగరం, పార్వతీపురం, సాలూరు, శ్రీకాకుళం, పలాస, పాలకొండ, రాజాం, నరసన్నపేట దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అలాగే విశాఖ నుంచి అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, తిరుపతి, ఖమ్మం, కర్నూలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. ఈనెల 22వతేదీన దసరా పండుగ కావడంతో ఇది ముగిసిన తరువాత రెండు రోజులపాటు బస్సులు నిర్వహించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com