రాధ మూవీ రివ్యూ

- May 12, 2017 , by Maagulf
రాధ మూవీ రివ్యూ

టాలీవుడ్‌లో విలక్షణమైన నటన ప్రదర్శించే హీరోలలో శర్వానంద్ ఒకరు. అందుకు ఆయన నటించిన ప్రస్థానం, తాజాగా శతమానం భవతి చిత్రాలు ఉదాహరణ. శతమానం భవతి లాంటి ఉత్తమ చిత్రాల్లో నటించిన శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం రాధ. ఈ చిత్రంలో తన లవర్ బాయ్‌ ఇమేజ్‌కు భిన్నంగా మాస్ క్యారెక్టర్‌ పోలీస్ పాత్రలో కనిపించారు. చంద్రమోహన్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి శర్వానంద్ చేసిన ప్రయత్నం ఫలించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకొందాం.

పోలీస్ ఉద్యోగం అంటే.. .
రాధాకృష్ణ అలియాస్ రాధ (శర్వానంద్) కు పోలీస్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. ఒక సందర్భంలో క్రిమినల్స్ పట్టుకోవడాన్ని డీజీపీ చూసి ఏకంగా రాధకు ఎస్ఐ ఉద్యోగం ఇస్తాడు. ట్రైనింగ్ పూర్తి చేసుకొన్న తర్వాత వరంగల్ జిల్లాలో పోస్టింగ్ ఇస్తాడు. ఇక ఊరి పరిస్థితి ఏంటంటే అసలే కేసులు ఉండవు. పనిపాటా లేని రాధాకృష్ణ ఆ ఊర్లో రాధ (లావణ్య)ను తొలిచూపులోనే చూసి ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ కోసం వెంటపడి ప్రసన్నం చేసుకొంటాడు. ఈ క్రమంలో రాధాకృష్ణకు హైదరాబాద్‌లోని దూల్‌పేటకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

రాజకీయాలు, ప్రేమ..
ఈ క్రమంలో హైదరాబాద్‌లో రాష్ట్ర రాజకీయాలు చాలా రంజుగా ఉంటాయి. సీఎం (కోటా శ్రీనివాసరావు) పదవి నుంచి రిటైర్మ్‌మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. తదుపరి ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని నిర్ణయించే బాధ్యత కోటకు అప్పగిస్తారు. సీఎం పదవికి ఎమ్మెల్యే సుజాత (రవికిషన్), మరో సినియర్ నేత అయిన (ఆశీష్ విద్యార్థి) మధ్య పోటీ ఉంటుంది. సీఎం పదవి ఎలాగైనా దక్కించకోవాలన్న ఆశతో సుజాత తనపైనే బ్లాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ చేసుకొంటాడు. ఆ బ్లాస్టింగ్‌లో పోలీసులు రెహ్మాన్ (బ్రహ్మాజీ), అర్జున్ (షకలక శంకర్) ప్రాణాలు కోల్పోతారు. అయితే ప్రాణాలు కోల్పోయిన పోలీసులపై ఓ ఆరోపణ మోపుతారు. దాంతో ఆగ్రహించిన రాధా.. సుజాతపై కక్ష తీసుకోవాలని నిర్ణయించుకొంటాడు. మంత్రి సుజాతపై రాధ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు. అందుకు రాధ చేసిన ప్లాన్లేంటి? తన ప్రేయసి రాధను ఎలా పెళ్లిపీటల మీదకు తీసుకెళ్లాడు అనే ప్రశ్నలకు సమాధానమే రాధ సినిమా.

కథ, కథనంపై పట్టు..
తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చంద్రమోహన్.. గుర్తింపుకు నోచుకొని పోలీసు శాఖ సేవలను కథాంశంగా ఎంచుకోవడం మంచి పనే. కానీ అందుకు తగిన కసరత్తు చేయడంలో విఫలమయ్యారనే విషయం సినిమా ప్రారంభించిన పావుగంటకే అర్థమవుతుంది. శర్వానంద్ క్యారెక్టరైజేషన్, ఇతర పాత్రల తీరుతెన్నులు చాలా పేలవంగా ఉంటాయి. కథలో అటు సీరియస్ నెస్ ఉండదు. అలాగా అని కామెడీ ఉండదు. ఈ రెండు అంశాల మధ్య సినిమా నలిగిపోయిందనే చెప్పవచ్చు. శర్వానంద్, లావణ్య త్రిపాఠిల మధ్య ప్రేమకథలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ పండకపోవడం మరో మైనస్. రవికిషన్ పాత్ర బాగా ఉన్న ఆయన చుట్టు ఉండే ఎన్విరాన్‌మెంట్ చాలా పేలవంగా ఉండటంతో మరింత నాసిరకంగా కనిపిస్తుంది.

క్లైమాక్స్‌కు చేరిందిలా..
సెకండాఫ్‌లో మంత్రి సుజాతను ఎదుర్కొనేందుకు శర్వానంద్ రాధ ప్లాన్లు అంతగా ఆకట్టుకోలేకపోవడం వల్ల సినిమా ఎదో సాదాసీదాగా నడుస్తున్నదనే భావన కలుగుతుంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎదైనా ఆసక్తిగా ఉంటుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. శతమానం భవతి లాంటి సినిమా తర్వాత శర్వానంద్‌ రాధ లాంటి సినిమా చేయడం సరికాదనే ఫీలింగ్ కలుగడం ఖాయం. ఇక సంగీతం, పాటలు ఆడియోలో అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కనీసం తెరమీదనైనా ఆసక్తిగా ఉన్నాయా అంటే అదీ కనిపించదు. వెరసి రాధ చిత్రం ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని అతి సాధారణ సినిమాగా కనిపిస్తుంది.
బలం, బలహీనతలు
ప్లస్ పాయింట్స్
శర్వానంద్, రవి కిషన్ యాక్టింగ్
ఫొటోగ్రఫీ
మైనస్ పాయింట్స్.
కథ, కథనం
డైలాగ్స్
డైరెక్షన్
మ్యూజిక్

తెరముందు.. తెర వెనుక
సినిమా: రాధ 
సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర 
నటీనటులు: శర్వానంద్‌.. లావణ్య త్రిపాఠి.. అక్ష.. జయ ప్రకాష్‌రెడ్డి.. తనికెళ్ల భరణి.. కోట శ్రీనివాసరావు.. బ్రహ్మాజీ.. షకలక శంకర్‌.. అలీ.. సప్తగిరి.. రవికిషన్‌ తదితరులు. 
దర్శకత్వం: చంద్రమోహన్‌ 
నిర్మాత: భోగవల్లి బాపినీడు 
సమర్పణ: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ 
మ్యూజిక్: రధన్‌ 
సినిమాటోగ్రఫి: కార్తీక్‌ ఘట్టమనేని 
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

మాస్ పాత్రలో శర్వానంద్..
శర్వానంద్‌ నటన పరంగా, కామెడీ పరంగా పర్వాలేదనిపించాడు. కథ, కథనంలో దమ్ము లేకపోవడంతో శర్వానంద్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఏమాత్రం స్కోప్ లేకపోయింది. రవి కిషన్‌తో శర్వానంద్ పోటాపోటీగా నటించాడు. మాస్ పాత్రలకు కూడా సిద్ధమే అని శర్వానంద్ మరోసారి ప్రూవ్ చేసుకొన్నాడు. సరదా పోలీసు పాత్రను చాలా సులభంగా పోషించి మెప్పించాడు.

గ్లామర్‌కే పరిమితమైన లావణ్య..
రాధ పాత్రలో లావణ్య త్రిపాఠి తన అంద చందాలతో ఆకట్టుకొన్నది. పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించింది. పాత్ర గ్లామర్ సీన్లకే పరిమితం కావడం వల్ల నటించడానికి అవకాశం దక్కలేదు. పాటలు, కొన్ని సీన్లకే పరిమితమైంది. రుక్మిణిగా కనిపించిన అక్ష పాత్ర చిన్నది కావడంతో అంతగా ఆకట్టుకొలేకపోయింది.

రవి కిషన్ తనదైన శైలిలో..
హీరో, హీరోయిన్ల పాత్రల తర్వాత ప్రముఖంగా కనిపించేంది మంత్రి సుజాత పాత్ర. ఇలాంటి పాత్రలు రవికిషన్‌కు చేయడం కొట్టినపిండే. కామెడీతోపాటు, సీరియస్ లుక్స్‌ ఉన్న ఆ పాత్రను బాగా పండించడంలో సఫలమయ్యాడు. ఆయన వేషధారణ, బాడీలాంగ్వేజ్ బాగున్నది. కీలక సన్నివేశాలలో తనదైన శైలిలో నటించాడు. ఇక ఆశీష్ విద్యార్థి, కోటా శ్రీనివాస్‌రావు పాత్రలు కీలకమైనవే అయినప్పటికీ.. అంతగా ప్రాధాన్యం లేదు. పాత్రలో అంత పస లేకపోయినప్పటికీ.. తన మార్కుతో ఫుల్ మార్కులు రవికిషన్ కొటేశాడు.

ఒకే అనిపించిన కామెడీ విభాగం
కామెడీ విభాగంలో పోలీస్ ఆఫీసర్‌గా జయప్రకాశ్, సప్తగిరి, షకలక శంకర్ తమ మార్కును ప్రదర్శించారు. నాన్నకు ప్రేమతో పేరడితో సప్తగిరి చేసిన ప్రయత్నం పర్వాలేదనిపించింది. కానిస్టేబుల్ అర్జున్‌గా షకలక శంకర్ తన పాత్ర మేరకు నటించి మెప్పించాడు.

సాంకేతిక విభాగం పనితీరు..
కార్తీక్ ఘటమనేని సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ సినిమాకు అదనపు ఆకర్షణ. రధన్ అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఫ్లాట్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది.
10 
కథ, కథనం.. తడబాటు..
దర్శకుడు చంద్రమోహన్ ఎంచుకొన్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ దానిని ఓ అద్భుతమైన కథగా మలచడంలో తడబాటుకు గురయ్యాడనే స్పష్టంగా కనిపిస్తుంది. సన్నివేశాలు ప్రేక్షకుడు ఊహించి, ఏం జరుగుతుందో అని అంచనా వేసే విధంగా ఉంటాయి. తాను అనుకొన్న పాయింట్‌కు మంచి స్క్రీన్‌ప్లే రూపొందించలేకపోవడం మరో మైనస్. కొన్ని పాత్రలను అర్థాంతరంగా వదిలివేయడం కథపై ఆయనకు ఉన్న పట్టు స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రమోహన్ ప్రయత్నం బాగానే ఉన్న ఆచరణ లోపం కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com