తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాలు 33 అభివృద్ధి చేయబోతున్నారు
- May 18, 2017
భా రత పౌరవిమానయాన రంగం మంచి దారిలో నడుస్తోందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడించారు. ఉడాన్ పథకంలో సెప్టెంబరుకల్లా 33 కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కేంద్ర పౌరవిమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లవుతున్న సందర్భంగా ఆయన ‘ఈనాడు-ఈటీవీ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న: మీరు కొత్తగా తీసుకొచ్చిన పౌరవిమానయాన విధానం ఎలా పనిచేస్తోంది? .
జవాబు: 22 నెలల్లో 21 శాతానికి మించి వృద్ధి నమోదైంది. ఇది దేశ ఆర్థికవృద్ధికి దోహదం చేస్తోంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే కచ్చితత్వం, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి. భవిష్యత్తులో రద్దీని తట్టుకోడానికి ఏఏఐ రూ. 15,000 కోట్లతో విమానాశ్రయాలను అభివృద్ధి చేయబోతోంది. ఈ నిధులు సరిపోవు కాబట్టి ప్రైవేటు పెట్టుబడిదారులనూ ఆహ్వానిస్తున్నాం.
రైల్వేలా సరకు రవాణా కోసం ప్రత్యేక విధానమేదైనా తీసుకురాబోతున్నారా?
అవును. సరకురవాణా పెంచితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వూతం లభిస్తుంది. కేవలం ప్రయాణికుల రాకపోకలతో ఆర్థికాభివృద్ధి సాధ్యంకాదు. దేశంలో మంచి మార్కెట్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వారికి రవాణా సమస్యలు లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విభిన్నరకాల రవాణా రంగాలను ఏకీకృతం చేసి ఒకరికొకరు చేయూతనందించుకొనే విధానం తీసుకురావాలని కసరత్తు ప్రారంభించాం.
ఉడాన్‌లో చెప్పినట్లుగా రూ. 2,500కి టికెట్లు దొరకడంలేదని ప్రయాణికులు అంటున్నారు!
ప్రతి ఉడాన్ విమానంలో 50 శాతం సీట్లు రూ. 2,500కి విక్రయించాలి. దిల్లీ నుంచి సిమ్లాకు నడిచే విమానంలో 24, అటు నుంచి ఇటు వచ్చే వాటిలో 15 సీట్లు ఇందుకు రిజర్వ్ చేశాం. ప్రస్తుతం హైదరాబాద్-కడప మధ్య నడుస్తున్న 72 సీట్ల ఉడాన్ విమానంలో 85 శాతం సీట్లు భర్తీ అవుతున్నాయి. ఇందులో 30 సీట్లు రూ. 2,500కే విక్రయించేలా షరతుపెట్టాం. అందుకు విరుద్ధంగా ఎవరైనా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.
పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తట్టుకొనేలా మన విమానాశ్రయాలు ఉన్నాయా?
కొన్ని చాలా ఇరుగ్గా ఉంటున్నాయి. ఇలాంటి విషయాల్లో మౌలికవసతులు పెంచుకోవాలి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భూమి ఇవ్వకుండా విమానాశ్రయాలు అభివృద్ధి చేయాలంటున్నాయి. అది సాధ్యంకాదు.
అంతర్జాతీయ, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల కోసం వేల ఎకరాలు సేకరిస్తున్నారు ఎందుకని?
ఆధునిక విమానాశ్రయాలు కావాలంటే రన్‌వే పొడవు దాదాపు 4 కిలోమీటర్లు ఉండాలి. సమాంతర రన్వేలు తప్పనిసరి. ఆ రన్‌వేల మధ్య దూరం కనీసం 1.5 కిలోమీటర్లు ఉండాలి. అంతకంటే తగ్గితే భద్రతా విషయాల్లో రాజీపడాల్సి వస్తుంది. ఆధునిక సౌకర్యాలు లేకపోతే పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందడం సాధ్యంకాదు. ముంబయి విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నా స్థలం లేకపోవడంవల్ల విమానాలు దిగేందుకు స్లాట్స్ దొరకడంలేదు. దానివల్ల అక్కడ పూర్తిస్థాయి ప్రయోజనాలు అందడంలేదు.
ప్రయాణికులపై వినియోగ రుసుములు వేయొద్దని పార్లమెంటు స్థాయీ సంఘం చెప్పింది కదా? దీనికి సంబంధించి చర్యలు ఎలా ఉన్నాయి?
పార్లమెంటు ఆమోదించిన చట్టం ద్వారానే వినియోగ రుసుములు వసూలుచేస్తున్నారు. యూజర్ ఛార్జీలు లేకుండా పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకురారు. ఎవరూ దాతృత్వంతో పనిచేయరు. ప్రైవేటు విమానాశ్రయాలన్నీ యూజర్ ఛార్జీలను తొలుత రెగ్యులేటర్ దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతి తీసుకున్న తర్వాతే వసూలుచేయాలన్న నిబంధన ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని విమానాశ్రయాలను అభివృద్ధి చేయబోతున్నారు?
కడప ఈమధ్యే కార్యకలాపాలు ప్రారంభించింది. విజయవాడలో రూ. 162 కోట్లతో తాత్కాలిక టెర్మినల్ కట్టాం. రన్‌వే విస్తరణ తర్వాత అంతర్జాతీయ సేవలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ఎయిర్‌ఫ్రైట్ స్టేషన్ ఏర్పాటుచేయాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. 100 ఎకరాలు తీసుకొని దాన్ని ఏర్పాటుచేస్తే బాగుంటుందన్నారు. దానివల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి మూడునాలుగేళ్ల సమయం పడుతుంది. శంషాబాద్‌కు తొమ్మిదేళ్లుపట్టింది. ఆ అనుభవంతో ఇప్పుడు సగం సమయంలోనే భోగాపురం పూర్తిచేయొచ్చు.
తిరుపతిలో అంతర్జాతీయ సేవలు ఇంకా మొదలుకాలేదెందుకు?
కొత్త టెర్మినల్ వచ్చాక తిరుపతిలో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. తదుపరి దశలో హాపింగ్ ఫ్లైట్స్ వస్తాయి. గతంలో బేగంపేటలోనూ తొలుత హాపింగ్ ఫ్లైట్స్ వచ్చాయి. తర్వాత నేరుగా అంతర్జాతీయ సర్వీసులు మొదలయ్యాయి. ఇప్పటికే రెండు ఎయిర్‌లైన్స్ తిరుపతి నుంచి హాపింగ్ ఫ్లైట్స్ నడపడానికి ఆసక్తి చూపాయి. హోంశాఖ ఇమ్మిగ్రేషన్‌కు అనుమతి ఇస్తే ఆ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయి.
వచ్చే రెండేళ్లలో మీ లక్ష్యాలేంటి?
సరకు రవాణాను గరిష్ఠస్థాయికి పెంచాలన్నది లక్ష్యం. ప్రస్తుతం ఈ రంగంలో వృద్ధి ఉన్నా చాలా తక్కువస్థాయిలో ఉంది. దాని పరిధి విస్తరించడంపై దృష్టిపెట్టాం.
వైమానిక రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించారు కదా? ఫలితాలెలా ఉన్నాయి?
ఇంతవరకూ దరఖాస్తులేమీ రాలేదు. ఎఫ్‌డీఐలను సరళీకృతం చేసినట్లుగానే ఇంకా యాజమాన్యానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు తీసుకురావాలి. అప్పుడే ఫలితాలు వస్తాయి.
విమాన ఛార్జీలు ఇప్పటికీ అందుబాటులో లేవన్న భావన ప్రయాణికుల్లో ఉంది కదా?
ఏడాది కాలం టికెట్ఛార్జీలను విశ్లేషించాం. 1.7 శాతం టికెట్లు మాత్రమే ఎక్కువ ధరలకు అమ్మినట్లు తేలింది. మిగిలిన ఛార్జీలు మార్కెట్ డిమాండ్ ప్రకారం ఉంటున్నాయి. ఇదివరకు విశాఖ-ధిల్లీ మధ్య ఛార్జీ రూ. 11,000 ఉంటే ఇప్పుడు రూ. 5,000 వస్తోంది. విమానాశ్రయాల్లో అదనపు సామర్థ్యాన్ని పెంచి పోటీని పెంచినప్పుడే ఛార్జీలు తగ్గుతాయి.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







