కిస్తాన్‌లో మరణశిక్షకు గురైన భారత్‌ నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్‌జాదవ్‌

- May 19, 2017 , by Maagulf
కిస్తాన్‌లో మరణశిక్షకు గురైన భారత్‌ నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్‌జాదవ్‌

 అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్‌కు చుక్కెదురు 
                ది హేగ్‌: పాకిస్తాన్‌లో మరణశిక్షకు గురైన భారత్‌ నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్‌జాదవ్‌ ఉరిపై ఇక్కడి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) స్టే విధించింది. ఈ అంశంపై తాము తుది నిర్ణయం తీసుకునే వరకూ జాదవ్‌ను ఉరితీయవద్దని ఐసిజె పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరణశిక్షార్హమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న విదేశీయులకు దౌత్యపరమైన మినహాయింపులు ఇస్తున్న అంతర్జాతీయ ఒప్పందాన్ని పాక్‌ ఖాతరు చేయటం లేదని భారత్‌ ఐసిజెకు అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే. తాము తుదినిర్ణయం తీసుకునే వరకూ జాదవ్‌ను ఉరితీయకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఐసిజె అధ్యక్ష స్థానంలో వున్న న్యాయమూర్తి రోనీ అబ్రహాం తన ఆదేశాలలో పాక్‌ ప్రభుత్వానికి సూచించారు. గూఢచర్యం, దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలపై గత ఏడాది మార్చి 3న పాక్‌లో అరెస్టయిన జాదవ్‌కు పాకిస్తాన్‌ సైనిక న్యాయస్థానం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. జాదవ్‌తో మాట్లాడేందుకు తమకు దౌత్యపరమైన అనుమతినివ్వాలని కోరుతూ భారత్‌ ఈ నెల 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దౌత్య సంబంధాల విషయంలో వియన్నా ఒప్పందాన్ని పాక్‌ బేఖాతరు చేస్తోందని భారత్‌ తన పిటిషన్‌లో పేర్కొంది. జాదవ్‌ కేసు తమ విచారణ పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసిన ఐసిజె న్యాయమూర్తి అబ్రహాం, జాదవ్‌ అరెస్ట్‌కు దారితీసిన పరిస్థితులు ఇప్పటికీ వివాదాస్పదంగానే వున్నాయని తన తీర్పులో వివరించారు. జాదవ్‌కు పాకిస్తాన్‌ మంజూరు చేసిన 150 రోజుల క్షమాభిక్ష గడువు ఆగస్టుతో ముగుస్తుందని, ఆ తరువాత అవసరమైతే మరణశిక్షను అమలు చేయవచ్చని ఐసిజె సూచించింది. వియన్నా ఒప్పందం ప్రకారం జాదవ్‌తో సంప్రదింపుల కోసం పాకిస్తాన్‌ భారత్‌కు దౌత్యపరమైన అనుమతిని ఇచ్చి వుండాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. జాదవ్‌ కేసులో భారత్‌-పాక్‌ తమ వాదనలు వినిపించిన రెండు రోజుల తరువాత ఐసిజె ఈ తీర్పు వెలువరించటం గమనార్హం. ఐసిజె నిర్ణయాన్ని పాకిస్తాన్‌ బేఖాతరు చేసిన పక్షంలో భారత్‌ ఐరాస భద్రతా మండలిని ఆశ్రయించే అవకాశం వుందని పరిశీలకులు చెబుతున్నారు. 
ప్రధాని సంతృప్తి 
జాదవ్‌ కేసులో ఐసిజె తీర్పుపై ప్రధాని నరేంద్రమోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో తీవ్రంగా కృషి చేసి భారత్‌ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది హరిష్‌ సాల్వేకు కృతజ్ఞతలు తెలియచేయాలని ఆయన విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు సూచించారు. ఐసిజె నిర్ణయం జాదవ్‌ కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చిందని, భారత్‌ వాదనను సమర్ధవంతంగా వినిపించిన హరిష్‌ సాల్వేకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియచేశామని సుష్మా ఆయనకు వివరించారు. ఈ కేసులో తీవ్రంగా శ్రమించిన విదేశాంగశాఖ అధికారుల బృందానికి అభినందనలు తెలియచేస్తున్నట్లు ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత్‌ అనుసరిస్తున్న వైఖరికి లభించిన విజయం ఇదని ఈ తీర్పుపై అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్‌గీ వ్యాఖ్యానించారు. ఈ కేసులో తుది తీర్పు కూడా భారత్‌కు అనుకూలంగానే వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కాగా ఈ తీర్పుపై స్పందించిన పాకిస్తాన్‌ గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలతో ప్రమేయం వున్న వారికి వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్యపరమైన సంప్రదింపుల అనుమతి లభించదని వివరించింది. జాదవ్‌ కేసులో భారత్‌ తన రాజకీయ డ్రామాకు ఐసిజెను వేదికగా ఉపయోగించుకున్నదని విమర్శించింది. 18 ఏళ్ల విరామం అనంతరం అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇరుదేశాలు న్యాయపోరాటం చేసిన విషయం తెలిసిందే. తమ నౌకాదళ హెలీకాప్టర్‌ను భారత్‌ కూల్చివేసిన కేసులో జోక్యం చేసుకోవాలని కోరుతూ పాకిస్తాన్‌ గతంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com