అటు సినిమాలు ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్న ప్రముఖ హీరో

- May 19, 2017 , by Maagulf
అటు సినిమాలు ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్న ప్రముఖ హీరో

పవన్‌కల్యాణ్‌ ఇంతకు ముందుతో పోలిస్తే ఈమధ్యే సినిమాలతో మరింత బిజీ అయిపోయారు. రాజకీయాల పరంగా కూడా ఇటీవల కాలంలోనే జోరు పెంచి.. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తన పార్టీ జనసేనని పునాదుల నుంచి బలోపేతం చేయాలని నిర్ణయించారు. అందుకోసం కార్యకర్తలతో కలుస్తూ, సమావేశాలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకొంటున్నారు. అది చూసి అభిమానులు ‘ఇక పవన్‌ చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక... మళ్లీ కెమెరా ముందుకొస్తారో లేదో’ అని ఆందోళనగా మాట్లాడుకొన్నారు. ఆమధ్య పవన్‌ మాటలు కూడా ఇక సినిమాలకి గుడ్‌ బై చెప్పేయడానికే సిద్ధమయ్యారనే అర్థాన్ని తెప్పించేలా ఉండేవి. కానీ పవన్‌ కల్యాణ్‌ దగ్గరికి ఇటీవల మంచి కథలొస్తుండడం, దానికితోడు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయడం అవసరమని నిర్ణయించుకొన్నారు. ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే ఇటీవల పవన్‌ ఓ ప్రకటన చేశారు. ‘అవసరమైతే ప్రజల కోసం సినిమాల్ని వాయిదా వేసుకొంటా’ అన్నారు. ఆ మాట అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పవన్‌ తన సినిమాల్ని వాయిదా వేస్తారేమో కానీ... వాటికి దూరం మాత్రం కారనే ఓ విషయం రూఢీ అయింది. అది చిత్ర పరిశ్రమకి కూడా ఒకింత ఉత్సాహాన్నిచ్చింది.
పవన్‌కల్యాణ్‌లాంటి అగ్ర కథానాయకుడు సినిమాలకి దూరమైతే ఆ ప్రభావం పరిశ్రమపై చాలానే పడుతుంది. మాస్‌లో బలమైన అభిమాన గణం ఉన్న ఆయన సినిమాల రూపంలో యేటా వందల కోట్ల వ్యాపారం జరుగుతుంటుంది. అందుకే పవన్‌ సినిమాల్లో నటించాల్సిందే అనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. పవన్‌ కూడా ఆ దిశగానే నిర్ణయం తీసుకోవడంతో అంతా వూపిరి పీల్చుకొన్నారు. పవన్‌ ఇప్పుడు తన దృష్టంతా కూడా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాపైనే పెట్టారు. విరామం లేకుండా ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మధ్యలో దొరికే సమయాన్ని రాజకీయాల కోసం వినియోగిస్తున్నారు. వచ్చే దసరాకే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో పవన్‌-త్రివిక్రమ్‌ల సినిమా తెరకెక్కుతోంది. పార్టీ నిర్మాణానికి సంబంధించిన పనుల కోసమే ఆయన అంత వేగంగా సినిమా చేస్తున్నారు. పవన్‌ ఆలోచనల్ని, ఆయన ఆశయాల్ని మనసెరిగిన వ్యక్తి కావడంతో దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా ముందస్తు ప్రణాళికలతో సినిమాని అనుకొన్న సమయానికే పూర్తి చేయడంపై దృష్టిపెట్టారు.
పేరు అదేనా? 
చిత్రీకరణ అయితే శరవేగంగా సాగుతోంది కానీ... చిత్రబృందం మాత్రం సినిమాకి సంబంధించిన ఏ విషయాన్నీ బయటికి పొక్కనీయడం లేదు. దాంతో అభిమానులు సినిమా పేరు గురించి, అందులో పవన్‌ పాత్ర గురించి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మధ్యలో ప్రచారంలోకొచ్చిన రకరకాల పేర్ల గురించి ఆసక్తికరంగా మాట్లాడుకొంటున్నారు. ఇప్పటికే నాలుగైదు పేర్లు వినిపించాయి. తాజాగా ‘గోకుల కృష్ణుడు’ అనే పేరు బయటికొచ్చింది. పవన్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పాత్రలో కనిపించినా... ఇదొక కుటుంబ కథ కావడంతో ఆ పేరునే నిర్ణయించేందుకే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం వూపందుకొంది. అయితే చిత్రబృందం నుంచి మాత్రం ఎటువంటి స్పందనా లేదు. ఇది కుటుంబ కథ అయినా ఇందులో యాక్షన్‌ ఘట్టాలు కూడా బలంగా ఉంటాయట. కొన్ని యాక్షన్‌ సన్నివేశాల్ని విదేశీ నిపుణులతో ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారని, వాటికోసం పవన్‌ కొంతకాలం శిక్షణ కూడా తీసుకొన్నారని తెలిసింది.
మరో రీమేక్‌కి ఒప్పుకొన్నారా? 
పవన్‌ ఒకపక్క రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారుతున్నప్పటికీ... మరో పక్క సినిమాలకి సంబంధించిన విషయాల్లోనూ ఆయన కీలక నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ కొత్త సినిమాల్నీ ఒప్పుకొంటున్నారు. ఇప్పటికే ఎ.ఎం.రత్నం నిర్మాణంలో నేసన్‌ దర్శకత్వం వహించనున్న ఓ రీమేక్‌ చిత్రంలో నటించేందుకు ఒప్పుకొన్న పవన్‌, ఆ తర్వాత ‘జాలీ ఎల్‌.ఎల్‌.బి2’రీమేక్‌లోనూ నటించాలని నిర్ణయించుకొన్నారట. హిందీలో అక్షయ్‌ కుమార్‌ నటించిన చిత్రం ‘జాలీ ఎల్‌.ఎల్‌.బి2’. న్యాయవ్యవస్థ నేపథ్యంలో సాగే ఆ కథ పవన్‌కి బాగా నచ్చిందట. ప్రస్తుతం పవన్‌ సినిమాని నిర్మిస్తున్న హారిక, హాసిని క్రియేషన్స్‌ సంస్థే ‘జాలీ ఎల్‌.ఎల్‌.బి2’ రీమేక్‌ హకుల్ని సొంతం చేసుకొంది. ఆ సినిమాని చూసి పవన్‌ వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది. పవన్‌ నిర్ణయాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ పార్టీ గురించి, ఆయన సినిమాల గురించి మాట్లాడుకొనేందుకు బోలెడన్ని కబుర్లన్నమాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com