సైబర్‌దాడులు తో పశ్చిమ దేశాలను వణికిస్తున్న 'యూనిట్ 180'
- May 21, 2017
-సైబర్‌దాడుల వెనుక ఉత్తర కొరియా గూఢచార సంస్థ విభాగం!..
- తోసిపుచ్చిన ప్యాంగ్‌యాంగ్..
-ఆధారాలున్నాయంటున్న దక్షిణ కొరియా
అంతర్జాతీయంగా ఇటీవల జరిగిన సైబర్ దాడుల వెనుక ఉత్తర కొరియా హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఉత్తర కొరియా ఖండిస్తున్నప్పటికీ, ఆ దేశానికి వ్యతిరేకంగా తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని దక్షిణ కొరియా అధికారులు చెప్తున్నారు. ఉత్తర కొరియా గూఢచార సంస్థ ఆర్జీబీకి అనుబంధంగా పనిచేస్తున్న యూనిట్-180 అనే ప్రత్యేక విభాగం సైబర్ దాడులకు పాల్పడుతున్నట్టు ఇంటర్నెట్ భద్రతా నిపుణులు అనుమానిస్తున్నారు. అమెరికా, దక్షిణ కొరియాతోపాటు మరో డజన్ ఇతర దేశాల్లోని ఆర్థిక నెట్‌వర్క్‌పై యూనిట్-180 గత కొన్నేండ్లలో పలుమార్లు సైబర్ దాడులకు పాల్పడిందని వారు తెలిపారు. ఈ నెలలో 150 దేశాల్లోని మూడు లక్షల కంప్యూటర్లను ధ్వంసం చేసిన వన్నాక్రై రాన్సమ్‌వేర్ వెనుక కూడా ఉత్తర కొరియా హస్తం ఉన్నట్టు తమవద్ద సాంకేతికపరమైన ఆధారాలున్నాయని సైబర్ పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ ఆరోపణలను ప్యాంగ్‌యాంగ్ తోసిపుచ్చింది.
గత ఏడాది బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్‌పై, అంతకుముందు 2014లో సోనీ హాలీవుడ్ స్టూడియోపై సైబర్ దాడికి పాల్పడి 81 మిలియన్ డాలర్లు దోచుకున్న లాజరస్ హ్యాకింగ్ గ్రూపునకు కూడా ఉత్తర కొరియాతో సంబంధాలున్నట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. బంగ్లాదేశ్ బ్యాంక్ దోపిడీపై ప్యాంగ్‌యాంగ్‌కు వ్యతిరేకంగా కేసు బనాయిస్తున్నట్టు అమెరికా అధికారులు తెలిపారు.
డబ్బు కోసమే సైబర్ దాడులు
అత్యంత రహస్యంగా తమ కార్యకలాపాలు నిర్వహించే దేశాలలో ఉత్తర కొరియా ఒకటి. దాని ఆర్థిక లావాదేవీల వివరాలను బయటకు రాబట్టడం అతికష్టమని నిపుణులు పేర్కొంటారు. కానీ ఈ దేశంపై అధ్యయనం చేసిన నిపుణులు లేదా దానిపై తిరుగుబాటుచేసి దక్షిణ కొరియాలో స్థిరపడిన వారు కొన్ని ఆధారాలను అందించారు. అలాంటి వారిలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ కిమ్ హ్యూంగ్ క్వాంగ్ ఒకరు. దక్షిణ కొరియాలో 2004 నుంచి నివసిస్త్ను కిమ్ నిధులు పోగు చేసుకొనేందుకే ప్యాంగ్‌యాంగ్ సైబర్ దాడులకు పాల్పడుతుందని చెప్పారు. ఈ దాడులను యూనిట్-180 ద్వారా నిర్వహిస్తారని తెలిపారు. ఈ యూనిట్-180 ఆర్థిక సంస్థలు, ఇతరుల బ్యాంక్ అకౌంట్లలోకి చొచ్చుకుపోయి డబ్బును దొంగిలిస్తుందని అన్నారు. తన మాజీ విద్యార్థులు కొందరు ప్రస్తుతం ఉత్తర కొరియా సైబర్ ఆర్మీలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. సైబర్ ఆర్మీకి చెందిన సభ్యులు ఇంటర్నెట్ నెట్‌వర్క్ బాగా పనిచేసే దేశాలకు వెళ్లి తమ లక్ష్యాన్ని సాధిస్తారు. వారు ఉత్తర కొరియాకు చెందిన కంపెనీల విదేశీ శాఖల ఉద్యోగులుగా లేదా చైనా, ఆగ్నేయాసియా దేశాల్లోని జాయింట్ వెంచర్ కంపెనీల సిబ్బందిగా వెళ్లి తమ పనిచేసుకుంటారు అని తెలిపారు. తమ ఉనికి బయటపడకుండా ఉండేందుకు ఉత్తర కొరియా సైబర్ నిపుణులు వర్ధమాన దేశాల నుంచి తమ దాడులు కొనసాగిస్తారని దక్షిణ కొరియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆన్ చాంగ్ ఘీ చెప్పారు.
గత ఏడాది జూన్‌లో దక్షిణ కొరియాకు చెందిన 160 కంపెనీలలోని 1.40 లక్షల కంప్యూటర్లను వారు హ్యాక్ చేశారని అన్నారు. చైనాలోని ఒక ప్రదేశం నుంచి దక్షిణ కొరియా అణు రియాక్టర్‌పై కూడా దాడికి పాల్పడ్డారని చెప్పారు. అలాగే మలేషియాను కూడా వారు పలుమార్లు తమ స్థావరంగా చేసుకున్నారని అన్నారు. చైనా లేదా తూర్పు యూరప్ దేశాల్లోని హోటళ్లు, మలేషియాలోని గేమింగ్, గ్యాంబ్లింగ్ సంస్థల కార్యాలయాల నుంచి వీరు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారని అమెరికా నిపుణుడు మైఖేల్ మాడెన్ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఎక్కడా కూడా ఈ దాడుల వెనుక ఉత్తర కొరియా ఉన్నదని నిర్దిష్టంగా రుజువు చేసేందుకు కచ్చితమైన ఆధారాలు లభించవని అన్నారు. ఇటీవలి వన్నాక్రై రాన్సమ్‌వేర్ వెనుక కూడా ఉత్తరకొరియా హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమైనప్పటికీ నిశ్చిత ఆధారాలు లభించలేదని అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఉత్తర కొరియా నుంచి సైబర్ ముప్పు పొంచి ఉన్నది మాత్రం వాస్తవమని అమెరికా సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ ైస్ట్రెక్ సహ వ్యవస్థాపకుడు డిమిట్రీ అల్పెరోవిచ్ అన్నారు.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









