బ్రెజిల్‌ ఉత్తర ప్రాంతం జైలు నుండి 89 మంది ఖైదీల పరారీ

- May 27, 2017 , by Maagulf
బ్రెజిల్‌ ఉత్తర ప్రాంతం జైలు నుండి 89 మంది ఖైదీల పరారీ

- జైలు నుండి 30 మీటర్ల సొరంగం తవ్విన వైనం 
 బ్రెజిల్‌ ఉత్తర ప్రాంతంలోని రియో గ్రాండ్‌ డి నార్త్‌ రాష్ట్రంలోని ఒక జైలు నుండి దాదాపు 89 మంది ఖైదీలు 30 మీటర్ల సొరంగం ద్వారా తప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని నాటాల్‌ నగరంలోని పెర్నామిరిం జైలు నుండి గురువారం ఉదయం ఖైదీలు పరారయ్యారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది. ఖైదీలు జైలు నుండి వెలుపలి వరకూ దాదాపు 30 మీటర్ల పొడవునా తవ్విన సొరంగం ద్వారా తప్పించుకున్నారని తెలుస్తోంది. రియో గ్రాండ్‌ డి నార్త్‌ చరిత్రలోనే ఇది అతి పెద్ద జైలు బ్రేక్‌ ఘటన అని అధికారులు చెబుతున్నారు. పరారయిన వారిలో తొమ్మిది మందిని ఇప్పటికే తాము అరెస్ట్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఖైదీలను తప్పించేందుకు జైలు బయట రెండు కార్లు, ఒక మోటార్‌ సైకిల్‌ను వినియోగించినట్లు జైలు భద్రతా విధులు నిర్వహిస్తున్న మిలటరీ పోలీసులు చెప్పారు. బయట తమను ఎవరూ గుర్తుపట్టకుండా వుండేందుకు వారు జైలులోనే తమ దుస్తులు మార్చుకున్నట్లు వారు వివరించారు. ఈ ఏడాదిలో ఈ జైలు నుండి ఖైదీలు తప్పించుకోవటం ఇది రెండోసారి.
గత జనవరిలో 14 మంది ఖైదీలు సొరంగ మార్గం ద్వారా తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ జైలు గరిష్ట సామర్ధ్యం 436 మంది ఖైదీలు కాగా, ఈ ఘటన జరిగిన సమయంలో మొత్తం 589 మంది ఖైదీలున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com