క్యూబాతో దోస్త్ రద్దు చేసుకున్న అమెరికా

- June 17, 2017 , by Maagulf
క్యూబాతో దోస్త్ రద్దు చేసుకున్న అమెరికా

-ఒప్పందాన్ని రద్దు చేసిన ట్రంప్ 
 రెండేండ్ల కిందట క్యూబాతో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేశారు. క్యూబాతో వాణిజ్య, పర్యాటక సంబంధాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో క్యూబా అధ్యక్షుడు రౌల్‌క్యాస్ట్రోపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాలోని మియామీలో క్యూబన్ అమెరికన్లు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. రౌల్‌క్యాస్ట్రో ప్రభుత్వం తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి అమెరికా డాలర్లతో సైనిక, నిఘా సామర్థ్యాన్ని పెంచుకుంటున్నది. క్యూబా ప్రజలను దోచుకునే, అవమానించే ఇలాంటి చర్యలను అనుమతించబోం. అందుకే ఒప్పందాన్ని రద్దు చేస్తున్నా అని ప్రకటించారు. క్యూబాతో పర్యాటక, వాణిజ్య సంబంధాలపై నిషేధం విధిస్తున్నట్టు చెప్పారు.
క్యాస్ట్రో ప్రభుత్వం ఉత్తరకొరియాకు ఆయుధాలు ఎగుమతి చేయడంతోపాటు, వెనిజులాలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడటానికి కారణమైందని ఆరోపించారు. క్యూబా ప్రభుత్వం అమాయకులను బంధిస్తూ, కరుడుగట్టిన నేరగాళ్లను వదిలేస్తున్నదని మండిపడ్డారు. మానవుల అక్రమ రవాణాను, శ్రమదోపిడీని ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయడంతోపాటు, స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించేవరకు క్యూబాపై ఆంక్షలను ఎత్తివేయబోమని పునరుద్ఘాటించారు.
స్వేచ్ఛ కోసం క్యూబా ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతామని చెప్పారు. ట్రంప్ నిర్ణయంపై క్యూబా ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని ప్రకటించింది. దశాబ్దాల పాటు కత్తులు దూసుకున్న అమెరికా, క్యూబా రెండున్నరేండ్ల కిందటే చేయి చేయి కలుపుకొన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com