ముస్లిం దేశాలకు కొత్త వీసా నిబంధనలు
- June 29, 2017
అమెరికాలోని సంస్థలు, వ్యక్తులతో దగ్గరి సంబంధాలున్నవారే వీసా దరఖాస్తుకు అర్హులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వివాదాస్పద నిషేధాజ్ఞలను ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల పాక్షికంగా పునరుద్ధరించిన నేపథ్యంలో ఆరు ముస్లిం దేశాలకు వీసాల జారీలో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రజలు, శరణార్థులు అమెరికాలోని వ్యక్తులు లేదా సంస్థలతో దగ్గరి సంబంధం కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలను సదరు ముస్లిం దేశాల్లోని రాయబార కార్యాలయాలకు పంపించారు. వీసా దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా తమ సంబంధాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గురువారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆరు ముస్లిం దేశాల పౌరులు అమెరికా రాకుండా నిషేధాజ్ఞలు విధించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ట్రంప్ ట్రావెల్ బ్యాన్పై అక్కడి కోర్టులు స్టే విధించాయి. కాగా.. ఈ నిషేధాన్ని ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు పాక్షికంగా పునరుద్ధరించింది. ట్రంప్ జారీచేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కింద కోర్టులు అభ్యంతరం చెప్పగా, సుప్రీంకోర్టు మాత్రం పాక్షికంగా అమలుచేసుకోవచ్చునని చెప్పింది.
అమెరికాలోని సంస్థలు లేదా వ్యక్తులతో విశ్వసనీయ సంబంధం లేని వ్యక్తులకు అక్టోబర్ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. అమెరికాతో వ్యక్తిగత సంబంధం ఉన్నవారికి మాత్రం ప్రస్తుతానికి ఆంక్షలు అమలు చేయకూడదని పేర్కొంది. అక్టోబర్ దాకా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని.. ఆ తర్వాత కేసును పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయస్థానం నిర్ణయం మేరకు ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది.
కొత్త రూల్స్ ప్రకారం..
ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల నుంచి వచ్చే వ్యక్తులు అమెరికాలోని వ్యక్తులు లేదా సంస్థలతో అత్యంత దగ్గరి సంబంధం కలిగి ఉండాలి. అంటే.. తల్లిదండ్రులు, జీవితభాగస్వామి, పిల్లలు, కోడలు, అల్లుడు, తోబుట్టువులు ఇలా వారికి అమెరికా వ్యక్తులతో బంధుత్వం ఉండాలి. అయితే తాతముత్తాతలు, మనవళ్లు, మనవరాళ్లు, అత్త, మామ, మేనల్లుడు, మేనకోడలు, వరుసకు సోదరులు, బావ, మరదలు, కాబోయే భాగస్వామి ఇలాంటి బంధుత్వాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. వీసా దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా ఈ బంధుత్వాన్ని రుజువు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
జర్నలిస్టులు, విద్యార్థులు, వర్కర్లు, లెక్చరర్లు ఆహ్వానంతో వస్తే, లేదా కాంట్రాక్ట్ ఉద్యోగంతో అమెరికాను సందర్శించాల్సి వస్తే, ట్రావెల్ బ్యాన్ నుంచి వారిని మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. వ్యాపారాలు లేదా నిపుణులకు ఉన్న సంబంధాలను పరిగణలోకి తీసుకొని, వారు ట్రావెల్ బ్యాన్ నుంచి తప్పించుకోవడానికి చట్టబద్ధమైన సంబంధాన్ని అధికారికంగా, డాక్యుమెంట్ రూపంలో నిరూపించుకోవాలని స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







