ఐసిస్ బాట పట్టకుండా 'ఆపరేషన్ పిజియన్'

- June 30, 2017 , by Maagulf
ఐసిస్ బాట పట్టకుండా 'ఆపరేషన్ పిజియన్'

ఉగ్రవాద భావాల వైపు ఆకర్షితులై ఐసిస్ బాట పడుతున్న కేరళ యువతను అడ్డుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 'ఆపరేషన్ పిజియన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలిగా కాసర్గఢ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసింది. పలు ఏజెన్సీలు, సామాజిక మాధ్యమాల సాయంతో ఉగ్రవాదం ఉచ్చులో పడుతున్న యువతను గుర్తించేలా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆపరేషన్ను విస్తరించింది. ఇప్పటివరకు 350 మందిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించారు. దీనికోసం జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బందితో కేరళ గూఢచార సంస్థ ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా నుంచి 118 మంది, మలప్పురం నుంచి 89, కాసర్గఢ్ నుంచి 66 మందిని గుర్తించినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కోజికోడ్ నుంచి 25 మంది, పాలక్కడ్ నుంచి 16 మంది యువకులు ఐసిస్లో చేరేందుకు అధిక ఆసక్తి చూపినట్లు చెప్పారు. ఇప్పటి వరకు గుర్తించిన 350 మంది జాబితాలో ఒక్కరు కూడా మహిళ లేనట్లు తెలిపారు. 'వారి వయసు ఇరవైలలో ఉంటుంది. చాలా మంది ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్నారు.

వారిలో ఒక్కరు కూడా నిరక్ష్యరాసులు లేరు' అని కేరళ ఇంటెలిజెన్స్ చీఫ్ బీఎస్ మహమ్మద్ యాసిన్ వివరించారు. ఉగ్రవాదం వైపు మళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా గుర్తించిన యువత తల్లిదండ్రులు, స్థానిక పెద్దలను కలిసి చర్చించామన్నారు. అయితే, వారి తల్లిదండ్రుల నుంచి సహకారం లేకపోతే ఈ కార్యక్రమం అమలు చేయడం సాధ్యమయ్యేది కాదని యాసిన్ చెప్పారు. ప్రత్యేక శిక్షణ పొందిన ఎన్ఐఏ, ఐబీ సిబ్బందితో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు.

మొదటి దశలో భాగంగా చేపట్టిన 'ఆపరేషన్ పిజియన్'తో.. తాము ఎంచుకున్న మార్గం సరైంది కాదని చాలామంది యువకులు గ్రహించినట్లు వివరించారు. అయితే, ఇప్పటికీ 30 మంది ఐసిస్ భావజాలం వైపు ఆసక్తిగానే ఉన్నారని, వారితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వారిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు యాసిన్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com