దుబాయ్ లో రోబో పోలీస్ కార్లు

- July 01, 2017 , by Maagulf
దుబాయ్ లో రోబో పోలీస్ కార్లు

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎడారి దేశం దుబాయికి ఎవరూ సాటిరారేమో. ఆకాశహర్మ్యాలలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు ఇప్పటికే అక్కడ ఎగిరే జెట్‌ప్యాక్‌ల సేవలు వినియోగించుకుంటున్నారు. గత నెలలో ప్రపంచంలోనే తొలిసారి ఈ దేశంలో తొలి రోబో పోలీస్‌ విధులు నిర్వర్తించడం మొదలైంది. అయితే ఇదేమీ తుపాకీ చేతిలో పట్టుకుని తిరిగే రోబో పోలీస్‌ కాదులెండి. పర్యాటకులకు తగిన సలహా సూచనలిచ్చేందుకు, ట్రాఫిక్‌ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూసేందుకు మాత్రమే ఉద్దేశించారు.

తాజాగా దుబాయి పోలీస్‌ విభాగం రోబో కార్లను ప్రవేశపెట్టింది. ఫొటోలో కనిపిస్తున్నది అలాంటి రోబోనే. ఈ రోబో కారు చూసేందుకు చిన్నగా ఉంటుంది గానీ.. దీనిలో బోలెడన్ని టెక్నాలజీలు ఉన్నాయి. సింగపూర్‌ స్టార్టప్‌ కంపెనీ ఒట్‌సా డిజిటల్‌ అభివృద్ధి చేసిన ఈ రోబో పేరు ఓ–ఆర్‌3. పేరుకు కారే గానీ.. ఇది కనీసం పరుగు కూడా పెట్టలేదు. కాకపోతే.. తనకు కేటాయించిన బీట్‌లో పోలీసు రికార్డులకు ఎక్కిన నిందితులెవరైనా ఉంటే మాత్రం... ఇట్టే పసిగట్టేస్తుంది. ఇందుకు అనుగుణంగా దీంట్లో ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని ఉపయోగించారన్నమాట. ఓ లేజర్‌ స్కానర్, ఓ థర్మల్‌ కెమెరా, హెచ్‌డీ కెమెరాలతోపాటు లిడార్‌ వంటి స్పేస్‌ కెమెరాలూ ఇందులో ఉంటాయి.

మరి ఇది చిన్నచిన్న గల్లీల్లోకి కూడా వెళ్లగలదా? ఊహూ. కానీ కారు పైకప్పుపై ఉండే డ్రోన్‌ కావాల్సిన చోటికెళ్లి అందరి మీద ఓ కన్నేసి రాగలదు. పగలు రాత్రి, ఎండా వాన లాంటి అవరోధాలు ఏమీ లేకుండా రోడ్లపై ఓ కన్నేసి ఉంచేందుకు, అనుమానితులను గుర్తించేందుకు ఓ–ఆర్‌3 మేలైన మార్గం అంటున్నారు దుబాయి పోలీస్‌ విభాగపు అధ్యక్షుడు అబ్దుల్లా ఖలీఫా అల్‌ మరీ. ఈ ఏడాది చివరికల్లా ఓ–ఆర్‌3 రోబోలను పెద్దసంఖ్యలో దుబాయి రోడ్లపై నియమిస్తామంటున్న ఖలీఫా.. భవిష్యత్తులో మరిన్ని కొత్త రోబోలు, టెక్నాలజీలను శాంతిభద్రతల పరిరక్షణకు వాడతామని చెబుతున్నారు. ఇంకొన్నేళ్లలో పది అడుగుల ఎత్తైన రోబో పోలీసులు దుబాయి వీధుల్లో పనిచేస్తూంటాయని, 2030 నాటికల్లా డిపార్ట్‌మెంట్‌లో 25 శాతం రోబోలే ఉంటాయనీ ఆయన అంచనా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com