విదేశాలలో విద్య అభ్యసించాలి అంటే బెస్ట్ కంట్రీ న్యూజిలాండ్
- July 11, 2017
విదేశీ విద్యకు నానాటికీ క్రేజ్ పెరుగుతోంది. భారత్ నుంచి ప్రతిఏటా లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు పయనమవుతున్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్ కు వెళ్తున్న భారత్ విద్యార్ధుల సంఖ్య ప్రతి ఏటా ఘననీయంగా పెరుగుతుంది. డైరీ టెక్నాలజీ, హార్టికల్చర్, బయోటెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, మెరైన్ ఇంజనీరింగ్ వంటి వినూత్నమైన కోర్సులను ఇక్కడి యూనివర్సిటీలు అందిస్తున్నాయి. విద్యా నివాస వ్యయం ఆస్ట్రేలియా కంటే తక్కువ. కోర్సులు పూర్తయిన తర్వాత ఉండేందుకు న్యూజిలాండ్ అవకాశం కల్పిస్తోంది. శాశ్వత నివాస హోదా దక్కించుకుంటే ప్రభుత్వ రుణ సాయంతో ఉన్నత విద్య పూర్తి చేయవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో ప్రపంచంలో ప్రముఖ వర్సిటీలుగా గుర్తింపును సొంతం చేసుకున్నాయి.
ఎంత ఖర్చు అవుతుంది..?
న్యూజిలాండ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చదవాలంటే ఏటా ట్యూషన్ ఫీజు యూనివర్సిటీలను బట్టి 10వేల నుంచి 18 వేల న్యూజిలాండ్ డాలర్లు (ఒక డాలరు సుమారు 45 రూపాయలు) వెచ్చించాల్సి ఉంటుంది. అదే పీజీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు 14 వేల నుంచి 25 వేల డాలర్ల వరకు ఉంటుంది. జీవన వ్యయం ఏడాదికి 12వేల డాలర్లు అవుతుంది. స్టూడెంట్ హాస్టల్స్ లో అయితే వారానికి 200 డాలర్లు అవుతుంది. ఎవరి ఇంట్లో అయినా అతిథిగా ఉండేట్లు అయితే వారానికి 180 డాలర్ల వరకు, ఫ్లాట్ లో ఉండాలంటే 120 డాలర్ల వరకూ ఖర్చు అవుతుంది.
స్టూడెంట్ వీసా
న్యూజిలాండ్ లో మూడు నెలలు అంతకంటే తక్కువ వ్యవధి ఉన్న కోర్సుల కోసం అయితే స్టూడెంట్ వీసా అవసరం లేదు. విజిటర్ వీసాపై చదువుకుని వెళ్లిపోవచ్చు. మూడు నెలల కాల వ్యవధికి మించిన పూర్తి స్థాయి కోర్సులను చేయాలంటే స్టూడెంట్ వీసా తీసుకోవాలి. కోర్సు కాల వ్యవధిని అనుసరించి వీసా గడువు ఉంటుంది. న్యూజిలాండ్ క్వాలిఫికేషన్స్ అథారిటీ ఆమోదం ఉన్న విద్యా సంస్థ నుంచి ప్రవేశానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. ఉండడానికి తగిన వసతి కల్పిస్తున్నట్టు విద్యా సంస్థ లేదా స్థానిక వ్యక్తి నుంచి హామీని జతచేర్చాలి. చదువుకి, ఉండడానికి అయ్యే వ్యయం, స్వదేశం తిరిగి వెళ్లిపోవడానికి విమాన టికెట్ కొనుగోలుకు సరిపడా నగదు ఆధారాలు కూడా చూపాలి.
విద్యారుణం తీసుకుంటే దానికి సంబంధించి రుణం మంజూరు పత్రం, బ్యాంకు స్టేట్ మెంట్, ఫిక్స్ డ్ డిపాజిట్లు ఏమైనా కలిగి ఉంటే ఆధారాలుగా పేర్కొనవచ్చు. తల్లిదండ్రులు విద్యా వ్యయాన్ని సమకూరుస్తారని చెప్పేట్లు అయితే వారి ఆదాయ వివరాలకు సంబంధించి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. నేరుగా విద్యా సంస్థను సంప్రదించడం, స్వదేశంలో న్యూజిలాండ్ ఎడ్యుకేషన్ సెంటర్లు.. అవి లేకుంటే ఆ దేశ ఎంబసీ, హై కమిషన్లలో సంప్రదించవచ్చు. న్యూజిలాండ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెంట్ల సాయం తీసుకోవచ్చు.
పార్ట్ టైమ్ జామ్ అవకాశం
స్టూడెంట్ వీసా ఉన్న వారు చదువుతూనే వారానికి 20 గంటల పాటు పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. సెలవుల్లో ఫుల్ టైమ్ చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు రెండేళ్లు, అంతకు మించిన కాల వ్యవధి ఉన్న కోర్సులు చేస్తున్న వారికే. అందులోనూ వృత్తి నైపుణ్యానికి సంబంధించి ఆ కోర్సుకు గుర్తింపు ఉండాలి. ఇంకా ఐఈఎల్టీఎస్ స్కోరు, ఇతరత్రా నిబంధనలు ప్రవేశాలకు వర్తిస్తాయి. డాక్టరేట్ తదితర పరిశోధన కోర్సులు చేస్తున్న వారయితే వెసులుబాటును బట్టి ఎన్ని గంటల పాటైనా ఉద్యోగం చేసుకునే వీలుంది. ఇంటర్ విద్యార్థులు కూడా వారానికి 20 గంటల పాటు పనిచేసుకోవచ్చు. స్వల్ప కాలిక కోర్సులు, ఇంగ్లిష్ భాషా కోర్సుల వారు పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవడానికి లేదు. అలాగే, ఏదైనా స్వయం ఉపాధి చూసుకోవడానికి వీల్లేదు. అందరూ తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.
చదువు అనంతరం ఉద్యోగ అవకాశాలు.
న్యూజిలాండ్ లో విద్య తర్వాత ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంది. డిగ్రీ లేదా పీజీ తర్వాత తమ కోర్స్ కు తగిన అనుభవం సంపాదించేందుకు వీలుగా ఉద్యోగం చేసుకోవచ్చు. చేసిన కోర్సును బట్టి నాలుగేళ్ల వరకు ఉద్యోగం చేసుకోవచ్చు. అంతేకాదు, నివాస హోదాను కూడా పొందే అవకాశం ఉంది.
వర్క్ వీసాలు
పోస్ట్ స్టడీ వర్క్ వీసా (ఓపెన్): తాము చదివిన రంగంలో ఉద్యోగం సంపాదించుకునేందుకు వీలుగా 12 నెలల గడువుతో ఈ వీసా జారీ చేస్తారు. ఉద్యోగ అన్వేషణ సమయంలో తమ పోషణ ఖర్చులకు గాను ఏదేనీ ఉద్యోగం చేయడానికి అనుమతిస్తారు.
పోస్ట్ స్టడీ వర్క్ వీసా (ఉద్యోగ సంస్థ సహకారంతో): పని అనుభవం సంపాదించుకునేందుకు వీలుగా రెండేళ్ల కాల వ్యవధితో ఈ వీసా జారీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది. సంబంధిత ఉద్యోగం, సంస్థను బట్టి వీసా గడువును నిర్ణయిస్తారు. ఈ వీసా కాల వ్యవధి ముగిసిన తర్వాత నైపుణ్యం కలిగిన విభాగంలో న్యూజిలాండ్ రెసిడెంట్ వీసా పొందే అవకాశం ఉంది. చేసిన కోర్సుకు సంబంధించిన నిపుణుల కొరత ఉన్నట్లయితే అటువంటి వారికి ఫుల్ డిమాండ్. ఉద్యోగంతో హాయిగా సెటిల్ అయిపోవచ్చు. తగిన అర్హతలు ఉంటే ఆ దేశ పౌరసత్వం కూడా పొందే అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామి, పిల్లల్ని కూడా వెంట తీసుకెళ్లవచ్చు. ఇందుకోసం విజిటర్ వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ వీసాతో భార్యా, పిల్లలు కూడా చదువుకోవచ్చు.
పేరున్న యూనివర్సిటీలు
న్యూజిలాండ్ లో టాప్ యూనివర్సిటీలను చూస్తే. యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో, మాసే యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కేంటర్ బరీ, యూనివర్సిటీ ఆఫ్ వాయికాటో, విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్, ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, లింకన్ యూనివర్సిటీ లు ఉన్నాయి.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







