షార్ట్ ఫిలిమ్స్ ద్వారా యువత సినీ రంగంలోకి
- July 12, 2017
ది అమలాపురం టీమ్ వర్క్స్ పేరుతో చిత్రీకరణలు
సామాజిక చైతన్యమే లక్ష్యంగా ఇతివృత్తాలు
ఓ వ్యక్తి షోడా బడ్డీ వద్ద సిగరెట్టు కాల్చుతూ.. 'ఈనాడు' దిన పత్రిక చదువుతూ.. నవ్వుతూ ఉంటాడు. ఈలోగా ఎదురుగా ఉన్న మరో వ్యక్తి ఎందుకు నవ్వుతున్నారని అడుగుతాడు. ఈ మధ్య యువత కారణాల్లేకుండానే చేతులారా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. యూత్ మరీ దారుణం.. ఎంతో విలువైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు.. నవ్వు కాకపోతే ఇంకేమిటి అని సమాధానమిస్తాడు. దానికి ఎదుటి వ్యక్తి కూడా నవ్వుతాడు. చూశారా.. మీరు కూడా నవ్వుతున్నారు అంటాడు ఆ వ్యక్తి. నేను నవ్వేది అందుకోసం కాదు.. ఇంత చెబుతున్నా.. మీ చేతిలో కాలేది మీ జీవితమే కదా అని ఎదుటి వ్యక్తి అనే సరికి.. బడ్డీ వద్ద ఉన్న రేడియోలోంచి..
''తప్పులెన్నువారు తండోపతండంబు.. లుర్వి జనుల కెల్ల నుండు తప్పు... తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు...విశ్వదాభిరామ వినుర వేమ!
తప్పులు చాలా మంది చేస్తుంటారు. మరొకరి తప్పులే వెతికేవారు మాత్రం తమ తప్పులు తెలుసుకోలేరు.'' అని వస్తుంది. తరువాత ఆ వ్యక్తి ఈ రోజు నుంచి సిగరెట్టు కాల్చకూడదని నిర్ణయించుకుంటాడు. ఆ వేమన పద్యంలో ఎంతో జీవిత సత్యముంది. నేటి యువతకు చక్కగా బోధపడే పద్యమిది. అలాంటి పద్యంతో సిగరెట్టు కాల్చవద్దని అవగాహన కల్పించే రెండు నిమిషాల 3 సెకన్ల నిడివిగల లఘు చిత్రం 'వినుర వేమ' గతేడాది డిసెంబరులో అమెరికన్ ఆంకాలజీ సంస్థ నుంచి జాతీయ స్థాయి ఉత్తమ షార్ట్‌ఫిల్మ్‌గా అవార్డు పొందింది.
పిల్లలను మార్కులు పొందే యంత్రాలుగా కాకుండా మానవీయ, నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఓ యువకుడు విద్యార్థులకు పలు హితాంశాలను బోధిస్తాడు. స్వచ్ఛభారత్, సమాజాభివృద్ధి వంటి విషయాలను చెబుతాడు. నెమ్మదినెమ్మదిగా ప్రతి విద్యార్థిలో స్వచ్ఛభారత్ అనే భావన బాగా నాటుకుపోతుంది. ఓ విద్యార్థిని తన బామ్మ బయటపారబోసే చెత్తను తాను సేకరించి.. మున్సిపాలిటీ నిర్దేశించిన చెత్తబుట్టలో పారేస్తుంది. తరువాత స్క్రీన్‌పై ''పట్టు వదలకుండా చేసే ప్రయత్నం.. చివరకు విజయాన్ని చేకూరుస్తుంది...ఒక్క రోజులో దేన్నీ సాధించలేం... అనే స్వామి వివేకానందుడి సూక్తి వస్తుంది. ఈ తీరైన లఘు చిత్రం 'చైతన్యం' అనే చిత్రానికి హైదరాబాద్‌లో ఓ సంస్థ నుంచి జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు లభించింది.
ఇలాంటి ఎన్నో లఘు చిత్రాలను సంక్షిప్త తెరకెక్కిస్తూ.. సామాజిక చైతన్యం కోసం కొందరు యువతీ యువకులు 'ది అమలాపురం టీమ్ వర్క్స్' పేరుతో దర్శకుడు యాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్సు చదివిన అతడు సమాజంలోని కొన్ని అంశాలను తీసుకుని వాటి మార్పు కోసం సామాజిక మాధ్యమాన్ని ఎంచుకుని.. అందులో తాను చిత్రించిన లఘు చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్నారు. అందులో అమలాపురం పట్టణానికి చెందిన వారే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంబీబీఎస్ పూర్తి చేసిన యువత సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వీరంతా దిన పత్రికల్లో వస్తున్న మానవీయ కథనాలను ఎంచుకుని.. సామాజిక ఇతి వృత్తాలతో లఘు చిత్రాలను తీస్తున్నారు. ఆ తీరుతో ఇప్పటి వరకూ సుమారు 23 లఘు చిత్రాలను తెరకెక్కించారు. వాటిలో దాదాపుగా 10 చిత్రాలకు ఉత్తమ అవార్డులు వచ్చాయి. ప్రముఖ దర్శకులు రాజహౌళి, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రాల నిర్మాణంలో అవసరమైతే ఒక్కోసారి బుల్లితెర నటులను, ఒకసారి సినిమా నటుడి సహకారాన్ని తీసుకున్నారు. ఆ చిత్రాల్లో కొన్నింటి కథా కమీషులు ఓ సారి తెలుసుకుందాం.
మధుర జ్ఞాపకాల ఒడిలో...
ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్లైన కొత్తలో ఓ జంట విడాకుల కోసం మహిళా న్యాయవాది వద్దకు వెళ్తారు. ఓ సారి ఇద్దరూ కూర్చుని ఆలోచించుకోండి.. అయినా ఏడాది పూర్తి కాకుండా విడాకులు రావు అనే సరికి వారు కారులో వెనుదిరిగి వెళ్తారు. కారులో ఉండగానే.. పెళ్లి ఫొటోల ఆల్బమ్ వచ్చిందని ఫొటోగ్రాఫర్ ఫోన్ చేస్తాడు. ఓం టైంమింగ్‌రా.. విడాకుల కోసం వెళ్తే.. పెళ్లి ఆల్బమ్ వచ్చిందా అనుకుంటూ.. ఇంటికి వెళ్లే సరికి ఫొటోగ్రాఫర్ ఉంటాడు. భర్త ఆల్బమ్‌ను అందుకుని సోఫాలో పడేస్తాడు. అప్పుడు ఆ ఫొటోగ్రాఫర్ విషయం తెలుసుకుని.. మీరిద్దరూ కలిసి ఆల్బమ్ చూడండి.. అందులో ఎన్నో మధుర జ్ఞాపకాలుంటాయి. వాటిని నెమరు వేసుకోండి.. అప్పటికీ విడిపోవాలనుకుంటే మీ ఇష్టం అని వెళ్లిపోతాడు. అయిష్టంగానే ఆ దంపతులు ఫొటోలు చూస్తారు. అనుకోకుండా మళ్లీ దగ్గరైపోతారు. ఈ విషయాన్ని న్యాయవాదికి చెప్పేందుకు వెళ్తారు. తిరిగి వచ్చేటప్పుడు న్యాయవాది యుక్త వయసులో ఫొటో చూసి..ఆ భార్య.. మేడం ఈ ఫొటో చాలా అందంగా ఉంది. ఎవరు తీశారో గానీ.. అని వెళ్తారు. ఆ లాయర్‌కు ఫొటగ్రాఫరైన భర్త గుర్తుకొస్తాడు. దూరంగా బతుకుతున్న భార్యాభర్తలిద్దరూ దగ్గరవుతారు. 'నిశ్చలచిత్రం' పేరుతో తీసిన ఈ లఘు చిత్రానికి అమరావతికి చెందిన ఫొటో టెక్నాలజీ నిర్వహించిన పోటీల్లో ఉత్తమ జాతీయ ఫొటో గ్రాఫర్ అవార్డు వచ్చింది. ఈ చిత్రంలో కాకినాడకు చెందిన నిజమైన దంపతులు శశికుమార్, గాయిత్రి నటించడం విశేషం. సమాజంలో కొందరిలోనైనా మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఈ చిత్రంలో నటించామని ఆ దంపతులు చెప్పారు.
అహాన్ని వీడి కుల వ్యవస్థ నిర్మూలన కోసం...
కుల వ్యవస్థను నిర్మూలించాలంటే భవిష్యత్తు తరాల్లోవారికి కులమనే పదం తెలియకూడదు. ఆ దిశగా ఈ రోజునుంచే మనమంతా ఐక్యంగా కృషి చేయాలని కొందరు యువకులు ప్రతిజ్ఞ చేసుకుంటారు. తరువాత ఆ యువకుల బృందానికి ఆ వినూత్న ఆలోచన రేకెత్తించిన యువకుడు ప్రమాదానికి గురవుతాడు. అతడికి శస్త్రచికిత్స చేసేందుకు రక్తం అవసరం. అతడి స్నేహితులంతా తక్షణమే రక్తదాతలను సిద్ధం చేస్తారు. ఈలోగా ఆ యువకుడి తండ్రి వచ్చి.. రక్తమిచ్చేవారు మా సామాజిక వర్గానికి చెందినవారా కాదా? అని అడుగుతాడు. కాదని చెప్పేసరికి నా కొడుక్కి నా సామాజిక వర్గానికి చెందిన వారి రక్తమే అర్థగంటలో సిద్ధం చేస్తాను.. ఇదిగో ఇప్పుడే మా సామాజిక వర్గ ఎఫ్‌బీలో పోస్ట్ చేస్తున్నాను అంటాడు. తరువాత లోపలి నుంచి వచ్చిన వైద్యుడు, ఆ యవకుడి స్నేహితులు తండ్రికి గుణపాఠం చెప్పేతీరును 'అహం' అనే లఘు చిత్రంలో చెప్పారు. అమలాపురం పట్టణానికి చెందిన యువకులతో పాటుగా కాకినాడకు చెందిన ఓ వైద్యుడు, వర్థమాన సినీ నటుడు గనిశెట్టి రమణ్‌లాల్ ఇందులో నటించారు.
సామాజిక చైతన్యం కోసం పరితపన
తెలుగు భాష గొప్పదనాన్ని తెలియజేసేలా ప్రియురాలికి అ నుంచి ప్రారంభించి అః వరకూ అన్ని అక్షరాలను కలిపి ప్రేమిస్తున్నాననే విషయాన్ని చెప్పిన చిత్రం 'ఒకే బంగారం', కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించే వినూత్న ప్రాజెక్టులను తెలియజేసేలా 'పి-సొల్యూషన్' అనే చిత్రాన్ని, రహదారి ప్రమాదాల నివారణలో విలువైన 'హెల్మ్‌ట్' కోసం లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. పుట్టినరోజులు చేయడం ద్వారా వృథా ఖర్చు, ఎంతో ప్లాస్టిక్ వినియోగం, తద్వారా అపారిశుద్ధ్యం లాంటి పరిస్థితులు తలెత్తుతాయని ఓ చిన్నారి తన తండ్రికి చెప్పే 'ఇంఫేక్ట్', వృద్ధుడికి సాయం చేసే ఓ యువకుడి కథనం 'పరిధి' లాంటి లఘు చిత్రాలను ఇటీవల తెరకెక్కించారు. గతంలో సత్యం, శివం, సుందరం, వూహనాది, ఎంఎంఎస్, పైసా, కల్చర్, డబ్బు, బ్రేకింగ్ న్యూస్, పథకం లాంటి పలు లఘు చిత్రాలను తీసి.. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడమే కాకుండా.. పలు విద్యా సంస్థల్లో ఉచితంగా ఆ చిత్రాలను ప్రదర్శించి చైతన్యం కోసం పరితపిస్తున్నారు ఆ యువ బృందం.
మాది చిన్న ప్రయత్నం..
సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో మేం చేస్తున్న చిన్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించడం బావుంది. పలు ఆసుపత్రుల వద్ద, మంచి గృహాల్లో షూటింగ్‌కు పలువురు అనుమతి చెప్పి మా ప్రయత్నంలో పాత్రులవుతున్నందుకు కృతజ్ఞతలు. అలాగే పలు పోటీలకు వెళ్తున్నప్పుడు మా చిత్రాలకు ఉత్తమ అవార్డుల రావడం వల్ల ఇంకా మంచి లఘు చిత్రాలను తీయాలనే ఆకాంక్ష పెరుగుతుంది.
-యాళ్ల నాగేశ్వరరావు, లఘు చిత్రాల దర్శకుడు, ది అమలాపురం టీమ్ వర్క్స్
ఎంతో గర్వంగా ఉంటుంది...
సమాజాన్ని పట్టిపీడుస్తున్న కొన్ని చెడు అంశాలను దూరం చేసేందుకు లఘు చిత్రాల ద్వారా మేం చెబుతున్న సందేశాలను చూసి చాలా మంది మమ్మల్ని అభినందిస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. వీటిని భవిష్యత్తులో ఇలాగే కొనసాగిస్తూ హితమైన సమాజం కోసం కృషి చేస్తాం.
-రావుల రాజేష్, ఎంబీఏ విద్యార్థి, అమలాపురం
వారి తపన నచ్చి నటించా...
ఈ బృందం సామాజిక చైతన్యం కోసం చేస్తున్న కృషిని, ఆ లఘు చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో చూసి బాగా నచ్చింది. దీంతో వారితో కలిసి అహం లఘు చిత్రంలో వైద్యుడిగా నటించాను. మంచి పాత్ర.. దాని ద్వారా హితమైన సందేశముంటే తప్పకుండా వారితో మున్ముందు కూడా ప్రయాణిస్తాను.
-రమణ్‌లాల్ గనిశెట్టి, సినీ వర్థమాన నటుడు
ఒక్కరి వల్ల సాధ్యం కాదు...
మార్పు అనేది ఎవరో ఒకరి వల్ల సాధ్యం కాదు. అంతా సమైక్యంగా ఆలోచించి.. అందరి ఆలోచనలు పంచుకుని కథ, కథనం సిద్ధం చేసుకుని లఘు చిత్రాలను తెరకెక్కిస్తున్నాం. ముఖ్యంగా మాకు వచ్చిన అవార్డు మమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్, కుల వ్యవస్థ నిర్మూలన లాంటి అంశాలు ఎంతగానో సంతృప్తినిస్తున్నాయి.
మోటూరి చైతన్య, ఫిజియోథెరిపిస్ట్, కాకినాడ.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









