పాకిస్తాన్ కు గడ్డుకాలం.. బ్రేక్‌ వేసిన యూఎస్

- July 15, 2017 , by Maagulf
పాకిస్తాన్ కు గడ్డుకాలం.. బ్రేక్‌ వేసిన యూఎస్

పాకిస్థాన్‌కు ఇక అమెరికా నుంచి గడ్డు పరిస్థితులు ఎదురవ్వనున్నాయి. ఉగ్రవాదం అణిచివేసే పేరుతో ఇబ్బడిముబ్బడిగా సహాయ నిధులు తెచ్చుకుంటున్న పాకిస్థాన్‌కు అమెరికా బ్రేక్‌ వేసింది. ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభ జాతీయ రక్షణ అధికారిక చట్టానికి తాజాగా మూడు సవరణలు తీసుకొచ్చి ఆమోదించారు. దీని ప్రకారం గతంలో మాదిరిగా పాక్‌ తమ రక్షణ పేరిట నిధులను ఇష్టం వచ్చినట్లు తెచ్చుకునే వీలుండదు.
తాము ఉగ్రవాదులను ఎంత మేరకు కట్టడి చేశామనే విషయాన్ని, ఏ ప్రాంతాలను ఉగ్రవాద రహిత ప్రాంతాలుగా మార్చామనే విషయాన్ని అమెరికాకు నివేదిక రూపంలో పాకిస్థాన్‌ ఇవ్వాలి. ఆ నివేదిక పరిశీలించి నమ్మితేనే పాక్‌కు అమెరికా నిధుల సహాయం చేస్తుంది. జాతీయ రక్షణ సంస్థ చట్టం ప్రకారం 2018కిగాను 651 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ దానిని ఏ విధంగా ఖర్చు చేయాలనే విషయంపై మూడు సవరణలు తీసుకొచ్చి లోయర్‌ హౌజ్‌ ఆఫ్‌ది కాంగ్రెస్‌లో ప్రవేశ పెట్టి మూజువాణి ఓటుతో శుక్రవారం సాయంత్రం ఆమోదించారు. ఈ సందర్భంగా విదేశాంగ వ్యవహారాలకు చెందిన కమిటీ సభ్యుడు పో మాట్లాడుతూ..
'రక్షణ సహాయం పేరిట పాకిస్థాన్‌ ఇప్పటి వరకు అదనంగా పొందుతున్న నిధుల వరదకు అడ్డుకట్ట వేసే క్రమంలో తొలి అడుగు ముందుకు పడింది. ఇక నుంచి పాక్‌ ఎలాంటి సహాయం చేయాలన్నా ముందు వారు ఉగ్రవాదం అణిచివేసేందుకు ఏమేం చేశారో చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత సహాయం చేసే విషయం ఆలోచిస్తాం' అని తెలిపారు. వాస్తవానికి పాక్‌కు అమెరికా నుంచి పెద్ద మొత్తంలోనే సహాయం అందుతుంటుంది. అయితే, వీటిని ఉగ్రవాదం అణిచివేసేందుకు కాకుండా పాక్‌ వాటిని మరింత ప్రోత్సహించేందుకు వాడుతుందని భారత్‌తో సహా పలు దేశాలు అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com